రైతన్నకు పెట్టుబడి సాయం చకచకా ఖాతాల్లో జమవుతున్నది. రెండు రోజుల నుంచి ఎకరాల వారీగా వారి బ్యాంకు ఖాతాల్లో పడుతున్నది. ఆ పైసలను విడిపించుకునేందుకు ఏటీఎంలు, బ్యాంకుల వద్ద అన్నదాతల సందడి కనిపిస్తున్నది. సరిగ్గా వరినాట్లు వేస్తున్న సమయంలో ఆర్థికసాయం వస్తుండడంతో పెట్టుబడికి రంది లేకుండ పోయిందని రైతులు సంతోషపడుతున్నారు. కూలీలు, ఎరువులు, దున్నడానికి అయ్యే ఖర్చులు ఎల్లుతాయని చెబుతున్నారు. రైతుబంధు నగదు అందుకున్న రైతులు ఆనందంతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పలు చోట్ల సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం చేసి కృతజ్ఞతలు తెలిపారు. కాగా, ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రెండు రోజుల్లో 5,17,486 మంది రైతులకు రూ.316.92 కోట్ల నగదు వారి ఖాతాల్లో జమైంది.
“కరీంనగర్ మండలం దుర్శేడులోని ఎస్బీఐ కస్టమర్ సెంటర్లో చిరునవ్వులు చిందిస్తూ నగదు తీసుకుంటున్న ఈ రైతు పేరు సాయిని రాజిరెడ్డి. ఇదే మండలంలోని గోపాల్‌పూర్‌లో ఇతనికి 1.30 ఎకరాల భూమి ఉన్నది. ప్రతి పసలుకు ఇతనికి రూ.9,250 చొప్పున రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు కింద పెట్టుబడి సహాయాన్ని అందిస్తోంది. ఈ యాసంగి సీజన్ కోసం నగదు జమైనట్లు ఇటు సీఎం కేసీఆర్ కార్యాలయం నుంచి, అటు బ్యాంకు నుంచి ఇతని ఫోన్‌కు మెస్సేజ్ రావడంతో ఈ కస్టమర్ సెంటర్‌కు వచ్చి నగదు విడిపించుకుంటున్నాడు. అతనితోపాటు పదుల సంఖ్యలో రైతులు తమ రైతుబంధు నగదును విడిపించుకునేందుకు వచ్చారు. ఇలా పంట సాగు మొదలైందో లేదో అలా రైతుబంధు కింద పెట్టుబడి సహాయాన్ని అందిస్తున్న ప్రభుత్వం తమదని రైతులు సగర్వంగా చెప్పుకుంటున్న తీరు ఇక్కడ కనిపించింది. ఇలా ఇప్పుడు ఒక్క సాయిని రాజిరెడ్డి మాత్రమే కాదు.. ఉమ్మడి జిల్లాలోని 6,62,545 మంది రైతుల ఖాతాల్లో క్రమంగా నగదు జమవుతోంది. బ్యాంకులు, పోస్టాఫీసులు, ఆయా బ్యాంకుల కస్టమర్ సెంటర్లలో రెండు రోజులుగా నగదు విడిపించుకుంటున్న రైతులు ఖుషీ ఖుషీగా కనిపిస్తున్నారు”
కరీంనగర్ : జిల్లాలో 1,97,097 మంది రైతులకు రూ.182 కోట్ల 3 లక్షల 54 వేలు కేటాయించారు. ఇందులో ఇప్పటి వరకు బ్యాంకు ఖాతాలు, పట్టాదారు పాసు పుస్తకాల వివరాలు ఇచ్చిన 1,79,957 మంది రైతులకు రూ.175 కోట్ల 38 లక్షల 44 వేల 965 మంజూరు చేశారు. మొదట ఎకరంలోపు ఉన్న రైతుల ఖాతాల్లో నగదు జమచేశారు. ఇందులో భాగంగా మొదటి రోజైన బుధవారం 70,430 మంది రైతులకు రూ.19 కోట్ల 8 లక్షల 6 వేల 816 జమ చేశారు. ఇక రెండో రోజైన గురువారం రెండెకరాల్లోపు ఉన్న 70,143 మంది రైతులకు రూ.33 కోట్ల 76 లక్షల 4 వేల 590 జమ చేశారు. రెండు రోజుల్లో చూస్తే ఎకరం, రెండెకరాల్లోపు ఉన్న 1,40,573 మంది రైతుల ఖాతాల్లో రూ.52 కోట్ల 84 లక్షల 11 వేల 406 జమచేశారు.
