దేవుడు వరమిచ్చినా.. పూజారి కరుణించని చందంగా మారింది రేకుర్తి, విద్యానగర్ భూ బాధితుల పరిస్థితి. నాలుగు దశాబ్దాల క్రితం కొనుగోలు చేసిన భూములను నిషేధిత జాబితాలో చేర్చడం శాపంలా మారింది. వాటిని నిషేధిత జాబితా నుంచి వెంటనే తొలగించి క్రయవిక్రయాలకు వీలుగా అవకాశం కల్పించాలంటూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసినా.. ఇంకా నిషేధిత జాబితాలోనే కొనసాగిస్తుండడంతో సుమారు పదివేల ప్లాట్లు, ఆరువేల ఇండ్ల యజమానులు పడరాని పాట్లు పడుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లో అమ్ముకోలేక ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
కరీంనగర్ కలెక్టరేట్, జూన్ 1 : కరీంనగర శివారులోని రేకుర్తి గ్రామ 19, 20, 21 డివిజన్లలో గల 125 సర్వే నంబర్లలోని 536 ఎకరాలు, విద్యానగర్‌కు సంబంధించి 16 సర్వే నంబర్లలోని 115 ఎకరాల భూమిని అధికారులు 22/ఏ(1)9(డీ) సీలింగ్ యాక్టు కింద చేర్చారు. దీంతో ఆ భూముల యజమానులు ఎలాంటి లావాదేవీలు చేయకుండా మారగా, తాము ఆర్థికంగా అనేక ఇక్కట్లు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆయా భూముల్లో 80 శాతానికి పైగా గ్రామ, పురపాలక సంఘ అనుమతులతో ఇండ్లు నిర్మించుకోగా, ఆ కట్టడాలకు సంబంధించి ప్రభుత్వానికి పన్నులు కూడా చెల్లిస్తున్నారు. ఇటీవలే ఎల్ఆర్ఎస్ చెల్లించాలని సూచించినప్పుడు కూడా ఆన్లైన్లో చెల్లించినట్లు ప్లాట్ల యజమానులు చెబుతున్నారు.
ఆయా కాలనీల్లో రాకపోకలకు అనువుగా ఉండేందుకు సీసీ రోడ్ల నిర్మాణాలు, కట్టడాల్లో ఉండే వారికి తాగునీటి సౌకర్యం కల్పించేందుకు మిషన్ భగీరథ పైపులైన్లు కూడా ప్రభుత్వమే నిర్మించింది. అయితే, గతంలో సీలింగ్ యాక్టు అమల్లో ఉన్నప్పుడు ఒకే వ్యక్తి పేర వందల ఎకరాల భూమి ఉన్నట్లు గుర్తించి, 1997లో నివేదికలు పంపిన అధికారులు అనంతర కాలంలో జరిగిన పరిణామాలతో సీలింగ్ యాక్టు నుంచి సర్వే నంబర్లు తొలగించగా, సుమారు ముప్పై ఏళ్లుగా ఎలాంటి అవాంతరాల్లేకుండా క్రయవిక్రయాలు జరుగుతున్నాయి.
అయితే, గతేడాది నుంచి మళ్లీ సీలింగ్ యాక్టు పేర తిరకాసు పెడుతుండగా, క్రయవిక్రయాలు నిలిచిపోయాయి. దీంతో, అనేక మంది ఇక్కట్ల పాలవుతుండగా దిగువ మధ్య తరగతి కుటుంబాలకు చెందిన కొద్దిమంది తమ పిల్లల పెళ్లిళ్లు చేయలేక, ఉన్నత చదువులు చదివించలేక చిన్నాభిన్నమయ్యారు. దీనిపై పలువురు ప్లాట్ల యజమానులు హైకోర్టును ఆశ్రయించగా, క్రయవిక్రయాలకు అనుమతులివ్వాలంటూ ఆదేశాలిచ్చింది. అయినా, సంబంధితాధికారులు ఏమాత్రం పట్టించుకోకుండా నిషేధిత జాబితాలో నుంచి తొలగించడం లేదు. తమకు జరుగుతున్న అన్యాయంపై ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ‘ప్రజావాణి’లో కలెక్టర్‌ను కలిసి వేడుకుంటున్నా, ఫలితం ఉండడం లేదు. కలెక్టర్ స్పందించి తమకు న్యాయం చేయాలని, లేనిపక్షంలో తామంతా మూకుమ్మడిగా అఘాయిత్యాలు చేసుకోవాల్సి వస్తుందంటూ హెచ్చరిస్తున్నారు.
ఎల్ఆర్ఎస్ ఎలా తీసుకున్నరు?
నగర శివారులోని రేకుర్తి, విద్యానగర్‌లో గల 651 ఎకరాలు నిషేధిత జాబితాలో ఉంటే, ఇటీవల మున్సిపల్ అధికారులు ఎల్ఆర్ఎస్ కింద మా నుంచి డబ్బులు ఎందుకు వసూలు చేసినట్లో చెప్పాలి. మున్సిపల్ అధికారులు అనుమతిస్తేనే మేం ఇండ్లు నిర్మించుకున్నాం. ఈ ప్రాంతంలో భూములు కొనుగోలు చేసిన వాళ్లందరూ సామాన్యులమే. నిషేధాన్ని ఎత్తేయాలని మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పొన్నం ప్రభాకర్‌ను కూడా కలిసి విన్నవించాం. ఇప్పటివరకు ఎలాంటి స్పందనా లేదు. కోర్టు ఆదేశించినా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదు. ప్రతి సోమవారం ప్రజావాణికి వచ్చి ఫిర్యాదులు చేస్తున్నాం. అధికారుల చుట్టూ తిరిగి తిరిగి కాళ్లరిగిపోతున్నా, కనికరించడం లేదు.
– అరికెల బాల్‌రెడ్డి, కరీంనగర్
మాకు న్యాయం చేయాలి
మేం నలభై ఏళ్ల కింద విద్యానగర్‌లో రెండు ప్లాట్లు కొనుగోలు చేశాం. ఒక ప్లాటులో ఇల్లు నిర్మించుకున్నాం. మా ఇంటితోపాటు మరో ప్లాటు కూడా నిషేధిత జాబితాలో చేర్చారు. దీనిపై కోర్టుకు వెళ్తే అధికారుల నిర్ణయాన్ని తప్పుపడుతూ, వారి ఉత్తర్వులను కొట్టివేసింది. అయితే, అధికారులు మాత్రం నిషేధిత జాబితాలో నుంచి ఇప్పటికీ తొలగించలేదు. దీంతో, ఏడాదికాలంగా అనేక ఇబ్బందులు పడుతున్నాం. పిల్లల చదువుల కోసం పడరాని పాట్లు పడుతున్నాం. 1997లో అప్పటి కలెక్టర్ ఇచ్చిన నివేదికతో విద్యానగర్‌లోని 16 సర్వే నెంబర్లలో 115 ఎకరాలు సీలింగ్‌యాక్టులో చేర్చినట్లు అధికారులు పేర్కొంటున్నారు. అయితే, ఆ నివేదికను అనంతర కాలంలో కొట్టివేయడంతోనే ఇన్నాళ్లూ క్రయవిక్రయాలు జరిగి భూముల రిజిస్ట్రేషన్లు అయ్యాయి. 2025లో అధికారులు తిరిగి సీలింగ్ యాక్టు ప్రస్తావన తెచ్చి రిజిస్ట్రేషన్లు నిలిపేశారు. దీనిపై ప్రస్తుత కలెక్టర్ స్పందించి మాకు న్యాయం చేయాలి.