Special train | జగిత్యాల, నవంబర్ 21 : ప్రతీ ఏటా జగిత్యాల జిల్లా నుంచి అయ్యప్ప మాల ధరించే భక్తులు పెరుగుతున్న నేపథ్యంలో జగిత్యాల నుంచి శబరిమలకు ప్రత్యేక రైలు నడిపించాలని కాంగ్రెస్ సేవాదల్ రాష్ట్ర కార్యదర్శి బోగోజీ ముకేశ్ కన్నా రైల్వే అధికారులను కోరారు. లింగంపేట లోని రైల్వే అధికారుల ద్వారా దక్షిణ మధ్య రైల్వే అధికారులకు ముకేశ్ కన్నా శుక్రవారం వినతిపత్రం పంపించారు.
ఈ సందర్భంగా ముకేశ్ కన్నా మాట్లాడుతూ నాందేడ్ వయా జగిత్యాల-కరీంనగర్ నుంచి శబరిమల వరకు అయ్యప్ప స్వాముల ప్రయాణం కోసం ప్రత్యేక రైలు అవసరమని ముకేశ్ అన్నారు. ప్రతీ ఏటా అయ్యప్ప మాల వేసుకొనే భక్తులు పెరుగుతున్నారన్నారు. ప్రైవేట్ వాహనాల్లో అయ్యప్ప దర్శనానికి వెళ్లే ఎందరో భక్తులు ఎన్నో వ్యయప్రయాసాలకు ఓర్చి దర్శనానికి పోతున్నారన్నారు. కొన్ని సందర్భాలలో ప్రైవేట్ వాహనాల్లో వెళ్లే భక్తులు ప్రమాదాలకు గురవుతున్నారన్నారు. ఇలాంటి నేపథ్యంలో ప్రత్యేక రైలు సౌకర్యం కల్పిస్తే భక్తులు తమ దర్శనాలను పూర్తి చేసి మొక్కులు చెల్లించి భద్రంగా ఇంటికి చేరుకొంటారని ముకేశ్ కన్నా రైల్వే అధికారులకు తెలియజేశారు.