Kolanur | ఓదెల, ఫిబ్రవరి 2: పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని కొలనూరు గ్రామంలోని పురాతన శివాలయం పునర్నిర్మాణ పనులలో భాగంగా సోమవారం పైకప్పు స్లాబ్ పనులను ప్రారంభించారు. ఇక్కడ కాకతీయుల కాలంలో సాంబ సదాశివ ఆలయ నిర్మాణం రాతితో జరిగింది. ఈ ఆలయం పూర్తిగా శిథిలావస్థకు చేరుకొని ఆలయ సకలాలు కూలిపోయాయి.
దీంతో గ్రామస్తులు చందాల రూపకంగా రూ.కోటి 20 లక్షలు జమ చేసి ఆలయ పునర్ నిర్మాణానికి పనులు ప్రారంభించారు. కాకతీయ కాలంలో నిర్మించిన మాదిరిగానే తిరిగి రాతి కట్టడంతో చివరి దశకు పనులు చేరుకున్నాయి. మరో మూడు నెలల్లో ఆలయ పునర్ ప్రతిష్ట కార్యక్రమం జరగనున్నట్లు ఆలయ కమిటీ పాలకవర్గం తెలిపారు.
కొలనురు గ్రామానికి చెందిన వివిధ పట్టణాల్లో స్థిరపడిన వారి వద్ద నుంచి కోటి రూపాయల పైబడి చందాలను ఆలయ పాలకవర్గం వసూలు చేశారు. ఈ ఆలయం రాతితో యధావిధిగా పునర్నిర్మాణం జరగడం పట్ల గ్రామంలో హర్షాతిరేకం వ్యక్తం అవుతుంది. ఇందుకు కృషిచేసిన పాలకవర్గం, అర్చకులు, గ్రామస్తులను పలువురు అభినందిస్తున్నారు.