జగిత్యాల, అక్టోబర్ 15 : గతేడాది మార్చి నుంచి ఇప్పటి వరకు ఉద్యోగ విరమణ చేసిన ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ప్రయోజనాలు వచ్చేవరకు ఉద్యమం కొనసాగిస్తామని రేవా ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు కోహెడ చంద్రమౌళి స్పష్టంచేశారు. రేవా ఉమ్మడి జిల్లా ఆధ్వర్యంలో రిటైర్డ్ ఉద్యోగులు బుధవారం జగిత్యాల కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపి, ఏవోకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు ఉపాధ్యక్షుడు గద్ద జగదీశ్వరాచారి మాట్లాడారు. ఏడాదిన్నర కాలంగా ఉద్యోగ విరమణ పొందిన వారికి జీపీఎఫ్, జీఐఎస్, లీవ్ ఎన్క్యాష్మెంట్, కమ్యూటేషన్, గ్రాట్యుటీ అందలేదన్నారు. బకాయిలు అందక పెన్షనర్లు చాలా ఇబ్బందులు పడుతున్నారని, గతంలో ఇలాంటి పరిస్థితి ఉండేది కాదని వాపోయారు. ఈ విషయమై ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకులు ప్రభుత్వానికి ఎన్నిసార్లు విన్నవించినా పెడచెవిన పెడుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు.
ఉమ్మడి జిల్లా కార్యదర్శి ఎన్నం రాంరెడ్డి మాట్లాడుతూ, పెన్షన్ బకాయిలు రాక ఇప్పటివరకు రాష్ట్రంలో 16 మంది పెన్షనర్లు చనిపోయారని, చాలామంది అనారోగ్యంతో దవాఖానల్లో చేరి డబ్బులు కట్టలేని పరిస్థితిలో ఉన్నారని తెలిపారు. ఆర్గనైజింగ్ కార్యదర్శి మామిడాల లక్ష్మీనారాయణ మాట్లాడుతూ, ఉద్యోగ విరమణ బకాయిలు వచ్చేంతదాకా అవసరమైతే ఆమరణ నిరాహార దీక్ష కూడా చేద్దామని పిలుపునిచ్చారు. ఇక్కడ కోశాధికారి కనపర్తి దివాకర్, అయిల్నేని నరేందర్ రావు, వెంకటరమణ, నసీం అహ్మద్, కటకం ప్రభు, కరుణశ్రీ, రాందాస్, వేణుగోపాల్, విమల, చంద్రమౌళి, చంద్రశేఖర్, దుబ్బయ్య, మదన్ మోహన్రావు, బాజోజి శ్రీనివాస్, పిన్నంశెట్టి శ్రీనివాస్, మోర గోవర్ధన్, అందె శ్రీనివాస్, బాదం పురుషోత్తం, సత్యనారాయణ రావు, శంకరయ్య, పోచయ్య, ఉదయ్ భాసర్, ప్రతాప్, శ్రీపాద వెంకటరమణ, చింతల రవీందర్ రెడ్డి, వై రవీందర్, దొడ్డ సత్యనారాయణ, మురళీకృష్ణ, రాజేందర్రెడ్డి పాల్గొనారు.