ఆర్టీసీ పట్టణప్రాంతాలకే పరిమితమవుతున్నది. పలు కారణాలు చూపుతూ మారుమూల ప్రాంతాల్లో సర్వీసులను కట్ చేస్తున్నది. ఫలితంగా పల్లెల్లోని పేద విద్యార్థుల చదువు మిథ్యగా మారుతున్నది. మెజార్టీ గ్రామాలకు బస్సు సౌకర్యం నిలిపివేయడంతో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లలు ఇబ్బందులు పడుతున్నారు. సుదూర ప్రాంతాల్లోని బడులకు వెళ్లలేక నానా అవస్థలు పడుతున్నారు. కొందరు ఐదారు కిలో మీటర్లు నడుచుకుంటూ వస్తుండగా, మరికొందరు సైకిళ్ల మీద, ఇంకొందరు ఆటోల్లో వెళ్తున్నారు.
ప్రతి ఊరుకు సేవలు విస్తరిస్తున్నామని, ఫ్రీ బస్సుతో ప్రజలకు చేరువవుతున్నామని ప్రకటనలతో ఊదరగొడుతున్న ఆర్టీసీ, మారుమూల గ్రామాలపై వివక్ష చూపుతున్నది. రోడ్లు బాగాలేవని, రాబడిలేదని బస్సులకు బ్రేక్ వేస్తుండగా, పిల్లల చదువులకు సంకటం ఏర్పడుతున్నది. విద్యార్థులు నిత్యం ఐదారు కిలోమీటర్ల మేర సైకిళ్లు, కాలినడక వెళ్తున్నప్పటికీ అది శ్రమకు మించిన భారం కావడంతో ఆరోగ్యం దెబ్బతింటున్నది. ఆటోలు నడుస్తున్నా చార్జీల స్థోమత లేక పేద కుటుంబాలు తల్లడిల్లుతుండగా, పిల్లలు చదువును మధ్యలోనే ఆపేయాల్సిన దుస్థితి దాపురించింది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సర్వీసులు పునరుద్ధరించాలని విద్యార్థులు, తల్లిదండ్రుల నుంచి డిమాండ్ వ్యక్తమవుతున్నది.
పెద్దపల్లి కమాన్, జూలై 3: పెద్దపల్లి జిల్లాలో 539 మండల పరిషత్ ప్రాథమిక, ప్రాథమికోన్నత, జడ్పీ ఉన్నత పాఠశాలలు ఉండగా, 26,215 మంది విద్యార్థులు అభ్యసిస్తున్నారు. అందులో సుమారు 16 వేల మంది విద్యార్థులు మారుమూల ప్రాంతాల నుంచి సైకిళ్లు, కాలినడక, ఆటోల్లో స్కూళ్లకు వస్తున్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రం నుంచి సబ్బితం, రొంపికుంట గ్రామాల మీదుగా గోదావరిఖని వరకు గతంలో ఆర్టీసీ బస్సు నడిచేది.
రంగాపూర్, సబ్బితం, పేరపల్లి విద్యార్థులు రొంపికుంట జడ్పీ ఉన్నత పాఠశాలకు, ఎల్కపల్లి, గుంటూరుపల్లి, లక్ష్మీపురం విద్యార్థులు ఎఫ్‌సీఐ జడ్పీ ఉన్నత పాఠశాలకు వెళ్లి చదువుకునే వారు. అయితే పలు కారణాలతో పెద్దపల్లి నుంచి సబ్బితం మీదుగా గోదావరిఖనికి బస్సు నడవడం లేదు. దీంతో విద్యార్థులు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తున్నది.
రొంపికుంట జడ్పీహెచ్ఎస్లో సుమారు 250 మంది అభ్యసిస్తుండగా, అందులో 160 మంది ఇతర గ్రామాల నుంచి సైకిళ్లపై, కొందరు డబ్బులు పెట్టుకొని ఆటోల్లో వస్తున్నారు. ఇక ఎఫ్‌సీఐ జడ్పీ ఉన్నత పాఠశాలలో సుమారు 90 మంది అభ్యసిస్తుండగా, అందులో 50 మంది ఇతర గ్రామాల నుంచి సైకిళ్లు, కాలినడకన వస్తున్నారు. అలాగే పెద్దపల్లి మండలం గౌరెడ్డిపేట, ముత్తారం, ధర్మాబాద్ గ్రామాల నుంచి జిల్లా కేంద్రంలో జడ్పీహెచ్ఎస్ (బాలుర), జడ్పీహెచ్ఎస్ (బాలికల) పాఠశాలలకు విద్యార్థులు సైకిళ్లు, ఆటోల్లో వచ్చి చదువుకుంటున్నారు.
