జమ్మికుంట, జనవరి 6: ఇసుక మాఫియా బరితెగింపు చర్యలకు పాల్పడుతున్నది. ఇసుక అక్రమంగా తరలించే క్రమంలో అడ్డువచ్చే వ్యక్తులపైకి వాహనాలను ఎక్కించేందుకు సైతం వెనుకాడడం లేదని తెలిసింది. గతంలో ప్రమాదాలెన్నో జరిగాయి. కొన్ని కావాలన్నట్లుగానే చేశారనే ఆరోపణలున్నాయి. తాజాగా మున్సిపల్ పరిధిలోని ప్రభుత్వ డిగ్రీ, పీజీ కళాశాల క్రీడా మైదానంలో వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వేసుకున్న ట్రాక్‌పై నుంచే ఇసుక వాహనాలు రయ్.. రయ్ మంటూ చక్కర్లు కొడుతుండగా, వాకర్స్ బెంబేలెత్తిపోతున్నారు. ఈ క్రమంలో సోమవారం ఉదయం పలువురు వాకర్లు వాహనదారులను నిలదీశారు. ఇంత స్పీడ్‌గా వెళ్లడమేంటి..?మీదకు వచ్చేలా తోలుతున్నారు..? ఇదేం పద్ధతి..? అధికారులకు చెబుతామని హెచ్చరించారు. కానీ, అక్రమార్కులు ఏదీ పట్టించుకోలేదు సరికదా, ఎవరికి చెబుతారో చెప్పుకొండంటూ.. అదే స్పీడ్‌లో వాహనాలను తీసుకెళ్లడం వాకర్స్‌ను ఇబ్బందులకు గురిచేసింది.
మొన్న కోరపల్లి.. నిన్న మడిపల్లి.. నేడు జమ్మికుంటలో
ఇసుక అక్రమ రవాణాదారుల డ్రైవింగ్ అంటేనే ప్రజలంతా జంకుతున్నారు. గతంలో విలాసాగర్ నుంచి వచ్చే వాహనాలను కోరపల్లి గ్రామ ప్రజలు అడ్డుకున్నారు. గొడవలు జరిగాయి. అధికారులెవరూ పట్టించుకోకపోవడంతో స్థానికులు వెనక్కి తగ్గారు. ఇటీవల తనుగుల, గండ్రపల్లి నుంచి వచ్చే వాహనాలను ధర్మారం, కొత్తపల్లి ప్రజలు అడ్డుకున్నారు. మడిపల్లి గ్రామ ప్రజలైతే 20ట్రాక్టర్లను పట్టుకుని ఆందోళనకు దిగారు. అక్రమార్కులు ప్రజల మీదకు వాహనాలను ఎక్కించేందుకు యత్నించారు. అయితే, గ్రామస్తులంతా ఏకం కావడంతో ఇసుకాసురులు వాహనాలతో పారిపోయారు. ఇదిలా ఉండగా పట్టణంలోని ఓ స్కూల్ సమీపంలో రోడ్డు అభివృద్ధి పనుల్లో భాగంగా కల్వర్టు కడుతున్నారు. ఇసుకాసురుల వాహనాలు అటు వెళ్లే పరిస్థితి లేదు. దీంతో వాహనాలన్నీ డిగ్రీ కళాశాల మైదానం నుంచి ప్రధాన రోడ్డు మీదకు వస్తున్నారు. అందులో భాగంగా ఉదయం పూట వాకింగ్ ట్రాక్ నుంచి వాహనాలను ఇష్టానుసారంగా నడుపుతుండగా, వాకర్లు భయపడిపోతున్నారు. ఈ క్రమంలో వాకర్లు వాకింగ్ చేయడం లేదని తెలిసింది. అక్రమంగా ట్రాక్‌పైకి వచ్చి వాకర్లను ఇబ్బందులకు గురిచేస్తున్న మాఫియాపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
అడ్డూ అదుపులేని అక్రమ రవాణా
మానేరు పరీవాహక ప్రాంతాలైన విలాసాగర్, తనుగుల, గండ్రపల్లి గ్రామాల నుంచి నిత్యం వందలాది ట్రాక్టర్లలో ఇసుక అక్రమ రవాణా జరుగుతున్నది. ఇదంతా అధికారులకు తెలిసే సాగుతున్నదన్న విమర్శలున్నాయి. అప్పుడప్పుడూ రవాణా అడ్డుకున్నట్లు అధికారులు వ్యవహరిస్తున్న శైలిపై అనేక ఆరోపణలున్నాయి. ఉన్నతాధికారి జోక్యంతో ఇటీవల 70మందికి పైగా ఇసుక అక్రమ రవాణాదారులపై ఏకకాలంలో కేసులు పెట్టారు. వారంలో రెండుసార్లు స్టేషన్‌కు వచ్చి సంతకాలు పెడుతున్నారు. అయినా.. దందా మాత్రం ఆగడం లేదు. తెల్లవారుజాము నుంచి ఉదయం 10గంటల్లోపు అంతా జరిగిపోతున్నది. ఇక వాహనాల డ్రైవర్లకు లైసెన్సులు.. ట్రాక్టర్లకు నంబర్లు.. పత్రాలు కూడా ఉండవని సమాచారం. ముఖ్యంగా వాహనాలను డ్రైవింగ్ చేస్తున్నదంతా మైనర్లే కావడం, ఇదంతా అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి.