శాతవాహన యూనివర్సిటీలో సిబ్బంది కొరత తీరుతుందని ఎదురు చూస్తున్న విద్యార్థులకు మళ్లీ నిరాశే మిగిలింది. కొత్తగా ఏర్పాటు చేసిన ఇంజినీరింగ్, లా కళాశాలల్లో ఖాళీల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం సోమవారం నిర్వహించిన కేబినెట్లో ఆమోదం లభించింది. కానీ, యూనివర్సిటీలో ఉన్న ఖాళీలు భర్తీ చేసేందుకు ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం నిరాశ పరిచించింది. అయితే, కాంట్రాక్ట్ పోస్టుల భర్తీకి సైతం వర్సిటీ అధికారులు సోమవారం ప్రకటన విడుదల చేసినా, అందులో సగానికి పైగా పోస్టుల్లో పలువురు ఉద్యోగాలు చేస్తుండడంతో భర్తీ అయ్యే స్థానాలు పది నుంచి 20 మధ్యే ఉంటాయని నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.
కరీంనగర్ కమాన్‌చౌరస్తా, జూన్ 25 : శాతవాహన విశ్వవిద్యాలయంలో 114 మంది బోధన, బోధనేతర సిబ్బంది అవసరం ఉండగా, 63 మంది బోధనా సిబ్బందితోనే నెట్టుకొస్తున్నారు. వీరిలో 16 మంది మాత్రమే రెగ్యులర్ ఉద్యోగులు ఉండగా, అందులో ఇద్దరు ప్రొఫెసర్లు, ఆరుగురు అసోసియేట్ ప్రొఫెసర్లు, ఎనిమిది మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉన్నారు. ప్రొఫెసర్ పోస్టులు 10, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు 16, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు 21 ఖాళీగా ఉండగా, ప్రస్తుతం ఈ పోస్టుల్లో 47 మంది కాంట్రాక్ట్, పార్ట్ టైం, గెస్ట్ ఫ్యాకల్టీ పద్ధతిలో కొనసాగుతున్నారు. అలా కాకుండా దాదాపు 51 మంది బోధనేతర సిబ్బంది అవసరం ఉండగా, తొమ్మిది మందితో మాత్రమే కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. ఇంకా 42 ఖాళీగా ఉండగా, ప్రస్తుతం కాంట్రాక్ట్, పార్ట్ టైం, గెస్ట్ ఫ్యాకల్టీ పద్ధతిలో నడిపిస్తున్నారు.
కొత్తగా 120 పోస్టులు
శాతవావాహన యూనివర్సిటీ పరిధిలో హుస్నాబాద్‌లో ఏర్పాటు చేయనున్న ఇంజినీరింగ్ కళాశాలకు 87 పోస్టులను, లా కళాశాలకు 33 పోస్టులను మంజూరు చేసింది. అందులో 68 పోస్టులు టీచింగ్, 52 నాన్ టీచింగ్ కింద కేటాయించింది. అలాగే, శాతవాహన యూనివర్సిటీ ఆధ్వర్యంలో అధికారులు రెగ్యులర్ కోర్సులకు 10 మందిని, సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులకు 25 పోస్టులకు తాత్కాలిక ప్రాతిపదికన దరఖాస్తులు కోరుతూ నోటిఫికేషన్ విడుదల చేశారు. అయితే, అందులో సగానికి పైగా ఇదివరకే విధులు నిర్వహిస్తున్నారు.
కాంట్రాక్ట్ నోటిఫికేషన్ వీటికే..
శాతవాహన యూనివర్సిటీలో రెగ్యులర్ కోర్సులైన ఎంబీఏ 2, ఎంకాం 2, ఎంఏ (ఎకనామిక్స్) 2, ఎంఏ (ఆర్గానిక్ కెమిస్ట్రీ) 2, ఎంఎస్సీ(ఫిజికల్ కెమిస్ట్రీ) 2 పోస్టులకు దరాఖాస్తులు కోరారు. అలాగే, సెల్ఫ్ ఫైన్స్ కోర్సుల్లో ఎంఏ(తెలుగు) 4, ఎంఏ( ఇంగ్లీష్) 4, ఎంఎస్సీ(ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ) 4, ఎంఎస్సీ (బాటనీ) 3, ఎంఎస్సీ(కంప్యూటర్ సైన్స్) 3, ఎంఎస్సీ(మ్యాథమెటిక్స్) 2 పోస్టులకు, గోదావరిఖనిలోని యూనివర్సిటీ పీజీ కళాశాలలో ఎంబీఏలో 2, ఎంకాంలో 3 పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల చేశారు. వీరు సంబంధిత సబ్జెక్టుల్లో 55 శాతం మార్కులతో ఉండి, నెట్, సెట్ లేదా స్లెట్ అర్హతతో పీహెచ్డీ ఉన్న అభ్యర్థులకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు.
వర్సిటీకి పోస్టులు కేటాయించకపోవడం శోచనీయం
శాతవాహన యూనివర్సిటీకి మంజూరైన ఇంజినీరింగ్, లా కళాశాలలకు సిబ్బందిని మంజూరు చేసి, రెగ్యులర్ కోర్సులకు సిబ్బందిని నియమించక పోవడం శోచనీయం. రాష్ట్రంలో యూనివర్సిటీలను అభివృద్ధి చేస్తామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కాలయాపన చేస్తున్నది. ఈ క్రమంలో యూనివర్సిటీలో చదివే విద్యార్థుల సంఖ్య క్రమంగా తగ్గుతూ వస్తున్నది. ఇంజినీరింగ్ కళాశాల హుస్నాబాద్ తరలిండంతో పాటు, కరీంనగర్ జిల్లా కేంద్రంలో యూనివర్సిటీని నిర్వీర్యం చేయడాన్ని విద్యార్థులు, ప్రజలు గమనిస్తున్నారు.
– మచ్చ రమేశ్, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి
ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం
కాంగ్రెస్ ప్రభుత్వం శాతవాహన యూనివర్సిటీని కాదని, కొత్తగా కేటాయించిన కళాశాలలకు సిబ్బందిని కేటాయించడం వర్సిటీపై వారికున్న నిర్లక్ష్యానికి నిదర్శనం. అలాగే, ఇదివరకే ఉన్న కాంట్రాక్ట్ పోస్టులను కొత్త పోస్టులుగా చూపుతూ వర్సిటీ అధికారులు నోటిఫికేషన్ విడుదల చేయడం సరికాదు. ఇప్పటికైనా యూనివర్సిటీ విషయంలో ప్రభుత్వం స్పందించకుంటే, సిబ్బంది కేటాయింపులో ఇంకా నిర్లక్ష్యం చేస్తే ఆందోళనలకు సైతం వెనుకాడం.
– చుక్క శ్రీనివాస్, బీఆర్ఎస్వీ శాతవాహన యూనివర్సిటీ ఇన్చార్జి