ఆర్టీసీలో అలజడి మొదలైంది. కాంగ్రెస్ ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యంతో అమీ.. తుమీ తేల్చుకునేందుకు కార్మిక సంఘాలు సిద్ధమవుతున్నాయి. అందులో భాగంగా ఆదివారం హైదరాబాద్‌లో ఆర్టీసీలో కీలకమైన టీఎంయూ రాష్ట్రస్థాయి విస్తృత సమావేశాన్ని నిర్వహిస్తోంది. అధికారంలోకి రాకముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను మరచి మభ్యపెడుతున్న తీరు కార్మికులను ఆగ్రహానికి గురి చేస్తోంది. కార్మికుల సమస్యల పరిష్కారంలో యాజమాన్యం కూడా మొండి వైఖరిని ప్రదర్శిస్తోంది. ఈ నేపథ్యంలో గత నెల 27న ఆర్టీసీ సీఎండీని కలిసి 21 అంశాలపై ఆరు సంఘాల జేఏసీ తమ డిమాండ్లను అందించింది. వీటిపై ఎట్ట కేలకు దిగివచ్చిన యాజమాన్యం ఈ నెల 10న కార్మిక శాఖ కమిషనర్ సమక్షంలో చర్చలకు ఆహ్వానించింది. ఈ చర్చలు సఫలం కాకుంటే ఏ క్షణమైనా సమ్మెకు వెళ్లేందుకు కార్మిక సంఘాలు సంసిద్ధమవుతున్నాయి.
కరీంనగర్, ఫిబ్రవరి 8 (నమస్తే తెలంగాణ) : ఆర్టీసీ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై యాజమాన్యానికి ఎన్నో సార్లు విజ్ఞప్తులు, విన్నపాలు చేస్తూ వచ్చారు. అనేక పెండింగ్ సమస్యలను పరిష్కరించడంలో యాజమాన్యం అనుసరిస్తున్న మొండి వైఖరిపై కార్మికులు విసిగిపోయారు. ఇటు అధికారంలోకి రాక ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలులోకి తేకపోవడంపైనా కార్మికులు రగిలి పోతున్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసి, కార్మికులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానమైన వేతనాలు అందిస్తామని, రెండు పీఆర్సీ బకాయిలు చెల్లిస్తామని, వచ్చే పీఆర్సీలో ఆర్టీసీ కార్మికులను చేరుస్తామని, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా అన్ని వసతులు, సదుపాయాలు కల్పిస్తామని, ఆర్టీసీ బస్సులను ఆధునీకరిస్తామని, అధునాతమైన సౌకర్యాలతో కొత్త సర్వీసులు ప్రారంభిస్తామని, ఆర్టీసీ యూనియన్ల పునరుద్దరణకు అనుమతిస్తామని ఇంకా అనేక హామీలను కార్మికులకు ఇచ్చింది.
ఓట్ల కోసం ఇచ్చిన ఈ హామీల్లో అధికారంలోకి వచ్చిన 14 నెలల్లో వాటి ఊసే ఎత్తడం లేదని కార్మికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికలకు ముందు తమకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కార్మిక సంఘాల నాయకులు ప్రభుత్వ పెద్దలను కలిసేందుకు వెళ్లినపుడల్లా అవమానాలకు గురవుతున్నారు. మంత్రులు మొదలు, ముఖ్యమంత్రి వరకు తమ పట్ల ఎన్నికలకు ముందు ఒక తీరు.. ఇప్పుడు మరో తీరు ప్రవర్తిస్తున్నారని ఆర్టీసీ కార్మిక సంఘాల నాయకులు మండిపడుతున్నారు. 14 నెలల వరకు సహనం వహించిన కార్మికులు, సంఘాలు ఇటు యాజమాన్యంతో అటు ప్రభుత్వంతో అమీ.. తుమీ తేల్చుకోవాలనే నిర్ణయానికి వచ్చాయి. అందులో భాగంగానే ఆర్టీసీ కార్మిక సంఘాలైన టీఎంయూ, ఎంప్లాయీస్ యూనియన్, నేషనల్ మజ్దూర్ యూనియన్, బీకేయూ, బీడబ్ల్యూకే, కార్మిక పరిషత్ జేఏసీగా ఏర్పడి గత నెల 27న ఆర్టీసీ సీఎండీ, ఇతర ఉన్నతాధికారులను కలిసి 21 అంశాలతో తమ డిమాండ్లను అందించాయి. వాటిని తక్షణమే పరిష్కరించాలని, లేని పక్షంలో నిరవధిక సమ్మెకు దిగుతామని హెచ్చరించాయి.
