మల్లన్న సాగర్ నుంచి పరుగులు పెడుతూ గోదారమ్మ మానేరు ఒడికి చేరింది. ముచ్చటగా మూడోసారి వచ్చిన కాళేశ్వర జలాలతో ఎగువ మానేరు జలశోభను సంతరించుకున్నది. కూడెల్లివాగును దాటుకుంటూ 388 క్యూసెక్కుల నీరు వస్తుండగా, 97 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల అవుతున్నది. మొత్తం14 చెరువులు నింపుకుంటూ గంభీరావుపేట, ముస్తాబాద్, ఎల్లారెడ్డిపేట మండలాల్లోని 13,085 ఎకరాలకు సాగునీరందిస్తున్నది. గోదావరి జలాలతో మెట్టను అభిషేకిస్తానంటూ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ ఇచ్చిన మాట నెరవేర్చుతున్నందుకు అన్నదాతల్లో ఆనందం వెల్లి విరుస్తున్నది.
రాజన్న సిరిసిల్ల, ఫిబ్రవరి 26 (నమస్తే తెలంగాణ)
తెలంగాణ ప్రభుత్వం అన్నదాతకు ఉచిత కరెంటు నుంచి మొదలు పెట్టుబడి సాయం అందిస్తున్నది. పెట్టుబడికి అప్పులు చేయాల్సిన దుస్థితి నుండి పూర్తిగా కోలుకునేలా ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తున్నది. దీంతో ప్రతి రైతు తనకున్న భూమిలో మొత్తం పంటల సాగు చేస్తున్నారు. నాటి సమైక్య పాలనలో రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా 99వేల ఎకరాల్లో అన్ని రకాల పంటలు సాగు చేయగా, తెలంగాణ వచ్చిన తర్వాత రెండింతలు పెరిగింది.
వానకాలంలో 2.46 లక్షల ఎకరాలలో పంట సాగైంది. గతంలో 2 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసిన ప్రభుత్వం వానకాలంలో 3.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసింది. చాలా వరకు రైతులు నేరుగా రైస్‌మిల్లర్లకు విక్రయించుకున్నారు. మొత్తం 4.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి అయ్యినట్లు అధికారుల లెక్కలు తేల్చాయి. జిల్లాలో ఎక్కువ శాతం వరి సాగు చేస్తున్నారు. ఈ యాసంగిలో 1.69 లక్షల ఎకరాలలో వివిధ పంటలు సాగు చేస్తున్నారు. అందులో వరి 1.67 లక్షల ఎకరాలు, మొక్కజొన్న 686, శనగలు 374, పెసర 78.85, పొద్దు తిరుగుడు 274.74, నువ్వులు 155.14, ఆవాలు 40.7, ఇతర పంటలు 255.7 ఎకరాలు వేశారు.
చివరి పంటకు మానీరు
యాసంగి సీజన్లో సాగునీటికి ఇబ్బందికి రాకుండా ఉండేందుకు ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నది. ప్రస్తుతం జిల్లాలో భూగర్భ జలాలు 6మీటర్ల ఎత్తుకు చేరాయి. బోర్లలో పుష్కలంగానీరుంది. అయినప్పటికీ చివరి పంటకు నీరందించాలన్న ఉద్దేశ్యంతో ఎగువ మానేరు కుడి, ఎడమ కాలువల ద్వారా అధికారులు నీటిని అందిస్తున్నారు. దీంతో 32 అడుగులున్న మానేరు 23 అడుగులకు చేరింది. రైతులు వేసిన వరి చివరి వరకు నీరు చేర్చేందుకు చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా మల్లన్న సాగర్ నుంచి కాళేశ్వర జలాలను ఎగువ మానేరుకు విడుదల చేశారు. సిద్దిపేట జిల్లా నుంచి మొదలుకొని రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలంలోని ఎగువ మానేరు జలాశయంలోకి 60కిలోమీటర్ల పొడువునా గోదావరి జలాలు వస్తున్నాయి. దుబ్బాక, మిరుదొడ్డి లోని కూడెల్లి వాగు నుంచి వచ్చి మానేరులో కలుస్తున్న గోదావరి జలాలతో ప్రస్తుతం మానేరు 26 అడుగులకు చేరింది. గత ఏడు మండుటెండల్లో మత్తడి దూకిన మానేరు ఈ యేడు కూడా కాళేశ్వర జలాలు రాకతో మత్తడి దూకే అవకాశాలు కనిపిస్తున్నాయి.
