కోరుట్ల, ఏప్రిల్ 23 : కాళేశ్వరం ప్రాజెక్టుపై హైకోర్టు తీర్పుతో కాంగ్రెస్ కుట్రలు పటాపంచలు అయ్యాయని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల స్పష్టం చేశారు. ఘోష్ కమిషన్ పేరిట రెండున్నరేళ్లుగా కేసీఆర్‌పై కక్షగట్టి రాజకీయాలు చేసిన సీఎం రేవంత్‌కు హైకోర్టు తీర్పు చెంపపెట్టులాంటిందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వానికి బుద్ధిరావాలని హితవు పలికారు. హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని చెప్పారు. కోరుట్ల పట్టణంలోని తన క్యాంపు కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పీసీ ఘోష్ కమిషన్ కాదని పీసీసీ నివేదిక అని బీఆర్ఎస్ చెప్పిందే నిజమని ఈ తీర్పుతో తేటతెల్లమైందని స్పష్టం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టు అంటే కేవలం మేడిగడ్డ మాత్రమే కాదని, ఎన్నో బరాజ్‌లు, కాలువలు, సొరంగాలు, పంప్‌హౌస్‌ల సమూహమని పేర్కొన్నారు.

కాళేశ్వరం బాగుపడితే కేసీఆర్‌కు పేరు వస్తుందని రేవంత్‌రెడ్డి కుట్రలకు తెరలేపారని ధ్వజమెత్తారు. కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందని, రూ.లక్ష కోట్లు నీళ్ల పాలయ్యాయని నోటికొచ్చినట్లు మాట్లాడిన ఆ పార్టీ నాయకులకు మళ్లీ కాళేశ్వరం ప్రాజెక్టే దిక్కయిందన్నారు. ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో వచ్చే ఏడాది వర్షపాతం తక్కువగా ఉండబోతుందనే హెచ్చరికలతో సీఎం మేడిగడ్డకు పరిగెత్తుకుంటూ వెళ్లారన్నారు. కాళేశ్వరమే రాష్ర్టానికి ప్రాణాధారమని, తాగునీరు, లక్షల ఎకరాలకు సాగునీరు అందించే అద్భుతమైన ప్రాజెక్టు అని చెప్పారు. రేవంత్‌రెడ్డి ఇప్పటికైనా చిల్లర రాజకీయాలు మాని కుంగిన రెండు పిల్లర్లకు వెంటనే మరమ్మతులు చేయించాలని డిమాండ్ చేశారు. సమావేశంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు దారిశెట్టి రాజేశ్, పట్టణ మైనార్టీ అధ్యక్షుడు ఫహీం, కౌన్సిలర్లు మోసీన్, సురేందర్, మహేశ్, నాయకులు మధు, నరేశ్, వినోద్, తదితరులు పాల్గొన్నారు.
గోదావరిఖని, ఏప్రిల్ 23: సాగుకు నీరిచ్చి ఆదుకోవాలనే ఆలోచన ఈ రేవంత్ ప్రభుత్వానికి లేదని, ఇది చేతగాని ప్రభుత్వమని బీఆర్ఎస్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు, రామగుండం మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ధ్వజమెత్తారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఘోష్ కమిషన్ నివేదిక చెల్లదని హైకోర్టు ఇచ్చిన తీర్పుతో కాంగ్రెస్ కుట్రలు బయటపడ్డాయని మండిపడ్డారు. ఇది సర్కారుకు చెప్పు దెబ్బలాంటిదని విమర్శించారు. గోదావరిఖనిలోని ప్రెస్‌క్లబ్‌లో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌ను బద్నాం చేసేందకు కాంగ్రెస్ సర్కారు ఘోష్ కమిషన్ వేసిందని మండిపడ్డారు. కాళేశ్వరం కూలిపోయిందని, లక్ష కోట్ల అవినీతి జరిగిందని దుర్మార్గపు ప్రచారం చేసిన సీఎం రేవంత్‌రెడ్డి ఇప్పుడేం చెబుతారని ప్రశ్నించారు. హైకోర్టు తీర్పుతో నిజం బయటపడిందన్నారు. రెండు పిల్లర్లు కుంగిపోయాయని రెండున్నరేళ్లుగా గోదావరిని ఎండబెట్టి, 16 నెలలు కమిషన్ల పేరిట సమయాన్ని వృథా చేశారని మండిపడ్డారు. ఇప్పటికైనా మరమ్మతులు చేయాలని, అసత్యపు ప్రచారాలు బంద్ చేసి ఎత్తిపోతలను ప్రారంభించాలని బీఆర్ఎస్ తరపున డిమాండ్ చేస్తున్నామన్నారు. అలాగే సీఎం రేవంత్‌రెడ్డి తప్పుడు ఆరోపణలుగా పేర్కొంటూ ముక్కు నేలకురాసి రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇక్కడ బీఆర్ఎస్ నాయకులు మూల విజయారెడ్డి, గోపు ఐలయ్య యాదవ్, కవిత సరోజని, తదితరులు ఉన్నారు.