జగిత్యాల: జిల్లాలో 2,15,033 మంది రైతులు రైతుబంధు లబ్ధిదారులుగా ఉన్నారు. వీరికి ఈ సీజన్లో రూ.206,63,84,924లను ప్రభుత్వం మంజూరు చేసింది. కాగా, జిల్లాలో ఇప్పటి వరకు వ్యవసాయ విస్తరణాధికారులు 2,14,686 మంది రైతుల వివరాలను నమోదు చేయగా, అందులో 2,14,652 మంది రైతులకు సంబంధించిన వివరాలను వెరిఫై చేసి ప్రభుత్వానికి నివేదించారు. కాగా, గురువారం సాయంత్రం వరకు జగిత్యాల జిల్లాలో 1,44,872 మంది రైతులకు సంబంధించిన వివరాలు ట్రెజరీకి పంపించగా వారికి చెల్లింపులు జరిపారు. ఇప్పటి వరకు రూ.69,17,85,838లు రైతుల ఖాతాల్లో జమయ్యాయి. కాగా, గురువారం ఒక్కరోజే 95,561 మంది రైతులకు సంబంధించి, రూ.32,76,40,453 ఖాతాల్లో జమయ్యాయి.
పెద్దపల్లి : జిల్లాలో 1,39,831 మంది రైతుబంధు లబ్ధిదారులకు రూ.133, 79,83,405లు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. కాగా, జిల్లాలో వ్యవసాయాధికారులు 1,39,636 మంది రైతుల వివరాలను నమోదు చేయగా, 1,39,575 మంది రైతులకు సంబంధించిన వివరాలను వెరిఫై చేసి ప్రభుత్వానికి నివేదించారు. గురువారం సాయంత్రం వరకు 1,12,750 మంది రైతులకు రూ.68,92,15,570ల నగదు జమైంది. గురువారం ఒక్క రోజే 55,167 మంది రైతులకు సంబంధించి రూ.15,77,15, 258లు ఖాతాల్లో జమయ్యాయి.
కరీంనగర్, డిసెంబర్ 29 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న రైతుబంధు సాయం రెండు రోజుల నుంచి రైతుల ఖాతాల్లో జమవుతోంది. దీంతో రైతులకు అటు సీఎం కార్యాలయం నుంచి, ఇటు బ్యాంకుల నుంచి మెసేజ్‌లు వస్తుండడంతో బ్యాంకులు, ఏటీఎంలు, ఇతర సర్వీస్ సెంటర్ల ద్వారా నగదు విడిపించుకుంటూ తమకు పెట్టుబడికి ఉపయోగపడుతున్నాయని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గుంట, రెండు గుంటలు ఉన్న రైతు నుంచి మోతుబరి రైతుల వరకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న పెట్టుబడి సాయాన్ని పొందుతున్నారు. ఈ నగదును విత్తనాలు, ఎరువులు, దున్నడానికి, కలుపు కూలీలకు చెల్లిస్తున్నారు. సీఎం కేసీఆర్ 2016లో రైతుబంధు పథకం ప్రారంభించిన తర్వాత రైతుల జీవితాల్లో అనేక మార్పులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా వారిలో ఎంతో భరోసా పెరిగింది.
వ్యవసాయం కోసం సకాలంలో ప్రాజెక్టులు, మిషన్ కాకతీయ కింద చెరువుల పునరుద్ధరణ కారణంగా భూగర్భ జలాలు పెరిగి పుష్కలంగా నీటి వనరులు అందుతున్నాయి. ఇటు మెరుగైన 24 గంటల విద్యుత్తు అందుబాటులో ఉంది. ప్రతి సీజన్‌కు రైతుబంధు కింద పంట పెట్టుబడి వస్తోంది. దీంతో తెలంగాణ రాకముందు బీళ్లుగా ఉన్న భూములన్నీ సాగులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో గతంలో పెట్టుబడి కోసం వడ్డీ వ్యాపారులను ఆశ్రయించిన రైతులు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న రైతుబంధుతో పెట్టుబడిని వెళ్లదీస్తూ ఎలాంటి ఒత్తిడి లేకుండా పంటలు పండిస్తున్నారు. కరీంనగర్ మండలం బొమ్మకల్ గ్రామానికి చెందిన ర్యాకల లక్ష్మయ్య అనే రైతు మాట్లాడుతూ తనకున్న 20 గుంటల భూమిని కేసీఆర్ ఇస్తున్న రైతుబంధుతోనే సాగు చేసుకుంటున్నానని చెప్పాడు. ఇలా ఎందరో రైతులు ఈ పెట్టుబడి సహాయాన్ని సద్వినియోగం చేసుకుంటూ పుష్కలమైన పంటలు పండిస్తున్నారు.
