Arepalli | వేములవాడ రూరల్, డిసెంబర్ 6 : పల్లె పోరు రసవత్తరంగా మారింది. ఎన్నికల పోలింగ్ తేదీ దగ్గర పడడంతో పాటు ప్రచారానికి కూడా సమయం లేకపోవడంతో అభ్యర్థుల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. దీంతో సర్పంచ్ అభ్యర్థులు వివిధ రకాల ప్రచారాలు చేస్తూ ఓటర్లను ఆకట్టుకునేందుకు వివిధ రకాల ప్రచారాలు చేపట్టారు.
అందులో భాగంగా వేములవాడ మండలం ఆరేపల్లి సర్పంచ్ అభ్యర్థి ఇటిక్యాల రాజు గ్రామంలో ఆడపిల్ల పుడితే రూ.10వేలు అందజేస్తానని ఓటర్లను ఆకట్టుకునేందుకు ప్రచారం చేపట్టాడు. పుట్టిన వెంటనే ఆడపిల్ల పేరిట రూ.10వేల ఫిక్స్ డిపాజిట్ చేస్తానని ప్రచారంలో హామీ ఇస్తున్నాడు. దీంతో గ్రామంలో ఆసక్తి నెలకొంది. ఆడపిల్ల పుడితే రూ.10000 అందజేస్తామని చెప్పడంతో గ్రామంలో చర్చనీయాంశంగా మారింది. ప్రచారానికి సమయం లేకపోవడంతో పాటు ఓటర్లను ఆకర్షించేలా అభ్యర్థులు ఈ విధంగా ప్రచారం చేస్తున్నారు.