కరీంనగర్, జూన్ 17 (నమస్తే తెలంగాణ) : బీఆర్ఎస్ సర్కారు తెచ్చిన రైతుబంధు పథకం దేశంలోనే ఒక సంచలనంగా మారింది. పలు రాష్ట్ర ప్రభుత్వాలు దీనిని తమ రాష్ర్టాల్లో అమలు చేయాలనే నిశ్చయానికి వచ్చాయి. ఏకంగా కేంద్ర ప్రభుత్వమే ఈ పథకాన్ని కాపీకొట్టి కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని అమలులోకి తెచ్చింది. 2018 వానకాలం సీజన్లో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ పథకాన్ని గొప్పగా ప్రారంభించింది. పెట్టుబ డుల కోసం రైతులు అప్పులు చేస్తూ వాటిని తీర్చలేని పరిస్థితుల్లో ఆత్మహత్యలు చేసుకుంటున్నారని,
ఫలితంగా అనేక రైతు కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నాయని గ్రహించిన రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ బృహత్తర పథకానికి శ్రీకారం చుట్టారు. ఈ పథకాన్ని కరీంనగర్ జిల్ల్లా నుంచే ప్రారంభించారు. మొదట ఎకరానికి రూ.4 వేల చొప్పున ఆ తర్వాత రూ.5 వేల చొప్పున అందించారు. కరోనా సీజన్లో ఆర్థికంగా ఎదురైన విపత్తును సైతం లెక్క చేయకుండా రైతుల ఖాతాల్లో నగదు జమచేసింది. సాగు చేసిన ప్రతి రైతుకూ ఈ పథకం కింద ఆర్థికసాయం అందింది. ఈ నేపథ్యంలో అత్యంత ఆదరణ పొందిన పథకాల్లో ఒకటిగా నిలిచి పోయింది.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పథకం పేరును రైతు భరోసాగా మార్చింది. ఈ పథకం కింద ప్రతి ఎకరాకు ప్రతి సీజన్‌కు 7,500 చొప్పున ఏడాదికి 15 వేలు ఇస్తామని, ఇది కౌలు రైతులకు కూడా వర్తిస్తుందని గత అసెంబ్లీ ఎన్నికల్లో హామీ ఇచ్చింది. అంతే కాకుండా వ్యవసాయ కూలీలకు కూడా ఏడాదికి 12 వేల చొప్పున ఆర్థికసాయం అందిస్తామని హామీలు గుప్పించింది.
అయితే, అధికారంలోకి వచ్చిన తర్వాత గత యాసంగిలో రైతుబంధు మాదిరిగానే ఎకరాకు 5 వేల చొప్పున మాత్రమే విడుదల చేసింది. ఇది కూడా రైతులందరికీ అందలేదు. గత యాసంగిలో 2,03,096 మంది రైతుల 182.01 కోట్లు ఇవ్వాల్సి ఉండగా, నాలుగైదు ఎకరాలున్న రైతుల వరకే ఆర్థికసాయం అందింది. ఐదెకరాలకుపైగా ఉన్న రైతులకు నిరాశే మిగిలింది. వచ్చే వానకాలం సీజన్ నుంచి తామిచ్చిన హామీ మేరకు రైతు భరోసా కింద ఎకరాకు 15 వేల చొప్పున అందిస్తామని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. కానీ, ఇప్పటి వరకు ఈ ఊసే లేకుండా పోయింది.
రైతు భరోసా కింద వానకాలమైనా పెట్టుబడి సాయం అందుతుందని ఆశించిన రైతులకు నిరాశే మిగులుతోంది. సీజన్ ప్రారంభమై పదిహేను రోజులు గడుస్తున్నా రాష్ట్ర సర్కారు ఈ పథకంపై ఇప్పటి వరకు ఒక స్పష్టమైన ప్రకటన చేయలేదు. గత ప్రభుత్వ హయాంలో సీజన్ ప్రారంభానికి ముందే అంటే వానకాలం అయితే మే నెలలోనే రైతుబంధు ప్రారంభమయ్యేది. ఎకరం భూమి ఉన్న రైతులతో ప్రారంభించి వారం పది రోజుల్లో ఈ ప్రక్రియను ముగించే వారు. ఇప్పుడు జూన్ నెల గడుస్తున్నా రైతు భరోసా కింద పెట్టుబడి సహాయం అందడం లేదు.
