Manda Krishnamadiga | మంథని, ఆగస్టు 20: ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీని సీఎం రేంవత్‌రెడ్డి నిలబెట్టుకోవాలని ఎమ్మార్పీస్ వ్యవస్థాపక అధ్యక్షుడు పద్మశ్రీ మంద కృష్ణమాదిగ అన్నారు. మంథనిలోని ఎస్ఎల్బీ గార్డెన్స్‌లో మంథని నియోజకవర్గంలోని పెన్షన్‌దారుల సన్నాహాక సభ కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మంద కృష్ణమాదిగ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో వికలాంగులకు రూ. 6వేలు, వృద్ధులకు, వితంతువులకు, చేయూత పెన్షన్ రూ. 4వేలు పెన్షన్ పెంచి ఇస్తామని మ్యానిఫెస్టోలో ప్రకటించిందన్నారు. అధికారంలోకి వచ్చి 20 నెలలు గడుస్తున్నా రేవంత్‌రెడ్డి సర్కారు పెన్షన్ పెంపు ప్రస్థావన తీయక పోవడం బాధకరమన్నారు. పెన్షన్ పెంపు చేస్తారనే నమ్మకంతో పెన్షన్ దారులంతా కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారని.. ఇచ్చిన మాటను వెంటనే నిలబెట్టుకోవాలన్నారు.
పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల సమయంలో హామి ఇచ్చి అధికారంలో వచ్చిన వెంటనే పెన్షన్ పెంచడంతో పాటు ఎన్నికల సమయంలో మాట ఇచ్చినప్పటికీ నెలలకు కలిపి కూడ ఇవ్వడం నిజంగా అభినందనీయమన్నారు. ఆయన దగ్గర శిష్యరికం చేసిన రేవంత్‌రెడ్డికి అది కనపడటం లేదా అని ప్రశ్నించారు. పెన్షన్ పెంపు విషయంలో ప్రభుత్వం పూర్తి గా విఫలం కాగా.. ప్రశ్నించడంలో ప్రతిపక్ష పార్టీలు కూడ విఫలమవుతున్నాయన్నారు. పెన్షన్ పెంచుతామని హామీ ఇచ్చి అమలు చేయని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పెన్షనర్లంతా నిలదీయాలన్నారు.
పెన్షనర్లకు ఎన్నికల సమయంలో ఇచ్చిన మాటను కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే నిలబెట్టుకోవాలని, వికలాంగులకు రూ. 6వేలు, వృద్ధులకు, వితంతువులకు, చేయూత పెన్షన్ రూ. 4వేలు, తీవ్ర వైకల్యం ఉన్న వారికి రూ. 15వేలు పెన్షన్‌ను వెంటనే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పెన్షన్ పెంచుడా.. సీఎం రేవంత్‌రెడ్డి గద్దె దిగుడా అనే డిమాండ్‌తో సెప్టెంబర్ 9న హైదరాబాద్‌లో పెన్షనర్ల విశ్వ గర్జన సభను నిర్వహించడం జరుగుతుందని, ఈ సభకు పెన్షనర్లంతా అధిక సంఖ్యలో తరలి వచ్చి విజయవంతం చేయాలని ఆయన కోరారు.
తెలంగాణ రాష్ట్రంలో అన్ని నియోజకవర్గాల్లో పర్యటిస్తూ పెన్షనర్ల చైతన్య వంతులను చేస్తూ వారికి పెన్షన్ పెంచే విధంగా పోరాటం చేస్తున్నానన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఏపూరి వెంకటేశ్వర్రావుమాదిగ, అంబాల రాజేందర్ మాదిగ, గోపాల్‌పల్లె మాదిగ, నరిగ మల్లేశ్వరీ మాదిగ, మంథని చందు, నారాయణరెడ్డి, నరేష్‌మాదిగ, దశరథంలతో పాటు మంథని నియోజకవర్గంలోని పలువురు దళిత, దివ్యాంగుల సంఘాల నాయకులు పాల్గొన్నారు.