MLA Padi Kaushik Reddy | హుజురాబాద్, ఏప్రిల్ 23 : ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ ది ఆత్మహత్య కాదని, అది ప్రభుత్వ హత్యేనని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. శంకర్ గౌడ్ ఆత్మహత్య సంఘటనపై ఆయన శుక్రవారం మాట్లాడారు. ఆర్టీసీ కార్మికులకు బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించిందని పేర్కొన్నారు. ఆర్టీసీ కార్మికుడు శంకర్ గౌడ్ ఆత్మహత్యకు పాల్పడటం ఎంతో బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సంఘటన ప్రభుత్వం కార్మికుల సమస్యలను ఎంతవరకు నిర్లక్ష్యం వహిస్తోందని స్పష్టంగా తెలుస్తుందని ఆయన విమర్శించారు.
ఆర్టీసీ కార్మికుల న్యాయమైన డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్మికుల సమస్యలను పరిష్కరించకుండా కాలయాపన చేయడం వల్లే ఇటువంటి దురదృష్టకర సంఘటనలు చోటుచేసుకుంటున్నాయని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ కీలకమైన జీఓ విడుదల చేసిందని గుర్తుచేశారు.
ఆ జీఓను వెంటనే అమలు చేయాలని ప్రస్తుత ప్రభుత్వాన్ని కోరారు. అదే విధంగా బీఆర్ఎస్ ప్రభుత్వ కాలంలో ఆర్టీసీ అభివృద్ధి కోసం ప్రతీ సంవత్సరం సుమారు రూ.1500 కోట్లు విడుదల చేసి సంస్థను బలోపేతం చేసిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు. కానీ ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వం సరైన నిధులు కేటాయించకపోవడం, సమస్యలను పట్టించుకోకపోవడం వల్ల ఆర్టీసీ ఆర్థికంగా దెబ్బతింటోందని ఆరోపించారు. ప్రస్తుత పరిస్థితుల్లో కార్మికులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని , ఉద్యోగ భద్రత లేకపోవడం వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారని తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి కార్మికులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ కార్మికులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని విజ్ఞప్తి చేశారు. సమస్యల పరిష్కారం కోసం కలిసి పోరాటం చేయాలని, బీఆర్ఎస్ ఎప్పుడూ కార్మికుల పక్షాన నిలుస్తుందని హామీ ఇచ్చారు.