సుదూర ప్రాంతాలకు కాలినడకన, సైకిళ్లపై రోజూ వెళ్తుండడంతో పిల్లలకు అనారోగ్య సమస్యలూ తలెత్తుతుండగా, ఆటోల్లో వచ్చేవారికి చార్జీల భారం ఎక్కువైపోతున్నది. దీంతో మెజార్టీ పిల్లలు చదువులు మధ్యలోనే మానేయాల్సిన దుస్థితి దాపురించింది. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు పట్టించుకుని మారుమూల గ్రామాలకు ఆర్టీసీ బస్సు నడిపించాలని విద్యార్థులు, తల్లిదండ్రులు కోరుతున్నారు.
మాది పెద్దపల్లి మండలం రంగాపూర్. నేను రొంపికుంట జడ్పీ ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న. మా ఊరి నుంచి రొంపికుంటకు బస్సు లేకపోవడంతో ప్రతి రోజు ఆటోలో వస్తున్న. నెలకు రూ.1200 కిరాయి కడుతున్న. బస్సు ఉంటే మాకు ఈ డబ్బులు మిగిలేవి. స్కూల్ దూరంగా ఉండడంతో ఆటోలో రావాల్సి వస్తుంది. అధికారులు మా స్కూల్ రూట్లో బస్సు నడిపించాలి.
– బీ శ్రీవర్షిణి, జడ్పీహెచ్ఎస్ (రొంపికుంట)
మాది కమాన్‌పూర్ మండలం నాగారం. నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న రొంపికుంట బడిలో తొమ్మిదో తరగతి చదువుతున్న. బస్సు సౌకర్యం లేక రోజూ సైకిల్ పైన స్కూల్‌కు వస్తున్న. వానకాలంలో సైకిల్ పైన రావడం ఇబ్బందైతంది. బస్సు లేకపోవడంతో మా ఫ్రెండ్స్ కొందరు స్కూల్‌కు రావడం మానేసిన్రు. మా ఊరికి బస్సు వేసి మా కష్టాలను తొలగించాలి.
– టీ అలేఖ్య, జడ్పీహెచ్ (రొంపికుంట)
మాది పెద్దపల్లి మండలం సబ్బితం. నేను రొంపికుంట జడ్పీ స్కూల్లో పదోతరగతి చదువుతున్న. మా ఊరి నుంచి రొంపికుంట పాఠశాలకు వెళ్లే రూట్లో బస్సు సౌకర్యం లేదు. దీంతో మా తమ్ముడు నేను రోజూ ఒకే సైకిల్ పైన వెళ్తున్నం. మా ఊరికి పాఠశాలకు మూడు కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఇద్దరం కలిసి ఒకే సైకిల్ మీద రావడం చాలా కష్టం అవుతుంది. ఆటో వస్తమంటే చార్జీలు బాగా అడుగుతున్నరు. బస్సులు లేక కొందరు పాఠశాలలకు రావడం లేదు. మా రూట్లో బస్సులు వేయిస్తే మేమందరం బస్సులో వెళ్లి చదువుకుంటం.
– బీ అభివర్ధన్, జడ్పీహెచ్ఎస్ (రొంపికుంట)
మాది పాలకుర్తి మండలం ఎల్కలపల్లి. నేను ఎఫ్‌సీఐ జడ్పీ పాఠశాలలో ఏడో తరగతి చదువుకుంటున్న. మా ఇంటి నుంచి స్కూల్ వరకు దాదాపు కిలోమీటర్ల దూరం ఉంటుంది. బస్సు సౌకర్యం లేక కాలినడకనే వస్తున్న. అప్పుడప్పుడు ఎవరైనా బైక్‌పైన లిఫ్ట్ సాయంతో వస్త. మా రూట్లో బస్సు ఉంటే బాగుండేది. రోజూ అంత దూరం నడుచుకుంటూ వస్తుండడంతో కాళ్ల నొప్పులు వస్తున్నయి. మాకు బస్సు వేయిస్తే మంచిగా ఉంటది.
– కే కార్తీక్, జడ్పీహెచ్ఎస్ (ఎఫ్‌సీఐ)
వీణవంక, జూలై 3: వీణవంక మండలంలోని మెజార్టీ గ్రామాలకు ఆర్టీసీ బస్సు నడపడం లేదు. ఇప్పలపల్లి, బ్రాహ్మణపల్లి, మల్లన్నపల్లి, రామకృష్ణాపూర్, లస్మక్కపల్లి, నర్సింహులపల్లి గ్రామాలకు బస్సు సౌకర్యం లేక 150 మంది విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. కొందరు కాలినడకన, మరికొందరు సైకిళ్లపై నిత్యం రెండు మూడు కిలోమీటర్లు వెళ్తున్నారు. ఆటోలు ఉన్నా ఆర్థిక భారం ఎక్కువవుతుండడంతో తల్లిదండ్రులు సతమతమవుతున్నారు. ప్రభుత్వం స్పందించి బస్సు సర్వీసు వేయాలని కోరుతున్నారు.