రాజన్న సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లాలో 1,28,361 మంది రైతుల వివరాలు ఆన్లైన్లో నమోదవగా, ఇప్పటి వరకు 1,19,291 మంది రైతులకు రూ.125,98,37,444 కోట్లను వారీ బ్యాంకు ఖాతాలో ప్రభుత్వం జమచేసింది. జమయిన వెంటనే సెల్ఫోన్లకు మెసేజ్ రావడంతో రైతులు చూసుకుని మురిసి పోయారు. మిగిలిన 9070 మందికి ఖాతాలో నగదు జమకానున్నది.
అప్పులుజేసుడు తప్పింది
రైతుబంధు పైసలు నాకు వడ్డయ్. నాకు ఎకరంన్నర పొలం ఉంది. పదో విడుత పెట్టుబడి సాయం మెసేజ్ వచ్చింది. బ్యాంకులో పైసలు జమైనయ్. ఇప్పుడు నాకు పెట్టుబడి కోసం అప్పులు జేసుడు తప్పింది. ఈ పైసలు ఎరువులు, కైకిళ్లకు పైసలను వాడతా.
రోజుకు పదుల సంఖ్యలో వస్తరు
రైతుబంధు పథకం కింద రైతుల ఖాతాల్లో నగదు జమవుతోంది. నిన్నటి నుంచే రైతులు వచ్చి డబ్బులు తీసుకెళ్తున్నరు. ఈరోజు పొద్దుటి నుంచి 50 నుంచి 60 మంది రైతులకు పైసలు ఇచ్చిన. దుర్శేడు, గోపాల్పూర్, బొమ్మకల్, చేగుర్తి, ఇరుకుల్ల గ్రామాల రైతులు చాలా మంది ఇక్కడే డబ్బులు విడిపించుకుంటరు. ఆధార్ కార్డు తెచ్చి బ్యాంకు పేరు చెపితే చాలు పైసలు ఇస్తం. పైసలు తీసుకుంటున్న రైతులు కేసీఆర్ గురించి గొప్పగా చెప్పుకుంటరు. పైసలు తీసుకుంట ఏంజేయాల్నో ఇక్కన్నుంచే చెప్పుకుంట పోతరు. రెండు రోజులసుందయితే రైతులు వస్తున్నరు. పైసలు తీస్కపోతున్నరు..
– వేముల అశోక్, దుర్శేడు, ఎస్బీఐ కస్టమర్ సెంటర్ నిర్వాహకుడు
పెట్టుబడికి ఆసర అయితయ్
రైతు బంధు కింద పైసలు పంటల సాగుకు ఆసరా అయితన్నయ్. అమ్మక్కపేట్ రెవెన్యూ శివారులో నా పేరిట ఉన్న 58 గుంటల భూమికి ఖాతాలో రూ.7,312 జమైనయ్. ఈ నెల 28 నుంచి రైతు బంధు ఇస్తమని సీఎం కేసీఆర్ చెప్పినట్లే పైసలు ఏసిండ్రు. చాలా సంతోషంగా ఉంది.
– ఏనుగు గంగారెడ్డి, రైతు, అమ్మక్కపేట్
లాగోడి కష్టాలు తప్పినయ్
రైతు బంధు పెట్టినంక లాగోడికి ఇబ్బంది లేకుండ అయ్యింది. నాకు రెండెకరాల పొలముంది. రైతు బంధు పైసలు గూడ అచ్చినయ్. కేసీఆర్ సారు అచ్చినంక 24 గంటలు కరెంటియ్యవటికె మోటర్లుగూడ ఖరాబయితలెవ్వు. రైతుబీమా అసోంటి పథకం జెయ్యవటికె సిన్న రైతులకు ఎంతో ధీమయ్యింది. రైతులు పంట పండిచ్చినన్ని రోజులు కేసీఆర్‌ను ఎప్పటికి మర్సిపోరు.
