Revenue conferences | మల్యాల, జూన్ 6: భూ సమస్యలను పరిష్కరించుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన భూభారతి కార్యక్రమం అమలులో భాగంగా గ్రామస్థాయిలో రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామని, క్షేత్రస్థాయిలో రైతులు సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని జగిత్యాల జిల్లా అదనపు కలెక్టర్ లతా అన్నారు. మల్యాల మండలం మానాల గ్రామంలో నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సును శుక్రవారం పరిశీలించారు. ఇప్పటివరకు వచ్చిన ఆర్జీల వివరాలు, భూ సమస్యలకు సంబంధించిన కారణాలు, తదితర విషయాలను మండల తహసీల్దార్ కోట వసంతను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం అదనపు కలెక్టర్ లతా మాట్లాడుతూ గ్రామీణ స్థాయిలో నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులను నిర్వహించే అధికారులకు క్షేత్రస్థాయిలో ఉండే భూ సమస్యలను రైతులు చెప్పుకొని ఆర్జీలు సమర్పించాలన్నారు. రెవెన్యూ సదస్సుకు వచ్చే ప్రతి దరఖాస్తులను పరిశీలించిన పిదప, ప్రతి దరఖాస్తుదారుడికి సమస్య పరిష్కారం అయ్యే విధంగా అధికార యంత్రాంగం చర్యలు తీసుకుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ కోట వసంత, గిర్దావార్ రాణి, జూనియర్ అసిస్టెంట్ ప్రవీణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.