13,085 ఎకరాలకు సాగునీరు
ఎగువ మానేరు ప్రాజెక్టు పరిధిలో ఉన్న గంభీరావుపేట, ముస్తాబాద్, ఎల్లారెడ్డిపేట మండలాల్లో మొత్తం 13,085 ఎకరాలకు సాగు నీరందించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. మల్లన్న సాగర్ నుంచి 388 క్యూసెక్కుల నీరు మానేరులోకి వస్తుండగా, 97 క్యూసెక్కుల నీటిని 22 తూముల ద్వారా వదులుతున్నారు. 14 చెరువులను నింపి వాటి తూముల ద్వారా గంభీరావుపేట మండలంలో 3887 ఎకరాలు, ముస్తాబాద్ మండలంలో 8599 ఎకరాలు, ఎల్లారెడ్డిపేట మండలంలో 599 ఎకరాలకు నీరందిస్తున్నారు. ముస్తాబాద్ సరిహద్దులోని తెర్లుమద్ది వరకు ఎగువ మానేరు నీరు కాలువల ద్వారా పంటచేలకు అందిస్తున్నారు. గోదావరి జలాలతో యాసంగికి పంటకు ఇబ్బందులు తీరుతున్నందుకు రైతుల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
సారు బతికిచ్చిండు
మాది గంభీరావుపేట మండలం లింగన్నపేట. నాకు నాలుగెకరాలున్నది. నాడు ఎకరంల సాగు జెయ్యాలన్నా గోసయ్యేది. నీళ్లుంటే కరెంటు ఉండేది కాదు. కరెంటుంటే నీళ్లుండేటియికాదు. రాత్రనకా, పొద్దనకా పొలాన్ని పట్టుకుని ఏడ్తే ఎకరం వరి చేతికి రాలేదు. పెట్టుబడి ఎల్లక గీ ఎవుసం వదిలి అడ్డమీద కూలీ పనికి పోయిన. మళ్ల ఎవుసం గిట్ల పండుగైతదని ఎన్నడూ అనుకోలె. మంత్రి కేటీఆర్ సార్ ఎలక్షన్లలో గోదారి నీళ్లు తెచ్చి మానేరును నింపుతనన్నడు. నేను నమ్మలే. అందరూ గిట్లనే చెప్తరు అనుకున్న. ఎక్కడ గోదారి, ఎక్కడ మానేరు? ఇక్కడికి నీళ్లాత్తయా..? అనుకున్న. మాఊరికొచ్చిన గోదారి నీళ్లను చూసి మస్తు సంబురపడ్డం. నాడు సుక్క నీరు కనిపించని మా మండలంల ఎటు చూసినా చెరువులు, కుంటలల్ల నీళ్లు కనిపిస్తున్నయ్. నాటి కాలువలు, ఒర్రెలకు నీళ్లు మళ్లొచ్చినయ్. నాడు కరువుతో సావుకు దగ్గరైన మమ్మల్ని పంట పెట్టుబడి సాయం, ఉచిత కరెంటు ఇచ్చి పెద్ద సారు మళ్లీ బతికిచ్చిండు. రెండు చేతులెత్తి దండం పెట్టుకుంటున్న. ఇది మా జిల్లాలో రైతులందరూ ఇదే మాట చెప్తరు.