గత వానకాలం సీజన్లో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం జిల్లాకు చెందిన 1,93,330 మంది రైతులకు 181.89 కోట్ల ఆర్థిక సహాయాన్ని అందించింది. జూన్ మొదటి వారంలోనే ఈ ప్రక్రియ ముగిసింది. ఈ సీజన్‌కు ప్రభుత్వం పెట్టుబడి సాయం చేస్తుందా? లేదా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఐదెకరాల కంటే ఎక్కువ భూమి ఉన్న రైతులకు, ప్రభుత్వ ఉద్యోగులు, ఐటీ చెల్లించే వారికి ఈ పథకం కింద పెట్టుబడి సాయాన్ని నిలిపివేస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో అసలు రైతు భరోసా అమలు చేస్తారా? లేదా? అనే విషయంలోనే స్పష్టత లేకుండా పోయింది..
పెట్టుబడుల కోసం రైతులు అప్పులు చేస్తున్నారని గ్రహించిన రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుబంధు పథకాన్ని ప్రారంభించగా, తమకు అందిన ఆర్థికసాయంతో రైతులు పెట్టుబడి అవసరాలను తీర్చుకున్నారు. సీజన్ ప్రారంభంలోనే ప్రతి ఎకరాకు సీజన్‌కు 5 వేల చొప్పున ఏడాదిలో 10 వేల చొప్పున వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయడంతో సంబురంగా విడిపించుకుని విత్తనాలు, ఎరువులు, దుక్కులు దున్నడం వంటివాటికి వినియోగించుకునేవారు.
రైతుబంధు పథకాన్ని కాస్తా రైతు భరోసాగా మార్చిన ప్రస్తుత కాంగ్రెస్ సర్కారు సీజన్‌కు ఎకరాకు 7,500 చొప్పున ఏడాదికి 15 వేల ఆర్థికసాయాన్ని అందిస్తామని చెప్పింది. అంతే కాకుండా.. కౌలురైతులకు కూడా ఈ పథకాన్ని వర్తింపజేస్తామనడంతోపాటు వ్యవసాయ కూలీలకు ఏడాదికి 12 వేల చొప్పున ఇస్తామని నమ్మబలికింది. కానీ, ఈ సీజన్ ప్రారంభమై పదిహేను రోజులైనా ఇప్పటి వరకు రైతు భరోసా ప్రస్తావనే లేకుండా పోయింది. కళ్లల్లో వత్తులేసుకుని ఎదురు చూస్తున్న రైతులు పెట్టుబడుల కోసం తిరిగి అప్పులు చేయాల్సిన దుస్థితి దాపురించింది.
బీఆర్ఎస్ సర్కారు ఉన్నప్పుడు పంట పెట్టుబడి కోసం రైతుబంధు టైముకు వచ్చేది. ఇప్పుడు వానకాలం సీజన్ మొదలైనా రైతుభరోసా కింద ఇస్తామన్న పెట్టుబడి సాయం ఇంకా ఇస్తలేరు. నార్లు పోసుకోవడానికి సీడ్ వడ్లు కొంటున్నం. ఇప్పుడిస్తే పంటలకు ఏమన్న పని చేస్తది. అవసరం తీరినంక ఇస్తే ఏం లాభం.. మళ్లీ మునుపటిలెక్కనే రైతులను అప్పుల పాలు చేసేటట్టున్నరు.
– పాశం అశోక్‌రెడ్డి, రైతు, మొగిలిపాలెం(తిమ్మాపూర్)