గోదావరిలో ఇసుక మాఫియా రెచ్చిపోతున్నది. ధర్మపురి మండలం చివరి గ్రామం ఆరెపల్లి కేంద్రంగా బరితెగిస్తున్నది. పగలూ రాత్రి అనే తేడా లేకుండా, డోజర్లను పెట్టి ఇష్టారాజ్యంగా తోడుతున్నది. నీటి పాయలను కూడా మలుపుతూ.. 20 మీటర్ల మేర లోతులో తవ్వుతున్నది. ఆపై నిత్యం వందలాది ట్రాక్టర్లలో తీసుకెళ్లి గ్రామంలో డంప్ చేస్తూ.. టిప్పర్లలో బయటికి తరలిస్తూ నెలకు రూ.3కోట్లకు పైనే దందా చేస్తున్నది. సహజ వనరులను దోపిడీ చేస్తూ.. ప్రభుత్వ ఖజానాకు గండికొడుతున్నా యంత్రాంగం చోద్యం చూడడంపై జలవనరుల శాఖ నిపుణులు, ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతున్నది. ఇప్పటికైనా మేలుకొని సహజవనరులను కాపాడాలనే డిమాండ్ వినిపిస్తున్నది.
ధర్మపురి, మే 29: గోదావరి తీరం ఆనుకొని ఉన్న ధర్మపురి మండలంలో ఇసుక దందా జోరుగా సాగుతున్నది. నది ఒడ్డున ఉన్న ఆరెపల్లి గ్రామం అక్రమ రవాణాకు అడ్డాగా మారింది. ఈ గ్రామ ఒడ్డు నుంచి అవతలి ఒడ్డు దాకా దాదాపు రెండుకిలోమీటర్లకు పైనే నది వెడల్పు ఉంటుంది. ఇదే అక్రమార్కులకు వరంలా మారింది. మండలంలో ఈ గ్రామం చివరగా ఉండడంతో ఎంతతోడుకుంటే అంతఅన్నట్టు హద్దు లేకుండా పోయింది. ప్రస్తుతం వేసవి కావడంతో ప్రవాహం తగ్గడం, నది ఒకటి, రెండు పాయలుగా మాత్రమే ప్రవహిస్తుండడంతో ఇసుకాసురులు రెచ్చిపోతున్నారు. ట్రాక్టర్లు, డోజర్లను అవలీలగా నదిలోకి దించి, పగలు, రాత్రి తేడా లేకుండా ఇసుకను ఎడాపెడా తోడేస్తున్నారు. అవసరమైతే పాయలుగా ప్రవహించే నదీ ప్రవాహ దిశను మార్చి తవ్వుతున్నారు. నిత్యం పెద్ద సంఖ్యలో ట్రాక్లర్లు, టిప్పర్లలో తరలిస్తున్నారు. ఎవరైనా అడిగితే ఎంతటి దౌర్జన్యానికి కూడా వెనుకాడని పరిస్థితి ఉంది. మాఫియాపై చర్యలు తీసుకోవాల్సిన అధికారులు చూసీచూడనట్లుగా వ్యవహరించడం విమర్శలకు తావిస్తున్నది. అధిక లోడ్‌తో వెళ్తున్న వాహనాల వల్ల ఆరెపల్లి గ్రామమే కాకుండా దొంతాపూర్, తీగలధర్మారం, తదితర గ్రామ రహదారులు దెబ్బతింటుండగా, దుమ్ము కాలుష్యంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. టిప్పర్ల హడావిడితో రాత్రుళ్లు నిద్రలు పట్టడం లేదని వాపోతున్నారు.
