Sand mining | మెట్పల్లి రూరల్, ఆగస్టు 8: మెట్పల్లి మండలం ఆత్మకూర్ పెద్దవాగులో ఏర్పాటు చేసిన ఇసుక రీచ్‌ను ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఈమేరకు ఆత్మకూర్ గ్రామస్థులు శుక్రవారం మెట్పల్లి పట్టణంలోని ఆర్డీఓ కార్యాలయానికి మూకుమ్మడిగా తరలివచ్చి ఆందోళన చేపట్టారు. ఆర్డీఓ కార్యాలయం వద్దకు మెట్పల్లి ఎస్సై కిరణ్‌కుమార్ వెళ్లి గ్రామస్థులను సముదాయించారు.
అనంతరం ఆర్డీఓ శ్రీనివాస్‌ను కలిసి ఆత్మకూర్ పెద్దవాగులో ఇసుక రీచ్‌ను రద్దు చేయాలని వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా గ్రామస్థులు మాట్లాడుతూ ఆత్మకూర్‌కు తాగు, సాగునీటికి పెద్దవాగే ఏకైక ఆధారమని తెలిపారు. వాగు మధ్యలో ఉన్న బావి ద్వారానే తమ గ్రామానికి తాగునీటి సరఫరా జరుగుతుందని పేర్కొన్నారు. పైభాగంలో ఉన్న రాళ్లవాగు నిండి మత్తడి పోస్తేనే తమ పెద్దవాగులోకి నీరు వస్తుందని, వర్షాభావ పరిస్థితులు తలెత్తితే వాగు ఎడారిగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ దశలో ఆత్మకూర్ పెద్దవాగును ప్రభుత్వం ఇసుక రీచ్‌గా గుర్తించిందన్నారు. అలాగే ఇందిరమ్మ ఇళ్లతో పాటు కథలాపూర్ మండలం కలికోట సూరమ్మ ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన ఇసుక రవాణాకు అనుమతినిచ్చారని వివరించారు. దీంతో పెద్దవాగు నుంచి పెద్ద ఎత్తున ఇసుక రవాణా జరగడంతో తమ గ్రామంలో భూగర్భ జలాలు అడుగంటి తాగు, సాగునీటికి ఇబ్బందులు తలెత్తుతున్నాయని వాపోయారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఆత్మకూర్ పెద్దవాగులో ఇసుక రీచ్‌ను తక్షణమే రద్దు చేయాలని కోరారు.