కార్మికుల్లో కదలిక
తమ డిమాండ్లపై ఈ నెల 9 వరకు స్పందించాలని గత నెల 27న ఇచ్చిన సమ్మె నోటీసులో కార్మిక సంఘాల జేఏసీ పేర్కొన్నది. అయితే, సమ్మెను విచ్ఛిన్నం చేసేందుకు యాజమాన్యం కుట్రలు చేస్తోందని కార్మిక సంఘాల నాయకులు అంటున్నారు. డిపోల ఎదుట గేట్ మీటింగ్‌లు పెట్టి కార్మికులు, ఉద్యోగులకు ఆర్టీసీ యాజమాన్యం ఇప్పటి వరకు కల్పించిన సదుపాయాలను వివరించే ప్రయత్నం చేస్తోంది. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం మూడు షిఫుల్లో విధులకు హాజరయ్యే కార్మికులకు డిపోల మేనేజర్లు, ఇతర అధికారులు గేట్ మీటింగ్‌లు తీసుకుంటూ యాజమాన్యానికి నివేదికలు ఇస్తున్నారు. అధికారులు ఎన్ని ప్రలోభాలకు గురి చేసినా తమ సంఘాలు తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటామని కార్మికులు స్పష్టం చేస్తున్నారు. కాగా, మునుపెన్నడూ లేని విధంగా ఆర్టీసీ కార్మికుల్లో కదలిక కనిపిస్తోంది. సమ్మెకు ఎప్పుడు పిలుపునిస్తే అప్పుడు దిగేందుకు సిద్ధంగా ఉన్నామని కార్మికులు ముక్తకంఠంతో స్పష్టం చేస్తున్నారు.
తాము ఎదుర్కొంటున్న సమస్యలను ఈ సందర్భంగా ఏకరవు పెడుతున్నారు. ముఖ్యంగా అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ఇచ్చిన మేనిఫెస్టో హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. మాస్టర్ స్కేల్ విధానం ఆర్టీసీకి కార్మకులకు వర్తింపజేయాలని డిమాండ్ చేస్తున్నారు. పని భారంతో గుండె పోట్లకు గురై మరణిస్తుంటే యాజమాన్యం చెకింగ్‌ల పేరుతో తమని వేదిస్తోందని కండక్టర్లు, డ్రైవర్లు వాపోతున్నారు. ఆధునికత పేరుతో కార్పొరేట్ సంస్థలకు చెందిన ఎలక్ట్రికల్ బస్సులను అద్దెకు తెచ్చి ఆర్టీసీని ప్రైవేట్‌పరం చేసే కుట్రకు తెర తీశారని మండిపడుతున్నారు. ఈ బస్సుల్లో పనిచేస్తున్న డ్రైవర్లకు, ఆర్టీసీకి సంబంధం లేదని, ఈ బస్సుల కోసం ఆర్టీసీ ఆస్తులను ప్రభుత్వం ధారాదత్తం చేస్తున్నదని ఆరోపిస్తున్నారు. ఎలక్ట్రికల్ బస్సులను ఆర్టీసీ యాజమాన్యమే నడపాలని, ప్రైవేట్ గుత్తాధిపత్యం ఎందుకని ప్రశ్నిస్తున్నారు. ఈ బస్సుల ప్రవేశంతో తమకు ఉద్యోగ భద్రత కరువవుతోందని వాపోతున్నారు.