ఆరెపల్లిలో సాగుతున్న ఇసుక అక్రమ రవాణా చిన్నస్థాయి దందా కాదు. నెలకు కోట్ల రూపాయల దందా సాగుతున్నదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. డోజర్లను నదిలో నుంచి ఇసుకను తోడి ట్రాక్టర్లలో నింపి, డంపులుగా పోగు చేసి అక్కడి నుంచి టిప్పర్లతో ఇతర ప్రాంతాలకు తరలించే వ్యవహారం రోజుకు వందల ట్రిప్పులతో సాగుతున్నదని స్థానికులు చెబుతున్నారు. గ్రామంలో ఇంటికో ట్రాక్టర్ అన్నట్టు ఉండడం చూస్తే అక్రమ రవాణా ఏ స్థాయిలో జరుగుతుందో అర్థమైపోతుంది. గ్రామంలో తక్కువలో తక్కువ 150 ట్రాక్టర్లు ఉన్నాయి. ఒక్కో ట్రాక్టర్ కనీసం 5ట్రిప్పుల ఇసుకను గోదావరి నుంచి ఒడ్డుకు చేరుస్తుంటుంది. ఒక్కో ట్రాక్టర్ ట్రిప్పు ధర రూ.1500 వరకు చార్జ్ చేస్తారు. అంటే ఒక్కో ట్రాక్టర్ రోజుకు కనీసం 5 ట్రిప్పుల ఇసుకను తోడినా సంపాదన రూ.7500 అవుతుంది. ప్రస్తుతం రోజుకు 150 ట్రాక్టర్లు నడుస్తుండగా, రూ.11లక్షల 25వేల విలువైన ఇసుక తరలిపోతున్నది. అంటే నెలకు రూ.3కోట్లకు పైనే దందా సాగుతున్నట్టు తెలుస్తున్నది.
గోదావరి నదిలో కనిపించే ఇసుక ఒక్కరోజులో ఏర్పడేది కాదు. ఇది వేల సంవత్సరాల ప్రకృతి ఫలం. అవసరానికి మించి తవ్వితే భూగర్భ జలాలు తగ్గిపోవడంతో పాటు నదీ ప్రవాహ దిశమారుతుంది. వరదల ప్రమాదం పెరుగుతుంది. వంతెనల పునాదులు బలహీనపడే ప్రమాదముంటుంది. నదీ జీవవ్యవస్థ కూడా దెబ్బతింటుందని జలవనరుల శాఖ నిపుణులు, భూగర్భ శాఖ నిపుణులు చెబుతున్నారు. ఇసుక అక్రమరవాణా అనేది కేవలం చట్ట ఉల్లంఘన మాత్రమే కాదు. అది ప్రకృతి సంపదపై జరుగుతున్న దోపిడీ. దానిని అడ్డుకోవడంలో గనులు, భూగర్భశాఖ పాత్ర అత్యంత కీలకం. ఈ శాఖతో పాటు పోలీస్ శాఖ, రెవెన్యూ, రవాణా శాఖ, నదుల భద్రతకోసం ఇరిగేషన్ శాఖ, మొత్తం వ్యవహారాన్ని సమన్వయం చేయడానికి జిల్లా యంత్రాంగం ఉంది. ఇన్ని శాఖలు, ఇంతటి వ్యవస్థ ఉన్నా అక్రమ రవాణా మాత్రం ఆగకపోవడం దారుణమని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు నిజంగా చిత్తశుద్ధితో ముందుకు వస్తే అక్రమ రవాణాకు చెక్ పెట్టవచ్చని చెబుతున్నారు.
ఇసుక రవాణాకు అధికారులు అనుమతి ఇచ్చినా.. నిబంధనల ప్రకారం కేవలం రెండు క్యూబిక్మీటర్లలోతు వరకే తోడాల్సి ఉంటుంది. కానీ, ఆరెపల్లిలో అడ్డూఅదుపు లేకుండా దాదాపు 20 మీటర్ల లోతువరకు తోడేస్తున్నారు. ఇది సాధారణ తవ్వకం కాదని, అత్యంత ప్రమాదకరమని, నది సహజ నిర్మాణాన్నే దెబ్బతీసే చర్యగా అధికారులు చెబుతున్నారు. దీని వల్ల భగర్భ జలాలు పడిపోవడంతో పాటు వరదల సమయంలో నీటివేగం పెరిగి సమీప గ్రామాలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంటుందని హెచ్చరిస్తున్నారు.
ఇసుక అక్రమ రవాణాపై ఎప్పటికప్పుడు దాడులు చేస్తున్నాం. కొద్ది రోజుల క్రితమే పోలీస్‌శాఖతో సంయుక్తంగా దాడులు చేసి దాదాపు 3వేల డంపులు స్వాధీనం చేసుకున్నాం. అనుమతులు లేకుండా ఇసుకను తరలిస్తే చర్యలు తప్పకుండా తీసుకుంటాం. ఇసుక అక్రమ రవాణా పై నిరంతరం నిఘా ఉంటుంది.
– శ్రీనివాస్, తహసీల్దార్ (ధర్మపురి)