కమాన్చౌరస్తా, డిసెంబర్ 12 : సమగ్ర శిక్ష కాంట్రాక్టు ఉద్యోగుల పోరాటం ఉధృతమవుతున్నది. ఇప్పటికే చేపట్టిన దీక్షలు గురువారం మూడోరోజుకు చేరుకున్నాయి. ఉద్యోగులంతా సమ్మె చేస్తుండడంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సేవలు నిలిచి పోయాయి. సిరిసిల్లలో వంటా వార్పు చేపట్టి నిరసన తెలిపారు. కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట చేపట్టిన దీక్షలో ప్లకార్డులు పట్టుకుని నినాదాలు చేశారు. జగిత్యాలలో దీక్షలకు పీఆర్టీయూ-టీఎస్, రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్, విశ్రాంత ఉద్యోగుల సంఘం, టీపీటీఎఫ్ నాయకులతో పాటు పలువురు మద్దతు ప్రకటించారు.
పెద్దపల్లిలో ఎంఆర్సీ ఆఫీస్ ఎదుట మూడు రోజులుగా దీక్షలు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆయాచోట్ల సమగ్ర శిక్షా అభియాన్ కాంట్రాక్టు ఉద్యోగులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి వరంగల్లో ఇచ్చిన మాట ప్రకారం తమను రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చి ఏడాది గడిచినా ఏ ఒక్కటీ నెరవేర్చలేదని మండిపడ్డారు. ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని, లేదంటే పోరాటాన్ని విరమించేది లేదని స్పష్టం చేశారు.
కరీంనగర్లో సమ్మెకు పీఆర్టీయూ తెలంగాణ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు గోనె శ్రీనివాస్, టీపీటీఎఫ్ సీనియర్ నాయకుడు పోరెడ్డి దామోదర్ రెడ్డి, పీఆర్పీవో తెలంగాణ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ మండల ఆనందం మద్దతు తెలిపి మాట్లాడారు. సమగ్ర శిక్ష ఉద్యోగుల ప్రధాన డిమాండ్లు మినిమం టైమ్ సేల్, జీవిత బీమా, హెల్త్ కార్డులు, ఇతర ప్రభుత్వ మహిళా ఉద్యోగుల మాదిరిగా అన్ని రకాల సెలవులు ప్రభుత్వం ప్రకటించాలని విజ్ఞప్తి చేశారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి యాదగిరి శేఖర్ రావు, బీఎస్పీ జిల్లా అధ్యక్షుడు నల్లాల శ్రీనివాస్, డిస్ట్ట్రిక్ జనరల్ సెక్రెటరీ తిరుపతి, పీఆర్టీయూ తెలంగాణ కరీంనగర్ జిల్లా ప్రధాన కార్యదర్శి కేతిరి తిరుపతిరెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు మండల ఆనందం సందర్శించి మద్దతును తెలిపారు.
ఎన్నికల ముందు కాంగ్రెస్ నాయకులు ఇచ్చిన మాటను నెలబెట్టుకోకోవాలి. సమగ్ర శిక్ష ఉద్యోగులను రెగ్యులర్ చేస్తామని చెప్పి ఇప్పుడు మొఖం చాటేస్తున్నారు. చాలీ చాలని జీతం, అదనపు పని భారంతో మానసికంగా ఒత్తిడికి గురవుతున్నాం. మాకు పే స్కేల్ అమలు చేయాలి. ప్రభుత్వోద్యోగులతో సమానంగా పని చేస్తున్నాం. న్యాయమైన డిమాండ్లను నెరవేర్చకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తాం.
– కే జ్యోతి, స్పెషల్ ఆఫీసర్, కేజీబీవీ (ఓదెల)
‘సమగ్ర శిక్ష’ను విద్యాశాఖలో విలీనం చేయాలి. మాకు పనికి తగ్గ వేతనం ఇవ్వాలి. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో సమస్యలు పరిష్కరిస్తామని రేవంత్రెడ్డి చెప్పారు. కానీ, ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చినా పట్టించుకోవడం లేదు. గెలవక ముందు ఒకలా.. గెలిచాక మరోలా వ్యవహరిస్తున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. మా డిమాండ్లను నెరవేర్చి న్యాయం చేయాలి.
– కే సుప్రజ, సీఆర్పీ, జడ్పీహెచ్ఎస్, గుంజపడుగు (మంథని)