తెలంగాణచౌక్, మార్చి 1 : ఆర్టీసీ అద్దె బస్సుల డ్రైవర్లు కన్నెర్రజేశారు. తమ డిమాండ్లు నెరవేర్చాలని, డ్యూటీ ఇవ్వడం లేదని మనస్తాపంతో రెండ్రోజుల కింద ఆత్మహత్యాయత్నం చేసుకున్న తోటి డ్రైవర్ సురేశ్‌కు విధులు అప్పగించాలని శనివారం ఉదయం 4 గంటల నుంచి విధులు బహిష్కరించారు. బస్టాండ్‌లో నిరసన చేపట్టారు. ఆందోళనతో కరీంనగర్ రెండు డిపోల నుంచి జమ్మికుంట, వీణవంక, బెజ్జంకి, వేములవాడ, గోదావరిఖని, చొప్పదండి, ధర్మపురి, మంచిర్యాల, సిద్దిపేట రూట్లలో వెళ్లాల్సిన 98 అద్దె బస్సులు నిలిచిపోవడం, అందులో ప్రధానంగా పల్లె వెలుగులే ఉండడంతో గ్రామీణ ప్రాంత ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. ఉదయం గ్రామాల నుంచి నగరానికి కూరగాయలు, పాలు రాలేదు. వివిధ షాపుల్లో పని చేసే చిరు ఉద్యోగులు, కళాశాలలకు వెళ్లాల్సిన విద్యార్థులు, ఉద్యోగులు తిప్పలు పడ్డారు.
అద్దె బస్సుల యాజమానులు ఇతర డిపోల నుంచి డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న డ్రైవర్లను రప్పించినా, 20 బస్సులే నడిచాయి. కాగా, నిరసన చేస్తున్న డ్రైవర్లతో ఆర్టీసీ అధికారులు చర్చలు జరుపలేదు. విజిలెన్స్ అధికారులు మాత్రం వచ్చి మాట్లాడగా, తమ డిమాండ్లు నెరవేరిస్తేనే విధులకు హాజరవుతామని స్పష్టం చేశారు. అయితే, బస్సులు లేకపోవడంతో ప్రయాణికులు కంట్రోలర్లతో వాగ్వాదానికి దిగారు. ఈ సందర్భంగా అద్దె బస్సు డ్రైవర్ల యూనియన్ అధ్యక్షుడు శశికుమార్ మాట్లాడుతూ బ్రీత్ అనలైజర్లలో లోపాలు ఉన్నాయని, మద్యం అలవాటు లేని వారికి కూడా తాగినట్లు చూపిస్తున్నాయని, రెండు డివైజర్లతో టెస్టులు చేయాలన్నారు. బస్సు డోర్ నుంచి ప్రయాణికులు కింద పడితే డ్రైవర్లను బాధ్యులు చేయవద్దన్నారు. ఈ డిమాండ్లను నెరవేర్చాలని, తమ తోటి డ్రైవర్ సురేశ్‌ను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని, లేదంటే ఆదివారం కూడా నిరసన తెలుపుతామని స్పష్టం చేశారు.