గ్రామీణ ప్రాంత మహిళలపై ఆర్టీసీ చిన్నచూపు చూస్తున్నది. మహాలక్ష్మి పథకం కింద ఉచిత బస్సు ప్రయాణానికి దూరం చేస్తున్నది. చొప్పదండి మండలంలో తొమ్మిది గ్రామాలకు ఆర్టీసీ సేవలను నిలిపివేయగా, ప్రజలు, కాలేజీలకు వెళ్లే విద్యార్థినులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రైవేట్ వాహనాలను ఆశ్రయిస్తూ ఆర్థికంగా చితికిపోతున్నారు. ‘మేమేం పాపం చేశామని, మాకేది మహాలక్ష్మి’ అంటూ సర్కారును ప్రశ్నిస్తున్నారు.
చొప్పదండి, జూన్ 29 : నియోజకవర్గ కేంద్రమైన చొప్పదండి మంచి బిజినెస్ సెంటర్! జిల్లా కేంద్రానికి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ పట్టణం, మండలంలోని గ్రామాలకు వర్తక, వాణిజ్య అవసరాలకు కేరాఫ్! పదహారు గ్రామాల ప్రజలు ప్రధాన పనులైతేనే జిల్లా కేంద్రానికి వెళ్తారు తప్ప మిగతా పనులన్నీ పట్టణంలోనే చేసుకుంటుంటారు! అయితే మండలంలో రవాణా ప్రధాన సమస్యగా మారింది. చిట్యాలపల్లి, మంగళపల్లి, దేశాయిపేట, గుమ్లాపూర్, కాట్నాపల్లి, సాంబయ్యపల్లె, కోనేరుపల్లి, వెదురుగట్ట, చాకుంట..
ఇలా తొమ్మిది గ్రామాలకు ఆర్టీసీ సేవలు అందక గ్రామీణులు, విద్యార్థులు ఏండ్లుగా ఇబ్బందులు పడాల్సి వస్తున్నది. ఒకప్పుడు చొప్పదండి నుంచి ఆర్నకొండ, చిట్యాలపల్లి, మంగళపల్లి, దేశాయిపేట మీదుగా రామడుగు మండలం గుండి, గోపాలరావుపేట వరకు, అలాగే చొప్పదండి మండలం నుంచి గుమ్లాపూర్, సాంబయ్యపల్లి, కాట్నపల్లి గ్రామాల వరకు బస్సులు నడిచేవి. కానీ, అవి బంద్ కావడంతో ఆయా గ్రామాల ప్రజలు మహాలక్ష్మి ఉచిత బస్సు సేవలకు దూరంకావాల్సిన దుస్థితి దాపురించింది.
కరీంనగర్ నుంచి ధర్మారం, లక్షెట్టిపేట్, మంచిర్యాల రూట్ బస్సులు, చొప్పదండి నుంచి పెద్దపల్లి రూట్, చొప్పదండి నుంచి జగిత్యాల రూట్ బస్సులతో మిగిలిన గ్రామాలకు సేవలు అందుతుండగా, తొమ్మిది గ్రామాలకు నడువకపోవడంతో ప్రజలు, విద్యార్థులు చొప్పదండికి రావాలన్నా, జిల్లా కేంద్రానికి వెళ్లాలన్నా ఆటోలను ఆశ్రయిస్తూ ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నారు. ఆర్టీసీ బస్సులు నడిపితే ప్రయాణం సులభతరం అవుతుందని, ఆర్థిక భారం తప్పుతుందని, అధికారులు చొరవ చూపాలని మహిళలు, విద్యార్థినులు కోరుతున్నారు.
మా ఊరికి బస్సు నడిపించాలె
మాది చిట్యాలపల్లి. చొప్పదండి నుంచి ఆరు కిలోమీటర్ల దూరంల ఉంటది. రోజూ ఉదయం కరీంనగర్ మార్కెట్కు వెళ్లి కూరగాయలు అమ్ముకొని రాత్రి ఇంటికి వస్త. మా ఊరికి బస్సు లేక పోవడం చానా ఇబ్బందైతంది. ఆటో కిరాయి పెట్టుకుని ఆర్నకొండకు పోయి అక్కడి నుంచి బస్సెక్కి కరీంనగర్ పోతున్న. కిరాయిలకే పైసలు పోతున్నయి. మా ఊరికి బస్సు నడిపిస్తే నాకే కాదు మా ఊరోళ్లకు ఎంతో మేలైతది. కాంగ్రెస్ సర్కారు దయచూపాలె.
– నాతరి అనిత, చిట్యాలపల్లి(చొప్పదండి)
బస్సు నడిపించాలె
మాది దేశాయిపేట. చొప్పదండి మండల కేంద్రానికి 8 కిలోమీటర్ల దూరంల ఉంటది. మా ఊరికి బస్సు రాక ఆటోలు, జీపుల్లో పోతున్నం. కిరాయిలకే మస్తు పైసలు అయితున్నయి. బస్సులు నడిపిస్తే మహాలక్ష్మి పథకం కింద ఫ్రీగా వెళ్తం. ప్రజాప్రతినిధులు, ఆర్టీసీ అధికారులు స్పందించి మా ఊరికి బస్సు నడిపించాలె.
– పాకాల సుశీల, దేశాయిపేట(చొప్పదండి)