రాజన్న సిరిసిల్ల జిల్లాలో అధికారుల కక్ష సాధింపు చర్యలు కొనసాగుతున్నాయి. ఇసుక రీచ్‌ల అనుమతుల విషయంలోనూ అదే వైఖరి కొనసాగిస్తున్నారు. ఇందుకు నిదర్శనంగాఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్ గ్రామం నిలుస్తున్నది. గతంలో ఈ గ్రామంతో పాటు వెంకటాపూర్‌లో ఇసుక రీచ్‌లు ఉండగా, తాజాగా ఒక్క వెంటకాపూర్కే అనుమతి ఇచ్చి నారాయణపూర్‌ను విస్మరించడంతో వివాదం నెలకొన్నది. కొన్ని గ్రామాలకు అనుమతి ఇస్తున్న అధికారులు, మరికొన్ని గ్రామాలకు అభ్యంతరం చెబుతుండడంతో గ్రామాల మధ్య ‘పంచాయితీ’ రోజురోజుకూ ముదురుతున్నది. అధికారుల అసంబద్ధ నిర్ణయాలపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతుండగా, పలు గ్రామాల్లో ట్రాక్టర్లను అడ్డుకుంటూ తమ రీచ్‌లకు అనుమతి ఇవ్వాలన్న డిమాండ్ వస్తున్నది.
ఎల్లారెడ్డిపేట, మార్చి 29: గతంలో ఎల్లారెడ్డిపేట మండలంలోని వెంకటాపూర్, నారాయణపూర్‌కు, ముస్తాబాద్ మండలంలోని ఆవునూర్‌కు ఇసుక రీచ్‌లు ఉండేవి. ప్రభుత్వం మారిన తర్వాత మండలంలోని వెంకటాపూర్, ముస్తాబాద్ మండలంలోని ఆవునూర్‌కు మాత్ర మే అధికారిక ఇసుక రీచ్‌లుగా ప్రకటించారు. అయితే, నారాయణపూర్‌కు అనుమతి ఇవ్వకపోవడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా రు.
అధికారులు కావాలనే తమ గ్రామంలో ఇసుక రీచ్‌కు అనుమతి ఇవ్వకుండా కక్షసాధింపు చర్యలకు దిగారని మండిపడుతున్నారు. దీం తో సహజంగానే నారాయణపూర్ సమీప గ్రామాల ప్రజలు ఇసుక తెచ్చుకోవాలంటే వెంకటాపూర్ నుంచి తెచ్చుకోవాల్సి వస్తున్నదని వాపోతున్నారు. అయితే, ఇదే అదనుగా వెంకటాపూర్ వారు ఒక్కో ట్రిప్పుకు రూ.3 వేల నుంచి రూ. 3500 వరకు వసూలు చేస్తున్నారు. ఇది మధ్యతరగతి వర్గాలకు కొంత ఇబ్బందులను తెస్తున్నది.
ఇటీవల నారాయణపూర్ గ్రామస్తుల ఒత్తిడి మేరకు నారాయణపూర్, రాగట్లపల్లి ట్రాక్టర్ అసోషియేషన్ వాళ్లు తమ రీచ్‌కు అనుమతివ్వాలని కోరినప్పటికీ అధికారులు వెంకటాపూర్ నుంచి తెచ్చుకోవాలని చెప్పారు. దీంతో ఇటీవల నారాయణపూర్ ట్రాక్టర్ అసోసియేషన్ వాళ్లు వెంకటాపూర్‌కు వెళ్తే వాళ్లు తమ రీచ్‌లోకి రావొద్దంటూ అభ్యంతరం చేయ గా, చేసేదేమీలేక వెనక్కి వెళ్లిపోయారు.
ఇదే సమయంలో ముస్తాబాద్ మండలం ఆవునూర్‌కు అధికారికంగా రీచ్ ఉన్నప్పటికీ శనివారం ముస్తాబాద్ మండలం గూడెంలో సీసీరోడ్డు నిర్మాణానికి వెంకటాపూర్ నుంచి అక్కడి ట్రాక్టర్ల ద్వారా ఇసుకను తరలించేందుకు అధికారులు అనుమతి ఇచ్చారు. దీంతో వెంకటాపూర్ ట్రాక్టర్లను సుమారు వంద మంది ఆవునూర్ ట్రాక్టర్ అసోసియేషన్ సభ్యులు అడ్డుకున్నారు. తమ కు రూ.5 లక్షల వరకు ప్రభుత్వం నుంచి డబ్బులు రావాలని, సదరు బకాయిలు ఇచ్చే వరకు ఏ ట్రాక్టర్‌నూ రానివ్వబోమని చెప్పడంతో అధికారులు ట్రాక్టర్లను వెనక్కి పంపారు.
అదే ఇసుకను ఎల్లారెడ్డిపేటలోని పలు గ్రామాల్లో జరిగే అభివృద్ధి పనులకు పంపేందుకు అధికారులు ప్రయత్నించడంతో నారాయణపూర్ ట్రాక్టర్ అసోషియేషన్ సభ్యులు వెంకటాపూర్ ట్రాక్టర్లను తమ పరిధిలోకి రానివ్వమని రాగట్లపల్లిలో అడ్డుకోవడంతో అధికారులు తలలు పట్టుకున్నారు. చివరకు ఆయా ట్రాక్టర్లను ఆలయాల నిర్మాణానికి తరలించాల్సి వచ్చింది. రోజురోజుకూ ఇసుక పంచాయితీ గ్రామాల మధ్య చిచ్చు పెట్టే పరిస్థితి తెస్తున్నదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.