mango formers | జగిత్యాల, ఏప్రిల్ 7 : జగిత్యాల మామిడి నాణ్యతలో జాతీయ మార్కెట్లో పేరు ప్రఖ్యాతలు గాంచిన మామిడి కాయను బహిరంగ వేలం వేసి కొనుగోలు చేయాలని కోరుతూ జగిత్యాల జిల్లా రైతు ఐక్యవేదిక జిల్లా అధ్యక్షులు నల్ల రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో కలెక్టర్ కు రైతులు, ఐక్యవేదిక నాయకులు వినతి పత్రం అందజేశారు.
మామిడి రైతులకు దళారుల సమస్య తప్పించి బహిరంగ వేలం ద్వారా కొనుగోలు చేయాలని రైతు ఐక్యత రాష్ట్ర నాయకులు పన్నాల తిరుపతిరెడ్డి కోరారు. ఈ సందర్భంగా రైతు ఐక్యవేదిక నాయకులు మాట్లాడుతూ స్థానిక వ్యాపారులతో పాటు ఆయా నగరాల నుంచి ఇక్కడికి మామిడి కొనుగోలు కోసం నెలరోజుల ముందే దళారులు మొదలు పెడుతారనీ, ముంబై, ఢిల్లీ ఫ్రూట్ మార్కెట్ వ్యాపారులు దళారులను రంగంలోకి దించి చౌకగా మామిడి రకాలను కొనుగోలు చేస్తున్నా రైతులను నిలువు దోపిడీ చేస్తున్నారని ఐక్య వేదిక నాయకులు వాపోయారు.
నేటి దళారుల మాయజాలంతో మామిడి రైతు తీరు అగమ్య గోచరంగా తయారైందని, ఇప్పటికే అనేక చోట్ల మామిడి రైతులు మామిడి తోటలలో యాజమాన్యం పెట్టుబడితో, దిగుబడులు రాక నష్టాలను భరించలేక చెట్లను తొలగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాబోయే కాలంలో మామిడి మార్కెట్ కు పేరు గాంచిన జగిత్యాల ప్రాంతంలో మామిడి తోటలు కనుమరుగయ్యే పరిస్థితి దాపురించిదని, ప్రభుత్వం నష్ట నివారణ చర్యలకు రంగంలోకి దిగి దళారుల చేతిలో ఉన్న మామిడి కొనుగోలును బహిరంగ వేలం ద్వారా కొనుగోలు చేయాలని రైతు ఐక్యవేదిక నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఏలేటి స్వామి రెడ్డి, బందేల మల్లన్న, కొట్టాల మోహన్ రెడ్డి, వేముల విక్రమ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.