– గంధ్యాడపు శ్రీనివాస్, లింగన్నపేట
నాడు సాగునీరు లేక మెట్టలో తీవ్ర దుర్భిక్షం కనిపించేది. ఎటు చూసినా నెర్రలు బారిన నేలలు.. విద్యుత్‌పైనే ఆధారమైన వ్యవసాయం కరెంటు కోతలతో సాగక అన్నదాతల్లో నైరాశ్యం నెలకొనేది. ఎవుసమంటేనే మొహం చాటేసే పరిస్థితి ఉండేది. తెలంగాణ ప్రభుత్వంలో అపరభగీరథుడు ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్మించిన కాళేశ్వర ప్రాజెక్టు బీడు భూములకు ప్రాణం పోసింది. పిచ్చిమొక్కలు, పూడికతో నిండిన చెరువులన్నింటినీ మిషన్ కాకతీయ పథకం ద్వారా అందుబాటులోకి తెచ్చింది. కాలం కలిసి రావడం, మరోవైపు కాళేశ్వర జలాలు రావడంతో వాగులు, వంకలు పొంగి పొర్లి, చెరువులకు జలకళ వచ్చింది. ఇక పంటల సాగు పండుగలా సాగుతున్నది. రైతులు తమకున్న ప్రతి గుంటను సాగు చేసుకుంటున్నారు. నాటి వ్యవసాయ కూలీలందరూ యజమానులుగా మారి వ్యవసాయంలో రాణిస్తూ పంటల దిగుబడిలో స్ఫూర్తిగా నిలుస్తున్నారు.
-రాజన్న సిరిసిల్ల, ఫిబ్రవరి 26 (నమస్తే తెలంగాణ)
నాడు అద్దెకరం పంట చేతికి రాలె..
మాది ముస్తాఫానగర్. నా పేరిట మూడెకరాలు, మా నాయిన రాజమల్లయ్య పేరిట ఎకరం పావు పొలం ఉంది. ఆంధ్రోళ్ల పాలనలో నీళ్లు లేవు, కరెంటు లేదు. అద్దెకరం పొలం కూడా తడి నానలేదు. ఎన్నో ఏళ్లు చూసినా లాభం లేదనుకుని మస్కట్ దేశం పోయిన. తొమ్మిదేళ్లు అక్కడే ఉన్న. అక్కడ సుతారి పని చేసి సంపాదించిన దాంట్లో నా ముగ్గురు కొడుకులను మంచిగ సదివించిన. తెలంగాణ వచ్చినంక తిరిగి మన దేశమొచ్చిన.
కేసీఆర్ సార్ కట్టిన కాళేశ్వరం పుణ్యమా అని మామండలంల చెర్లన్నీ నిండి బోర్లలో బాగా నీళ్లొచ్చినయ్. నాడు ఎవుసం సాగక భూమి అమ్ముదామన్నా ఎకరాన 5 లక్షలు రాలేదు. మా అన్నోళ్లు ఆరెకరాల భూమి 5 లక్షలకు అమ్ముకున్నరు. ఇయ్యాళ ఉచిత కరెంటు, పంట పెట్టుబడి సాయం అందిస్తున్నరు. సాగుకు సావులేకుంట ఉంది కాబట్టి భూముల ధరలు ఎకరాన 25 లక్షలు చెబుతున్నరు. ఈడ గింతమంచిగున్నంకగా మస్కట్‌కు పోవుడెందుకని అందరంటున్రు. నా ముగ్గురు కొడుకులు పట్నంలో ప్రైవేటు నౌకరీ చేస్తున్రు. కేసీఆర్ దయవల్ల ఇంటిని పట్టుకుని ఎవుసం జేసుకుంటున్నం. సారు సల్లంగుండాలె.
-కొక్కు సత్యనారాయణ, రైతు, ముస్తాఫానగర్ (గంభీరావుపేట మండలం)