వేములవాడ డిసెంబర్ 25 : రైతు సంక్షేమం కోసం రైతుబంధు, రైతు బీమా వంటి పథకాలను తెచ్చిన ప్రభుత్వానికే ప్రజలు పట్టంగట్టారని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ స్పష్టం చేశారు. ఎప్పుడు ఏ ఎన్నిక వచ్చినా బీఆర్ఎస్దే విజయం అన్నట్లుగా నిరూపించారని చెప్పారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ సెస్ ఎన్నికల్లో చెప్పిన బట్టేబాజ్ మాటలను జిల్లా ప్రజలు నమ్మకపోగా.. చెంపపెట్టు లాంటి తీర్పును ఇచ్చారని పేర్కొన్నారు. సోమవారం వేములవాడలో నిర్వహించిన విలేకరుల సమావేశం లో ఆయన మాట్లాడారు. నెర్రెలువారిన, బీడు వారిన భూ ములకు సాగునీరు అందించిన ఘనత సీఎం కేసీఆర్, మం త్రి కేటీఆర్‌ది అని కొనియడారు.
పోలింగ్‌కు ఒక రోజు ముం దు మాట్లాడి అందరిలోనూ ఒక ఆలోచన కలిగించారని, జరిగిన అభివృద్ధినికి కండ్లకు కట్టినట్లు చెప్పడంతో రైతులు, ప్రజలందరూ వాస్తవాలు తెలుసుకున్నారని చెప్పారు. సెస్ ఎన్నికల్లో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ బలపర్చిన అభ్యర్థులను భారీ మెజార్టీతో జిల్లా ప్రజలు, రైతులు గెలిపించారని తెలిపారు. బీజేపీ, కాంగ్రెస్ నాయకులు ఎన్ని మాటలు చెప్పినా, ఎంత ప్రలోభపెట్టినా ఓటర్లు పట్టించుకోలేదని, వార్ వన్ సైడ్‌గా సాగిందన్నారు.
కేసీఆర్, కేటీఆర్ వెంటే నడుస్తామని ఎన్నికద్వారా నిరూపించారని స్పష్టం చేశారు. గ్రామాలకు వెళ్లిన బీజేపీ నాయకులకు నీళ్లు ఇచ్చావా?, కరెంటు ఇచ్చావా?, వడ్లు కొన్నవా? అని విమర్శలే ఎదురయ్యాయని చెప్పారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో సెస్ డైరెక్టర్ స్థానాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించేందుకు శాయశక్తులా కృషిచేసిన ప్రతి కార్యకర్తకూ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.