గత పదేళ్లలో ఆర్టీసీలో రిక్రూట్మెంట్ లేక పోవడంతో ఉద్యోగులపై విపరీతమైన పని భారం పెరిగిందని, సంస్థలో ఉద్యోగులు రిటైర్డ్ అయిన తర్వాత ఉన్నవారితోనే పనిచేయిస్తున్నారని, పనిభారం తట్టుకోలేక ఆర్టీసీ కార్మికులు అనారోగ్యం బారిన పడుతున్నారని, దీనికి తోడు యాజమాన్యం వేధింపులు రోజు రోజుకూ పెరుగుతున్నాయని వాపోతున్నారు. 14 నుంచి 16 గంటలు డ్యూటీ చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పదేళ్లుగా కార్మికులకు రావాల్సిన ఎన్‌క్యాష్‌మెంట్ ఇంత వరకు చెల్లించలేదని, కార్మికులు అనేక ఆర్థిక ఇబ్బందులతో తీవ్ర అవస్థలు పడుతున్నా యాజమాన్యం పట్టింపు లేకుండా వ్యవహరిస్తోందనే ఆరోపణలు వస్తున్నాయి. 2024 నుంచి రిటైర్మెంట్ పొందిన ఉద్యోగులు, కార్మికులకు గ్రాట్యుటీ చెల్లించక పోవడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. గడిచిన ఐదేళ్లుగా యూనిఫాం కూడా ఇవ్వడం లేదని కార్మికులు ఆవేదన చెందుతున్నారు. ఇలా అనేక సమస్యలను సమ్మె నోటీసులో ప్రస్తావించిన జేఏసీ నాయకులు.. ఇప్పటికైనా తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు.
చర్చలు ఫలించకపోతే సమ్మె అనివార్యం
ఈ నెల 10న హైదరాబాద్‌లోని కార్మిక శాఖ జాయింట్ కమిషనర్ కార్యాలయంలో ఆర్టీసీ యాజమాన్యం, జేఏసీ నాయకులతో చర్చించేందుకు శుక్రవారం నోటీసులు ఇచ్చింది. 10న సాయంత్రం 4 గంటలకు జరగబోయే చర్చల్లో జేఏసీలోని ఏడు సంఘాల నాయకులు హాజరవుతున్నారు. కార్మికులు సమ్మెకు వెళ్తే ఎదురయ్యే పరిణామాలపై ఇప్పటికే ఆర్టీసీ యాజమాన్యంలో చర్చ జరగుతున్నట్లు తెలుస్తోంది. యాజమాన్యం చేతిలో ఉన్న సమస్యలను పరిష్కరించేందుకు ముందుకు వస్తుందా? లేదా?, కార్మిక సంఘాలు ఇచ్చిన 21 డిమాండ్లలో ఎన్నింటికి అంగీకరిస్తుందనేది ఆసక్తిగా మారింది. కార్మిక సంఘాలు మాత్రం తామిచ్చిన 21 డిమాండ్లలో అన్నింటినీ పరిష్కరించాలని గట్టి నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ప్రభుత్వం తీసుకోవాల్సిన విధాన పరమైన నిర్ణయాలపైనా యాజమాన్యమే చర్చించాలని కార్మిక సంఘాల జేఏసీ డిమాండ్ చేస్తోంది.
యాజమాన్యమే ప్రభుత్వంతో చర్చలు జరిపి సానుకూల నిర్ణయాలు తీసుకునేలా చర్యలు తీసుకోవాలని కోరుతోంది. అయితే, యాజమాన్యం తమ డిమాండ్లను అంగీకరించకుంటే.. తదుపరి చేపట్టే కార్యక్రమాలపై కార్మిక సంఘాలు చర్చలు జరుపుతున్నాయి. ఇప్పటికే సమ్మె పోస్టర్లను కూడా జేఏసీ ఆధ్వర్యంలో విడుదల చేశారు. జేఏసీలో చేరిన కార్మిక సంఘాలు కూడా సన్నాహక సమావేశాలకు సిద్ధమవుతున్నాయి. అందులో భాగంగా ఆర్టీసీలో అతిపెద్ద కార్మిక సంఘమైన తెలంగాణ మజ్దూర్ యూనియన్ ఆదివారం హైదరాబాద్‌లో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారంరెడ్డి థామస్‌రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి విస్తృత స్థాయి సమావేశం నిర్వహిస్తోంది. ఇది సమ్మె సన్నాహక సమావేశమేనని ఆర్టీసీ కార్మికులు స్పష్టం చేస్తున్నారు.
