ప్రయాణికులపై ఆర్టీసీ చార్జీల మోత మోగించబోతున్నది. ప్రత్యేక బస్సుల పేరిట భారీగా పెంచబోతున్నది. మహా శివరాత్రి సందర్భంగా శైవ క్షేత్రాలకు నడిపే బస్సుల్లో నేటి నుంచి 50 శాతం అదనంగా వసూలు చేసేందుకు సిద్ధమవుతుండగా, ప్రయాణికుల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతున్నది.
కరీంనగర్ తెలంగాణచౌక్, ఫిబ్రవరి 24 : మహాశివరాత్రి పండుగ సందర్భంగా ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడిపిస్తున్నది. కరీంనగర్ జోన్ పరిధిలోని కరీంనగర్, వరంగల్, నిజామాబాద్, అదిలాబాద్ రీజయన్లలోని ప్రతి డిపో నుంచి దక్షిణకాశీగా పేరుగాంచిన ప్రముఖ పుణ్యక్షేత్రం వేములవాడకు ప్రత్యేక బస్సులు నడిచేలా ఏర్పాట్లు పూర్తిచేసింది. అంతే కాకుండా, ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ప్రముఖ శైవ క్షేత్రాలైన కాళేశ్వరం, వేలాల, దుబ్బరాజన్న, పొట్లపల్లి దేవాలయాలకు కూడా ప్రత్యేక బస్సులు నడుపుతున్నది.
అయితే, ఈ ప్రత్యేక బస్సుల్లో రెగ్యులర్ బస్ టికెట్ చార్జీ కన్నా వన్ అండ్ ఆఫ్ ఫేర్ చార్జీని అదనంగా వసూలు చేసేందుకు సిద్ధమైంది. దీంతో ప్రయాణికులపై అదనపు భారం పడనున్నది. ముఖ్యంగా హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, అదిలాబాద్, మంచిర్యాలతోపాటు మహారాష్ట్రకు చెందిన భక్తులు లక్షలాదిగా వేములవాడతోపాటు ఇతర పుణ్యక్షేత్రాలకు పెద్ద సంఖ్యలో తరలివస్తారు. వారి అవసరాన్ని ఆసరగా తీసుకుంటున్న ఆర్టీసీ ముఖ్యమైన పండుగ రోజుల్లో అదనపు చార్జీలను వసూలు చేస్తూ ప్రయాణికులపై ఆర్థిక భారాన్ని మోపుతున్నది.
కరీంనగర్ నుంచి వేములవాడకు రెగ్యులర్ ఎక్స్ప్రెస్ టికెట్ ధర 50 ఉండగా, ప్రత్యేక బస్సులో 80 చెల్లించాల్సి ఉంటుంది. ఇలా జోన్ పరిధిలోని ఆయా డిపోల నుంచి వెళ్లే బస్సుల్లో ప్రస్తుత టికెట్ కంటే అదనంగా 50 శాతం వసూలు చేయనున్నారు. తిరుగు ప్రయాణంలోనూ ఇవే చార్జీలు ఉండనున్నాయి. ఈ ధరలు ఈ నెల 25, 26, 27 తేదీల్లో అమలు కానున్నాయి. అయితే గతంలో టికెట్ ధర అదనంగా చెల్లించినా సరిపడా బస్సులు లేక, సీట్లు దొరకక ప్రయాణికులు అవస్థలు పడ్డ సందర్భాలున్నాయి.
మహా శివరాత్రి సందర్భంగా ప్రయాణికుల సౌకర్యం కోసమే ప్రత్యేక బస్సులను నడిపిస్తున్నాం. ప్రముఖ పుణ్య క్షేత్రమైన వేములవాడకు రాష్ట్ర వ్యాప్తంగా భక్తులు రానున్నారు. రెగ్యులర్ బస్సులతోపాటు ప్రత్యేక బస్సులను నడించేలా అన్ని చర్యలూ తీసుకున్నాం. ప్రత్యేక సందర్భాల్లో నడిపించే బస్సుల్లో ప్రయాణించేందుకు రెగ్యులర్ బస్సు టికెట్లో వన్ అండ్ ఆఫ్ ఫేర్ చార్జీ చెల్లించాల్సి ఉంటుంది. ప్రత్యేక బస్సులు ప్రయాణికులను గమ్యస్థానంలో చేర్చి, ఓఆర్ తక్కువ ఉన్నా తిరిగి వస్తాయి. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా డీఎంల పర్యవేక్షణలో బస్సులను నడిపిస్తాం. రద్దీని బట్టి మరిన్ని బస్సులను నడిపించేలా ఏర్పాట్లు చేశాం.
– రాజు, ఆర్ఎం (కరీంనగర్)