Runs for urea | ఎల్లారెడ్డిపేట, సెప్టెంబర్ 3 : గత కొంత కాలంగా యూరియా కోసం ఎదురు చూస్తున్న రైతులకు ఎక్కడ యూరియా వచ్చిందని, ఇస్తున్నారని చెప్పినా ప్రాణం లేచొచ్చినట్లు అయి యూరియా ఇస్తున్న చోటుకు పరుగులు పెడుతున్న తీరు గ్రామాల్లో కనిపిస్తున్నది. అలాగే కోరుట్లపేటకు బుధవారం యూరియా వచ్చిందని, ఇస్తున్నరని తెలిసి రైతులు పరుగులు తీశారు. దీంతో కోరుట్లపేట-మల్లారెడ్డిపేట, కోరుట్లపేట-గంభీరావుపేటకు వెళ్లే వాహనదారులు అసలు ఏం జరిగిందని కంగారు పడ్డారు.
తీరా యూరియా కోసం వెళ్తున్నారని తెలుసుకుని రైతుల వైపు ధీనంగా చూస్తూ వెల్లే పరిస్థితి కనిపించదని గ్రామ రైతులు ఆవేదనగా తెలిపారు. గ్రామానికి మంగళవారం 220 బస్తాలు రాగా వాటిని బుధవారం ఉదయం పంపిణీ చేస్తారని గ్రామపంచాయతీ వద్ద ఉన్నారు. తీరా కొద్ది సేపటికి మరో చోట పంచుతున్నారని తెలియడంతో అక్కడికి పరుగులు పెట్టారు. అప్పటికే క్యూలైన్లో రైతులు నిలుచుని టోకెన్లు రాయించుకుని ఉన్నారు.
సుమారు 50 మంది టోకెన్లు దొరక్క పోవడంతో మరో లోడు వచ్చిన పిదప ఇస్తామని చెప్పడంతో కొత్తగా టోకెన్లు రాయించుకున్నారు. సదరు యూరియా మహిళా సంఘం పేరిట రావడంతో అదనంగా రూ.30 వసూలు చేశారని ఒక్కో బస్తాకు రూ.3వందలు వసూలు చేశారని అన్నారు. అయినప్పటికీ ఒక్కో రైతుకు ఒక్కో బస్తా మాత్రమే ఇచ్చారు. యూరియా బస్తాలు పంపిణీ గంటన్నరలో అయిపోయింది. మరో రెండు రోజుల్లో లోడు వస్తుందని వ్యవసాయాధికారులు హామీ ఇవ్వడంతో యూరియా రాని రైతులు కొత్తగా టోకెన్లు రాయించుకున్నారు.