సైదాపూర్, అక్టోబర్ 30: కరీంనగర్ జిల్లా సైదాపూర్ (Saidapur)లో కురిసిన భారీ వాన రైతులకు కన్నీరు మిగిల్చింది. పట్టణంలోని ఎల్లమ్మ గుడి సమీపంలోని ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద రైతులు వడ్లు పోశారు. అయితే బుధవారం అర్ధరాత్రి వరకు భారీ వర్షం కురిసింది. దీంతో వెంకేపల్లి తుమ్మల చెరువు మత్తడి ఎక్కువ కావడంతో కట్టు కాలువలో ప్రవాహం పెరిగింది. వరద ఉధృతికి కట్టు కాలువ రెండు చోట్ల తెగిపోయింది. ఒక్కసారిగా వరద నీరు రావడంతో సైదాపూర్ కొనుగోలు కేంద్రం వద్ద పోసిన సుమారు 200 ట్రిప్పుల వడ్లు నీట మునిగాయి.

ప్రవాహం ఎక్కువ కావడంతో పెద్ద మొత్తంలో వడ్లు కొట్టుకు పోయాయి. రైతులు బొల్లా మహేందర్, వేణు, సారయ్య, రమేష్, కొమురయ్య, రాజు, రామచంద్రం, శంకర్, భూమయ్య, రమేశ్‌తో పాటు పలువురు రైతులు తీవ్రంగా నష్టపోయారు. ప్రతి ఏడు కొనుగోలు కేంద్రం వద్దనే వడ్లు పోస్తామని, ఈసారి కట్టు కాలువ తెగడంతో మా కష్టం అంత నీటి పలైందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కాగా కట్టు కాలువ తెగడంతో వెంకేపల్లి, సైదాపూర్, జాగిరిపల్లి గ్రామాలలో వందలాది ఎకరాల్లో వరి పంట నీట మునిగింది. కట్టు కాలువ మమ్ముల్ని నట్టేట ముంచిందని రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. పట్టణంలో 202 మిల్లి మీటర్ల వర్షం నమోదుకావడంతో కల్వర్టుల వద్ద వరద నీటికి సైదాపూర్-హుజురాబాద్ మధ్య రాకపోకలు నిలిచిపోయాయి.