మంథని, ఏప్రిల్ 23 : హైకోర్టు తీర్పుతోనైనా సీఎం రేవంత్, ఆయన బ్యాచ్ కళ్లు తెరవాలని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ హితవు పలికారు. ఇప్పటికైనా రేవంత్‌రెడ్డి ఒర్రుడు బంద్ చేయాలని, అబద్ధాలు మానుకొని పరిపాలనపై దృష్టి పెట్టాలని సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్టే రాష్ర్టానికి శ్రీరామ రక్ష అని గ్రహించాలని, రెండు కుంగిన పిల్లర్లకు మరమ్మతులు చేయించాలని డిమాండ్ చేశారు. గురువారం మంథని పట్టణంలోని రాజగృహలో హైకోర్టు తీర్పుపై హర్షం వ్యక్తం చేస్తూ స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. హైకోర్టు తీర్పుతో ఘోష్ కమిషన్ నివేదిక పీసీసీ స్క్రిప్ట్‌గా అర్థమవుతున్నదని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో అజ్ఞానులకు జ్ఞానం రావాలని కోరుకున్నారు.

హైకోర్టు తేల్చి చెప్పినా సీఎం రేవంత్ రెడ్డి కళ్లు తెరవడని, అందుకే ఆయన బ్యాచ్‌ను కేటీఆర్ ‘దండుపాళం బ్యాచ్’ అని అంటున్నాడని ఎద్దేవా చేశారు. మూడు సార్లు భారీ వర్షాలు, లక్ష క్యూసెకుల వరదను తట్టుకొని నిలబడ్డ కాళేశ్వరం ప్రాజెక్టుపై రేవంత్ రెడ్డి కళ్లులేని కబోధిలా మాట్లాడుతున్నాడని విమర్శించారు. ఈసారి వర్షాలు తకువగా ఉంటాయని, నీళ్లకు ఇబ్బంది ఏర్పడుతుందని వాతావరణశాఖ హెచ్చరించినా ప్రభుత్వం అప్రమత్తం కావడం లేదని మండిపడ్డారు. రాష్ట్ర రైతుల ప్రయోజనాల దృష్ట్యా వెంటనే స్పందించి కుంగిన రెండు పిల్లర్లను పునరుద్ధరించాలని, సాగునీరు అందించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో భూపాలపల్లి మాజీ జడ్పీ చైర్ పర్సన్ జక్కు శ్రీహార్షిణి, నాయకులు ఏగోళపు శంకర్ గౌడ్, తగరం శంకర్‌లాల్, జక్కు రాకేశ్, మాచిడి రాజు గౌడ్, శంకేశి రవీందర్, పోతిపెద్ది కిషన్ రెడ్డి, రవీందర్ రావు, అత్తె చంద్రమౌళి, గుజ్జుల రాజిరెడ్డి, మాజీ ఎంపీటీసీ పెగడ శ్రీనివాస్, కొండ రవీందర్, పుప్పాల తిరుపతి పటేల్, కలవేన కొమురయ్య యాదవ్,కండె రమేశ్, ఎస్కే యాకుబ్ పాల్గొన్నారు.
తిమ్మాపూర్, ఏప్రిల్ 23: తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌వైపు ధర్మం నిలిచిందని, జస్టిస్ గోష్ కమిషన్ ఇచ్చిన నివేదిక తుస్ అయ్యిందని మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ స్పష్టం చేశారు. ఇప్పటికైనా కాళేశ్వరంపై తప్పుడు ప్రచారాన్ని మానుకోవాలని అధికార పార్టీ నాయకులకు హితవుపలికారు. మేడిగడ్డ వద్ద రెండు పిల్లర్లకు మరమ్మతు చేసి, సాగుకు నీటిని అందించాలని డిమాండ్ చేశారు. తిమ్మాపూర్‌లోని బీఆర్ఎస్ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావుతో కలిసి ఆయన మాట్లాడారు.

