వేములవాడ టౌన్/ కరీంనగర్ రూరల్ /కొత్తపల్లి, అక్టోబర్ 8 : రాజన్న క్షేత్రం పులకించిపోయింది. మహిళల బతుకమ్మ ఆటపాటలతో మార్మోగింది. ఆనవాయితీ ప్రకారం ఏడు రోజులకు నిర్వహించిన సద్దుల బతుకమ్మ సంబురం అంబరాన్నంటింది. ఆడబిడ్డల సందడితో మూలవాగు మురిసిపోయింది. మంగళవారం ఉదయాన తీరొక్క పూలతో బతుకమ్మలను పేర్చిన మహిళలు, సాయంత్రం పట్టణంలోని కూడళ్ల వద్ద ఉంచి చీకటి పడేదాకా సంబురంగా ఆడిపాడారు. ఆ తర్వాత మూలవాగు తీసుకొచ్చి ఆటాపాటలతో హోరెత్తించారు. ఆ తర్వాత వాగులో బతుకమ్మలను నిమజ్జనం చేశారు. ‘పోయిరా గౌరమ్మ.. పోయిరావమ్మా’ అంటూ ఘనంగా వీడ్కోలు పలికారు. కరీంనగర్ జిల్లాలోని బొమ్మకల్, ఆసిఫ్‌నగర్, శ్రీనివాస్‌నగర్, రాఘవాపూర్, తోటకుంటపల్లిలోనూ సద్దుల బతుకమ్మ వేడుకలను వైభవంగా నిర్వహించారు.