– మాదాసు భూమయ్య, రైతు, అల్మాస్పూర్(ఎల్లారెడ్డిపేట)
ఎవుసానికి భరోసా
నా పేరు ఏమిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి. మాది ఎలబోతారం. రైతుబంధుతో మాకు షావుకారు బాధలు తప్పినయ్. సాగుకు భరోసా కలిగింది. నేను ఆరెకరాల్లో వరి సాగు చేస్తున్న. రైతుబంధు సాయం రూ. 30 వేల వరకు సాయం చేస్తున్నరు. మా ఇంటి పెద్దన్నగా కేసీఆర్ సారు సాగుకు సాయం జేస్తున్నడు. ఎరువుల మందు బస్తాలకు, కూలీలకు పెట్టుబడి పైసలు ఇస్తుండు.
-ఏమిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, ఎలబోతారం(కరీంనగర్ రూరల్)
కేసీఆర్ చేస్తున్న అతి గొప్పపని
సీఎం కేసీఆర్ చేస్తున్న అతి గొప్ప పనిలో రైతుబంధు ఒకటి. ఇసోంటి పథకం దేశంలో ఎక్కడా లేదు. రైతులను ఇంత మంచిగ చూసుకుంటున్న ప్రభుత్వాన్ని ఇంత వరకు చూడలే. నాకు రెండెకరాల్లోపు భూమి ఉన్నది. ఈ రోజు రూ.6,780లు నా ఖాతాలో పడినట్లు మెసేజ్ వచ్చింది. విడిపించుకునెతందుకు వచ్చిన. నాకు వచ్చిన ఈ పైసలను పెట్టుబడి కోసం వినియోగించుకుంట. రైతులు ఎంత చేసినా కేసీఆర్ రుణం తీర్చుకోలేరు. కేసీఆర్ ప్రభుత్వంలో రైతులందరూ చాలా సంతోషంగా ఉంటున్నరు.
– మంద రాజమల్లు, రైతు
పైసల్ జమైనయ్
నాకు రైతుబంధు పైసలు జమైనయ్. నేను ఐటీఐ చదువుకున్న, మా తమ్ముడు ఇంజనీరింగ్ చదువుకుంటున్నడు. మా నాయినతో కలిసి మూడేళ్లుగా ఎవుసం జేస్తున్న. ఆరెకరాల్లో వరి, పత్తి, మిర్చి పంటలు సాగు జేత్తున్నం. నా పేరు మీద 19 గుంటల పొలం ఉన్నది. రూ. 2390 ఖాతాలో జమైనయ్. ఈ పైసలు పెట్టుబడికి వాడుతున్నం. మా నాయిన పెట్టుబడికి అప్పట్ల అప్పులు జేసేది. ఇప్పుడు ఆ తిప్పలు లేవు.
– తనుగుల రాకేశ్, కేశవాపూర్, (జమ్మికుంట రూరల్)
రైతుబంధు వందశాతం సాగుకు ఉపయోగం పడుతుంది
నాడు పంట సాగు చేయాలంటే ఎకరానికి 10 వేల అప్పులు చేయాల్సి వచ్చేది. షావుకారు చుట్టూ తిరిగేది. తెలంగాణ రాష్ట్రం వచ్చినంక కేసీఆర్ పుణ్యమాని మాకు పెట్టబడి సాయం అందుతున్నది. నాకు నాలుగెకరాలకు రైతుబంధు కింద రూ.20 వేలు వస్తున్నయ్. ఈ పైసలతో సాగుకు కూలీలకు, ఎరువుల బస్తాలు, అడుగు మందుల ఖర్చు వెల్లదీసుకోవచ్చు. రైతుకు వంద శాతం సాయం అందిస్తున్న ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వమే,
-చల్లూరి శ్రీనివాస్, ఎలబోతారం(కరీంనగర్ రూరల్)
చిన్న, సన్నకారు రైతులకు అండగా
ప్రకృతిని నమ్ముకుని సాగు చేస్తున్న అన్నదాతలకు దేశంలోనే ఆదర్శనీయమైన రైతు బంధు పథకాన్ని సీఎం కేసీఆర్ అమలు చేస్తూ ఆర్థిక అండగా నిలుస్తున్నారు. నాడు చిన్న, సన్న కారు రైతులు సాగు సీజన్ ప్రారంభం కాగానే చేతిలో చిల్లి గవ్వ లేక అవస్థలు పడిన రోజులు ఎన్నో ఉన్నాయి. నేడు ప్రభుత్వం పంటలకు పెట్టుబడి అందించడంతో అలాంటి వారికి ఎంతో నయమైంది. నాకు పదిహేను ఎకరాల భూమి ఉన్నది, మొదటి నుంచీ నాకు రైతుబంధు పైసలు వస్తున్నయ్.
