వీణవంక, జూలై 12: ప్రయాణ సౌకర్యం కోసం, గ్రామాలు అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో చేపట్టిన ఫోర్‌లేన్ రోడ్డు నిర్మాణం ప్రయాణికులు, ప్రజలకు శాపంగా మారుతున్నది. రోడ్డు పనులు చేపట్టి ఆరేళ్లు గడిచినా అక్కడక్కడ అసంపూర్తిగా మిగిలిన పనులతో అటు ప్రయాణికులు అనేక పాట్లు పడాల్సి వస్తున్నది. ప్రజల సౌకర్యార్థం ప్రభుత్వం ఆబాది జమ్మికుంట నుంచి మానకొండూర్ వరకు రూ.40 కోట్లతో ఫోర్‌లేన్ పనులు ఆరేళ్ల క్రితం చేపట్టింది. పనులు చేపట్టిన కాంట్రాక్టర్ కొత్త రోడ్డు వేయడానికి పాత తారును తీసివేసి కంకర వేసి పనులు మొదలు పెట్టారు. అప్పటి నుంచి కొనసాగుతున్న పనులు నర్సింగాపూర్ శివారు వరకు మాత్రమే జరుగగా, ఆ తర్వాత కొంతకాలానికి గ్రామంలో సింగిల్ రోడ్డు వేసి వదిలేశారు.
అలాగే ప్రభుత్వ పాఠశాల ముందు కంకర వేసినా రోడ్డు నిర్మాణం చేపట్టలేదు. ఇక మరోచోట శ్రీరాములపేట శివారు నుంచి కోర్కళ్ గ్రామ శివారు వరకు పనులు అసంపూర్తిగా నిలిచిపోగా, కరీంనగర్ వెళ్లే రహదారిపై పడిన గుంతలతో తరచూ వాహనదారులు, ప్రజలు ప్రమాదాలకు గురవుతున్నారు. నిత్యం వాహనాల రాకపోకలతో వచ్చే దుమ్ముతో రోడ్డు పక్కనే ఉన్న చేనేత కార్మిక సహకార సంఘంలో పని చేసే కార్మికులు ఆరేళ్లుగా శ్వాసకోశ వ్యాధులతో ఇబ్బందులు పడుతున్నారు. అలాగే రెడ్డిపల్లి బస్టాండ్ కూడలి వద్ద నిత్యం ఇసుక, గ్రానైట్ లారీల రాకపోకలతో ఆర్అండ్బీ రోడ్డుపై పెద్ద గుంత ఏర్పడింది.
ఇప్పటికే పదుల సంఖ్యలో ప్రమాదాలు జరిగి ఎంతో మంది ప్రయాణికులు అంగవైకల్యం పొందారు. ఇదే రోడ్డుపై హెచ్‌పీ గ్యాస్ గోదాం సమీపంలో రోడ్డు వేయక వదిలేయడంతో ప్రమాదాలు జరిగి వాహనదారులు గాయాలపాలయ్యారు. ప్రభుత్వం, ఉన్నతాధికారులు ఇప్పటికైనా స్పందించి అసంపూర్తిగా మిగిలిపోయిన ఫోర్‌లేన్ రోడ్డును పూర్తి చేసి ప్రమాదాల నివారణకు కృషి చేయాలని వాహనదారులు, మండల ప్రజలు కోరుతున్నారు. దీనిపై ఆర్అండ్బీ ఏఈ కళ్యాణ్‌ను వివరణ కోరగా, బిల్లులు రాకపోవడంతో కాంట్రాక్టర్ ఫోర్‌లేన్ పనులు పూర్తి చేయలేదన్నారు. కాంట్రాక్టర్‌తో మాట్లాడానని, త్వరలోనే పనులు పూర్తి చేపిస్తామని తెలిపారు.