తెలంగాణ చౌక్, నవంబర్ 4: ఆర్టీసీ విశాంత్ర ఉద్యోగులకు అండగా నిలుస్తానని, సమస్యలను ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని టీజీఎస్ ఆర్టీసీ విశాంత్ర ఉద్యోగుల అసోషియేషన్ జోనల్ నూతన గౌరవ అధ్యక్షుడు ఓరుగంటి రమణారావు హామీ ఇచ్చారు. కరీంనగరంలోని కొత్తపల్లి స్వాగత్ ఫంక్షన్ హాల్లో మంగళవారం ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు బావుపేట రాజయ్య, ప్రధాన కార్యదర్శి నాగిరెడ్డి ఆధ్వర్యంలో జోనల్ స్థాయి తొలి మహాసభ నిర్వహించారు.
ఈ సందర్భంగా రమణారావును జోనల్ గౌరవ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. పేద మధ్యతరగతి ప్రజలు వినియోగించే ప్రజా రవాణా సంస్థ ఆర్టీసీని ఆధునీకరించి, మెరుగైన సేవలందించాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తం చేశారు. రాష్ట్ర బడ్జెట్లో ఆర్టీసీకి 10 శాతం ఆస్తులున్నాయని తెలిపారు. దేశంలోని రవాణా సంస్థలో గుర్తింపు పొందిన ఆర్టీసీని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉద్యోగులు, ప్రజలపై ఉందన్నారు. విరమణ పొందిన ఉద్యోగులకు బెనిఫిట్స్‌ను వెంటనే అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.
విశాంత్ర ఉద్యోగులకు పెన్షన్లు పెంచడంతోపాటు అన్ని రకాల సర్వీసుల్లో ఉచిత ప్రయాణం, దవాఖానల్లో మెరుగైన వైద్య సౌకర్యం కల్పించాలని కోరారు. జిల్లా కేంద్రాల్లో తమ అసోసియేషన్ కార్యాలయాల నిర్మాణానికి ప్రభుత్వం స్థలం కేటాయించాలన్నారు. వేలాది మంది ప్రత్యక్షంగా, లక్షలాది మందికి పరోక్షంగా ఉపాధి కల్పిస్తున్న ఆర్టీసీ సంస్థ, ఆదాయ, వ్యయాలతో సంబంధంలేకుండా కార్మికుల శ్రేయస్సు కోసం నిధులు కేటాయించాలన్నారు. త్వరలోనే జోనల్ పరిధిలోని ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ జిల్లాలో సమావేశాలను నిర్వహించి విశ్రాంత ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. అనంతరం జోనల్ విశాంత్ర ఉద్యోగులు శాలువా, పూల దండలతో ఘనంగా సన్మానించారు. ఇక్కడ జోనల్ పరిధిలోని అన్ని జిల్లాల నుంచి వెయ్యి మంది విశాంత్ర ఉద్యోగులు పాల్గొన్నారు.