– సురభి వెంకట్రావు రైతు, గంభీరావుపేట
పెట్టుబడికి రంది లేకుంట వోయింది
నా పేరు పిల్లి ఎల్లయ్య. మాది గంభీరావుపేట. ఊరి పక్కన రెండెకరాల భూముంది. అందులో వరి, పత్తి పంట సాగు చేస్తున్న. నాకు ఇప్పటిదాకా ఆరుసార్ల చొప్పున బ్యాంకు ఖాతాలో పైసలు జమైనయ్. కేసీఆర్ సారు ప్రతి ఫసలుకు అందిస్తున్న పెట్టుబడితో పంటలు సాగు చేస్తూ వచ్చిన దిగుబడితో అప్పులు కట్టుకుంటన్న. సాగుకు కరెక్టు టైంకు పైసలివ్వడంతో రంది లేకుంటవోయింది.
– పిల్లి ఎల్లయ్య, రైతు, గంభీరావుపేట
ఒకప్పుడు అప్పుల పాలయ్యేటోళ్లం
ఒకప్పుడు ఎవుసం చేయాలంటే అప్పు జేసేది. మంచిగ పంట పండితే ఆ అప్పు కట్టేటోళ్లం. లేకుంటె అప్పుల పాలయ్యేటోళ్లం. అయితే గిప్పుడే పెట్టుబడికి పైసలు కోసం ఎదురు చూడకుండా రైతు బంధు పైసలత్తన్నయి. ఈ పైసలతో పెట్టుబడి ఖర్చులు ఎల్తయ్. మునుపు గిట్ల పెట్టుబడికి సాయం ఎవ్వరు జెయ్యలె. సీఎం కేసీఆర్ సారు రైతుబంధు పెట్టి ఎందరికో సాయం జేత్తండు. నాకు రెండు ఎకరాల 20 గుంటల భూమి ఉంది. ప్రతీ ఏడాది ఎకరానికి రూ. 5వేల చొప్పున ఖరీఫ్, రబీకి కలిపి రెండు సార్లు సర్కారు నుంచి పెట్టుబడి సాయం అందుతంది.
-దుబ్బాక కనుకయ్య, రైతు, సూరయ్యపల్లి, మంథని
పెట్టువడి ఖర్సులిచ్చి ఆదుకుంటుర్రు
పంట ఏసేటప్పుడు పెట్టువడి ఖర్సులకు ఆసాములకాడికి పొయి అరిగోస పడ్డదినాలు మర్సిపోలేం. కేసీఆర్ సారు ముఖ్యమంత్రి అయినంక పెట్టువడి ఖర్సులిచ్చి రైతులను ఆదుకుంటున్నడు. మాకు ఐదెకరాలనర పొలమున్నది. నాపేరు మీద ఉన్న 32 గుంటల భూమి రైతు బంధుపైసలు పడ్డయని నా కొడుకు సెప్పంగనే సంతోషమనిపిచ్చింది. ఇంక మా ఆయన పేరుమీద నాల్గెకరాల భూమి ఉంది అవ్విగూడ రేపో, ఎల్లుండో పడ్తయి . రైతులకోసం ఇన్ని మంచి పనులు జేత్తున్న సర్కారునెట్ల మర్సిపోతం.
