Road | వీర్నపల్లి, ఆగస్టు 23: ఇటీవల కురిసిన వర్షాలకు మండల కేంద్రంలో ప్రధాన రహదారి బురదమయంగా మారింది. దీంతో గ్రామస్తులు అధికారులకు సమాచారం ఇచ్చినా పట్టించుకోకపోవడం లేదు. దీంతో పెట్రోల్ బంకు సమీపంలో గ్రామస్తులే రోడ్డు మరమ్మతులు చేపట్టారు. పెద్ద వాగు వంతెన వద్ద రోడ్డు బురదమయంగా ఉండడంతో వాహనదారులు అదుపుతప్పి కింద పడుతున్నారు.
బ్రిడ్జి వద్ద రోడ్డు కోతకు గురై ప్రమాదకరంగా మారింది. అధికారులు నిర్లక్ష్యం వీడకపోవడంతో గ్రామస్తులు ముందుకు వచ్చారు. స్వచ్ఛందంగా ట్రాక్టర్లతో కంకర, మట్టి తీసుకువచ్చి గుంతలు పూడ్చి వేశారు. రోడ్డు మరమ్మతులు పనులకు జేసీబీ, ట్రాక్టర్లు సమకూర్చిన పోతారం లింబద్రి , రాములు, నాగారపు లింబద్రి, పెద్దవేణి నర్సయ్య, బోయిని రవిని పలువురు అభినందించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ వైస్ చైర్మన్ లక్ష్మణ్, డైరెక్టర్ చంద్రమౌళి, మాజీ ఎంపీటీసీ అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.