Revenue | పెద్దపల్లి, మే3: ఎలిగేడు మండలంలో ఈనెల 5-19వ వరకు భూ భారతి రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష వెల్లడించారు. కలెక్టరేట్లో ఎలిగేడు మండలంలో రెవెన్యూ సదస్సుల నిర్వహణపై కలెక్టర్ సంబంధిత అధికారులతో శనివారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎలిగేడు మండలాన్ని పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేసి భూ భారతి రెవెన్యూ సదస్సులు నిర్వహించి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామని తెలిపారు. అదనపు కలెక్టర్ (రెవెన్యూ) రెవెన్యూ సదస్సుల నిర్వహణకు ప్రత్యేక అధికారిగా ఉంటూ పర్యవేక్షిస్తారని పేర్కొన్నారు.
మూడు బృందాలను ఏర్పాటు చేసి ప్రతీ గ్రామ పంచాయతీలో రెండు రోజుల పాటు రెవెన్యూ సదస్సు జరిగేలా షెడ్యూల్ రూపొందించినట్లు తెలిపారు. భూ భారతి చట్టం ప్రకారం భూ సమస్యల పరిష్కారంపై రెవెన్యూ సదస్సులు నిర్వహించి ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామని, భూ సమస్యలు ఉన్న వారు రెవెన్యూ సదస్సులో పాల్గొని దరఖాస్తులు సమర్పించాలని సూచించారు.
ఎలిగేడు తహసీల్దార్ ఎండీ బషీరుద్దీన్ ఆధ్వర్యంలో టీం-1 ఎలిగేడులో 5,6న, లాలపల్లిలో 7, 8న , నారాయణపల్లిలో 9,12న, శివపల్లి గ్రామంలో 13,14న రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తారని చెప్పారు. కలెక్టరేట్ సూపరింటెండెంట్ బీ యక్కన్న ఆధ్వర్యంలో టీం-2 బుర్హాన్ మియాపేటలో 5, 6న, నర్సాపూర్‌లో 7,8న, సుల్తాన్‌పూర్‌లో 9,12న, లోకాపేటలో 13,14న రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తారని తెలిపారు.
కలెక్టరేట్ నాయబ్ తహసీల్దార్ ధీరజ్ కుమార్ ఆధ్వర్యంలో టీం-3 దూళికట్టలో 9,12న, ర్యాకాదేవపల్లిలో 13,14న, రాములపల్లిలో 15,16 న, ముప్పిరితోటలో 17,19న రెవెన్యూ సదస్సులు ఉంటాయని వెల్లడించారు. సమావేశంలో పెద్దపల్లి ఆర్డీవో బీ గంగయ్య, సర్వే ల్యాండ్ రికార్డ్స్ ఏడీ శ్రీనివాసులు, ఎలిగేడు తహసీల్దార్ బషీరోద్దీన్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.