– కొర్రి స్వరూప, రైతు అల్మాస్పూర్(ఎల్లారెడ్డిపేట)
గిట్ల పైసలు ఎవ్వరియ్యలె
నాకు ఎకరం మూడు గుంటల భూమి ఉంది. నాకు ఖరీఫ్, రబీకి రైతుబంధు సాయం అందుతుంది. ఈ పైసలతోటి ఎవుసం పనులు జేసుకుంటన్న. రైతుల పాలిట సీఎం కేసీఆర్ నిజంగా దేవుడు. సాగుకు ముందే పెట్టుబడి సాయం నేరుగా మా ఖాతాల్లోనే జమ చేసి సాయం అందిస్తున్నాడు. గతంల గిట్ల పెట్టుబడికి పైసలు ఎవ్వరియ్యలె. వ్యవసాయ పనులు మొదలు పెట్టాలంటే పెట్టుబడి కోసం రైతుల గుండెల్లో దడ మొదలయ్యేది. తెలంగాణల ఆ బాధ లేకుండా సాయం ముందే అందుతంది.
– కోరవేన నరేశ్, రైతు, సూరయ్యపల్లి, మంథని
సార్ సాయంతోటే ఎవుసం నడుత్తుంది..
సీఎం కేసీఆర్ చూపిన దయ, చేసిన సాయంతోనే ఎవుసం నడుత్తంది. నాకు ఎకరన్నర భూమి ఉంది. గతంల పెట్టుబడి పెట్టే దిక్కులేక, కరెంటు సక్కగ ఉండక, నీళ్ల సౌలత్ లేక పొలం ఎయ్యకపోయేది. తెలంగాణ అచ్చినంక సీఎం కేసీఆర్ రైతులకు మంచి లాభం చేసిండు. 24 గంటల కరెంట్ ఇచ్చుడేగాక, రైతులకు ఎకరానికి 5వేల చొప్పున యాడాదికి రెండు సార్లు పైసలు ఇచ్చి మంచి పని జేసిండు. వరద కాలువ చెయ్యవట్టి నీళ్లు గుడ అచ్చినయి. అందుకే పొలం చేత్తున్న. కరెక్ట్ సమయానికి రైతుబంధు పైసలు అచ్చినయి. తిప్పలు లేదు. ట్రాక్టర్ దున్నించినందుకు, ఎరువులకు సరిపోతయి, కరెంటు ఫిరిగానే ఇయ్యవట్టె. పంట పండినంక అమ్ముడు గూడ మావూళ్లెనే వెట్టిండు. పైసలు గుడ మచ్చింగనే అత్తున్నయి. ఇంతకంటే రైతుకు ఇంకెం కావాలే. సీఎం కేసీఆర్‌కు రైతులు ఎప్పుడు బాకివడే ఉంటరు.
రైతుబంధు వృథా కావొద్దని భూమి సాగు
సైకిల్‌పై కులాసాగా కూర్చున్న ఈ రైతుపేరు బెజ్జంకి నాంపెల్లి. దళితుడైన ఇతనికి కరీంనగర్ మండలం గోపాల్పూర్ శివారులో గతంలో ప్రభుత్వం ఎకరం భూమి ఇచ్చింది. పెట్టుబడి ఉన్నప్పుడు పంటలు సాగుచేసి, లేనపుడు బీడుగా పెట్టే పరిస్థితి ఉండేది. కేసీఆర్ ఎప్పుడైతే రైతుబంధు పథకం కింద పెట్టుబడి సహాయం అందిస్తున్నారో అప్పటి నుంచి నాంపెల్లికి ఇచ్చిన ఎకరం భూమితోపాటు ఇతనికి అంతకుముందు ఉన్న 30 గుంటల్లోనూ ఫసల్ తప్పకుండా సాగు చేస్తున్నాడు. నీళ్లు, కరెంటు ఇవ్వడంతో పాటు పెట్టుబడి ఇచ్చిన తర్వాత కూడా తన భూమిని సాగు చేయకుండా ఎలా ఉంచమంటారని ఆయన అనడం గమనార్హం. ప్రభుత్వం ఇచ్చిన భూమికి ప్రతి సీజన్‌కు రూ.5 వేలు తన సొంత భూమికి రూ.4,250 చొప్పున మొత్తం రూ.9,250 చొప్పున నాంపెల్లికి పెట్టుబడి సహాయం అందుతోంది. ఈ పెట్టుబడితో నాంపెల్లి తన భూమిలో పత్తి, వరి సాగు చేస్తూ హాయిగా పంటలు పండిస్తున్నాడు. పెట్టుబడి కోసం ఏ వడ్డీ వ్యాపారి వద్దకు తాను వెళ్లాల్సిన పని లేదని చెబుతున్నాడు.