ఓటుకు నోటు కేసులో సీఎం రేవంత్‌రెడ్డి త్వరలోనే జైలుకు వెళ్తారని తెలిపారు. వడ్ల కొనుగోళ్లలో ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు క్వింటాల్‌కు రెండు కిలోల కమీషన్ ఒప్పందం కుదిరిందని ఆరోపించారు. తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌పై అకసుతో వేసిన పీసీ ఘోష్ కమిషన్ సరికాదని కోర్టు తీర్పు వచ్చినా కాంగ్రెస్ తప్పును ఒప్పుకోవడం లేదని, అదీ పీసీసీ కమిషన్ అని ఆనాడే చెప్పామని గుర్తు చేశారు. కేసీఆర్‌కు భయపడి ఆయన సభ రోజే కాళేశ్వరంలో సీఎం సభ పెట్టుకున్నారని, దానికి మహిళలు, రైతులను బలవంతంగా తీసుకెళ్లారని తెలిపారు. జననేత కేసీఆర్‌కు ఆదరణ ఉంటుందని జగిత్యాల సభ గుర్తు చేసిందన్నారు. గతంలో వేసవిలో సైతం ప్రాజెక్టులు నీటితో కళకళలాడాయని, ప్రస్తుతం ఎల్ఎండీ ఖాళీ అయి ఎండిపోయే దశకు చేరిందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రావుల రమేశ్, నాయకులు పాల్గొన్నారు.
పెద్దపల్లి కమాన్, ఏప్రిల్ 23 : తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌ను బద్నాం చేసేందుకే సీఎం రేవంత్‌రెడ్డి కాళేశ్వరంపై దుష్ప్రచారం చేశారని బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఇప్పుడు హైకోర్టు తీర్పుతో ఆ కుట్రలు బట్టబయలయ్యిందని స్పష్టం చేశారు. ప్రాజెక్టుల నిర్వహణలో కాంగ్రెస్ సర్కారు అవలంభిస్తున్న నిర్లక్ష్యాన్ని తాము ఖండిస్తున్నామని చెప్పారు. రైతులకు పూర్తి స్థాయిలో సాగునీరు అందించకుంటే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. పెద్దపల్లి మండలం రాఘవాపూర్‌లోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ సర్కారు వేసిన జస్టిస్ ఘోష్ కమిషన్ నివేదిక చెల్లదంటూ హైకోర్టు ఇచ్చిన తీర్పును యావత్ తెలంగాణ ప్రజానీకం స్వాగతించిందన్నారు. ఈ తీర్పుతో కేసీఆర్ పాలనపై ప్రజల్లో మరింత విశ్వాసం పెరిగిందని ఆశాభావం వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రపంచంలోనే ఒక అద్భుతమని, ఇది తెలంగాణ రాష్ర్టానికి ప్రాణేశ్వరమని చెప్పారు.
కల్పతరువు లాంటి కాళేశ్వరంపై రెండున్నరేళ్ల నుంచి కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు అసత్య ప్రచారాలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. నాడు రెండు పిల్లర్లు కుంగిపోతే మొత్తం ప్రాజెక్టు అంతా కూలిపోయినట్టు నాడు రేవంత్‌రెడ్డి దుష్ప్రచారాలు చేసిన చేశారని, నేడు రూ.400 కోట్లతో పిల్లర్లు బాగవుతాయనడం మళ్లీ ఆయనే చెప్పడం చూస్తే కుట్రలు అర్థమవుతున్నాయన్నారు. ఇప్పటికైనా చిల్లర రాజకీయాలు మానుకోవాలని, మేడిగడ్డ వద్ద రెండు పిల్లర్లకు మరమ్మతు చేయించి సాగునీరు అందించాలని హితవు పలికారు. ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 420 హామీలను అమలు చేయకుండా ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావుపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని దుయ్యబట్టారు. తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని, లేదంటే వచ్చే ఎన్నికల్లో గుణపాఠం తప్పదని హెచ్చరించారు. సమావేశంలో పెద్దపల్లి జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ జీ రఘవీర్‌సింగ్, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు ఉప్పు రాజ్‌కుమార్, మాజీ జడ్పీటీసీ వంగళ తిరుపతిరెడ్డి, మాజీ ఎంపీపీలు తానిపర్తి స్రవంతి-మోహన్‌రావు, నూనేటి సంపత్, నాయకులు పూదరి చంద్రశేఖర్, పెంచాల శ్రీధర్, వెన్నం రవీందర్, కేడం కిశ్‌ర్, జూపల్లి సందీప్‌రావు తదితరులు ఉన్నారు.