మంథని, సెప్టెంబర్ 9 : రేవంత్‌రెడ్డి, మంత్రులకు రాష్ట్రంలోని ప్రాజెక్టులపై కనీస అవగాహన లేదని, వేదికలపై ఏదేదో మాట్లాడుతూ తెలంగాణ పరువును తీస్తున్నారని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ ఘాటుగా విమర్శించారు. అధికారంలో వచ్చిన కాంగ్రెస్ పాలకులు, తెల్లకళ్లు తాగిన కోతుల్లా ఎగురుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రస్తుతం రాష్ట్ర పరిస్థితి పిచ్చోడి చేతిలో రాయిలాగా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు. మంథనిలోని రాజగృహలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 23నెలలు గడుస్తున్నప్పటికీ రేవంత్‌రెడ్డి తిట్టడం, అరవడం మానుకోలేదని ఎద్దేవా చేశారు. అభివృద్ధి, సంక్షేమం గురించి పూర్తిగా మరిచిపోయారని మండిపడ్డారు. హైదరాబాద్ నీళ్లు మూసి నదికి పంపే కార్యక్రమ శంకుస్థాపనలో ఆయన మాట్లాడిన తీరు ఆయన అవివేకానికి నిదర్శనమన్నారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు కట్టింది శ్రీపాదరావు అని, కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందంటూ మాట్లాడడం ఆయన అవగాహన లేమికి నిదర్శనమన్నారు.
2004లో ఎల్లంపల్లి పనులు ప్రారంభిస్తే 2016లో బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేసీఆర్ పూర్తి చేశారని గుర్తు చేశారు. 1999 ఏప్రిల్ 13న శ్రీపాదరావు మృతి చెందితే ఎల్లంపల్లి ప్రాజెక్టును ఎలా కట్టారో రేవంత్ సమాధానం చెప్పాలన్నారు. సీఎం మాట్లాడే సమయంలో పకనే ఉన్న మంత్రి అయినా నిజం చెప్పాలి కదా..? అని ప్రశ్నించారు. మతి భ్రమించిన మాట్లాడుతున్న సీఎం, మంత్రులను దవాఖానకు పంపించాలని సూచించారు. కాళేశ్వరం కూలి పోయిందని పదే పదే అంటున్న రేవంత్ ఇకడికి వచ్చి చూశారా..? అని ప్రశ్నించారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో ఏం డ్యామేజ్ అయిందో చూపించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ఇప్పటి వరకు ఇచ్చిన ఏ ఒక హమీ నెరవేర్చలేదని మండిపడ్డారు. గొప్ప ప్రాజెక్టులను నిర్వీర్యం చేశారని, ఎకడ రైతులకు 500 బోనస్ ఇవ్వాల్సి వస్తుందోనని యూరియా కొరత సృష్టించారన్నారు. ఇప్పటికైనా సీఎం, మంత్రులు స్పందించి ఓటు ద్వారా ఆశీర్వదించిన ప్రజలకు మెరుగైన పాలన అందించాలని సూచించారు. సమావేశంలో బీఆర్ఎస్ నాయకులు తగరం శంకర్‌లాల్, ఎగోలపు శంకర్‌గౌడ్, మాచీడి రాజుగౌడ్, ఆకుల రాజబాపు, కాయితీ సమ్మయ్య, వేల్పుల గట్టయ్య, గొబ్బూరి వంశీ, తిరుపతి, ఆసీఫ్, పొట్ల శ్రీకాంత్ పాల్గొన్నారు.