చర్చల తర్వాతే నిర్ణయం
ఆర్టీసీ యాజమాన్యం ఎట్టకేలకు చర్చలు జరిపేందుకు దిగి వచ్చింది. కార్మిక శాఖ మధ్యవర్తిత్వం వహిస్తోంది. ఈ నెల 10న హైదరాబాద్‌లోని టంగుటూరి అంజయ్య భవన్లో చర్చలకు సమయం ఇచ్చారు. మేం పెట్టిన డిమాండ్లన్నింటినీ పరిష్కరించాల్సిందే. సమ్మె చేయాలనేది మా ఉద్దేశం కాదని ముందే ప్రకటించాం. మాపై యాజమాన్యం, ప్రభుత్వం అవలంభిస్తున్న విధానాలు మారాలని కోరుతున్నాం. మా న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని అడుగుతున్నాం. ఎలాంటి అగ్రిమెంట్లు లేకుండా ఎలక్ట్రికల్ బస్సులను ఆర్టీసీ సమకూర్చుకుంటోంది. ఆర్టీసీ ఆస్తులను ధారాదత్తం చేస్తోంది. ఇవన్నీ ఆర్టీసీని ప్రైవేటీకరించేందుకు జరుగుతున్న కుట్రలుగా మేం భావించాల్సి వస్తోంది. ఎలక్ట్రికల్ బస్సులను ఆర్టీసీయే సమకూర్చుకోవచ్చు కదా!. ఇందులో ప్రైవేట్ పెత్తనం ఏంటి?. వీటి వల్ల కార్మికుల భద్రతకు, ఆర్టీసీకి ముప్పువాటిల్లే ప్రమాదం ఉంది. మేం స్పష్టమైన ఎజెండాతో వెళ్తాం. అంతే కాకుండా, ప్రభుత్వం తీసుకోవాల్సిన విధాన పరమైన నిర్ణయాల విషయంలోనూ యాజమాన్యమే చొరవ తీసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను అమలు చేయాలనేది కూడా మా డిమాండ్లలో ప్రధానమైనది. ఆర్టీసీ యాజమాన్యంతో జరిగే చర్చల రిజల్ట్‌ను బట్టి సమ్మె నిర్ణయం తీసుకుంటాం. జేఏసీలో మరో సంఘం చేరడంతో ఏడుకు చేరాయి. ఈ నెల 10న చర్చలు విఫలమైతే సమ్మె ఎప్పటి నుంచి అనేది ప్రకటిస్తాం.
– మారంరెడ్డి థామస్ రెడ్డి, టీఎంయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఆర్టీసీ జేఏసీ వైస్ చైర్మన్
కార్మికులను ప్రలోభ పెడుతున్నరు
మా సమస్యల పరిష్కారం కోసం సమ్మెకు దిగుతామని గత నెల 27న నోటీసు ఇచ్చినప్పటి నుంచి ఆర్టీసీ యాజమాన్యం కార్మికులను ప్రలోభ పెడుతోంది. ప్రతి డిపో ఎదుట ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం మూడు షిఫ్టుల్లో విధులకు హాజరయ్యే కార్మికులకు గేట్ మీటింగ్‌లు పెట్టి అధికారులు మాయ మాటలు చెబుతున్నరు. సమ్మెకు వెళ్తే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయని భయపెడుతున్నరు. అయినా, కార్మికులు వినే స్థితిలో లేరు. ఏండ్ల తరబడిగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను పరిష్కరించుకునేందుకు సమ్మె ఒక్కటే మార్గమనే నిర్ణయానికి వచ్చారు. ఆర్టీసీని కాపాడుకునే బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. సమ్మె అనివార్యమైతే అన్ని రాజకీయ పక్షాల మద్దతు కోరుతున్నం. గత ప్రభుత్వ హయాంలో ఆర్టీసీ విలీన ప్రక్రియ 90 శాతం పూర్తయ్యింది. మిగతా 10 శాతం పూర్తి చేస్తామని చెప్పిన కాంగ్రెస్ ఇప్పుడు పట్టించుకోవడం లేదు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టిన ప్రతి హామీని అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నం.
– ఎంపీ రెడ్డి, ఆర్టీసీ జేఏసీ, కరీంనగర్ జిల్లా చైర్మన్