కరీంనగర్, ఆగస్టు 4 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : పూర్వ కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో పనిచేసిన ఉద్యోగులు, 1980లో కరీంనగర్ జిల్లా తెలంగాణ నాన్ గెజిటెట్ ఆఫీసర్ల పేరిట గృహ నిర్మాణ సహకార సొసైటీ (రిజిస్టర్ నంబర్ 1103)ను ఏర్పాటు చేసుకున్నారు. ఆ సొసైటీలో ఆనాడు 456 మంది ఉద్యోగులు సభ్యత్వం తీసుకున్నారు. తాము ఇళ్లు నిర్మాణం చేసుకోవాలని కోరుతూ ఆనాటి కలెక్టర్ ఎన్ శర్మకు విజ్ఞప్తి చేశారు. అప్పుడు కలెక్టర్ మొత్తం 456 మందికి సంబంధించి వేర్వేరు ప్రాంతాల్లోని మూడు సర్వేనంబర్లలో 50 ఎకరాలు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
ఆ ప్రకారం సర్వేనంబర్ 918లో 14 ఎకరాలు, సర్వేనంబర్ 415లో 18 ఎకరాలు కేటాయించారు. ఈ రెండు సర్వే నంబర్లలో స్థలాలను ఆనాటి ఉద్యోగులు స్వాధీనం చేసుకున్నారు. వీటితోపాటు బొమ్మకల్ పరిధిలోని సర్వేనంబర్ 96లో 20 ఎకరాలకు 1981 ఆగస్టు 31న (ప్రొసీడింగ్స్ నంబర్ ఎ5/1052/81) కేటాయించారు. మొదటి రెండు సర్వేనంబర్లను స్వాధీనం చేసుకున్న ఆనాటి అసోసియేషన్ సభ్యులు, తర్వాత యూనియన్‌లో వచ్చిన విభేదాల నేపథ్యంలో సర్వేనంబర్ 96లో కేటాయించిన స్థలాన్ని స్వాధీనం చేసుకోలేదు.
ఈ పరిస్థితుల్లో భూమి రాని ఉద్యోగులంతా ఒక అసోసియేషన్‌గా ఏర్పడి, కలెక్టర్ కేటాయించిన భూమిని తమకు అప్పగించాలని కోరుతూ ఆనాటి నుంచి నేటి వరకు పోరాటం చేస్తూనే ఉన్నారు. మలి వయసులోనూ మడమ తిప్పకుండా పోరాడుతున్నా, అధికారయంత్రాగం కట్టుకథలు చెప్పి తప్పించుకుంటున్నదే తప్ప వాస్తవాలు వెల్లడించడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిజానికి అప్పుడు కేటాయించిన మూడు సర్వేనంబర్లపై నిషేధిత ఆదేశాలున్నా, ఆనాడు కలెక్టర్లకు ఉన్న అధికారాల దృష్ట్యా వాటిని ఎత్తేసి, ఆ భూములను అసోసియేషన్‌కు ఆనాటి కలెక్టర్ శర్మ అప్పగించారు. ఈ విషయం స్పష్టంగా ఉద్యోగుల ఏజెండాలోనే ఉన్నది.
కబ్జాలపాలు?
బొమ్మకల్ పరిధిలోని సర్వేనంబర్ 96లో మొత్తం (జక్కని చెరువు) విస్తీర్ణం 46 ఎకరాలకుపైగా ఉన్నది. ఈ సర్వేనంబర్‌లోని 20 ఎకరాల శిఖం భూమిని కేటాయిస్తూ ఆనాడు కలెక్టర్ ఉత్తర్వులు ఇచ్చారు. ఆ ఆదేశాల ప్రకారం ఈ స్థలం హద్దులు చూపి, తమకు స్వాధీనం చేయాలని రిటైర్డ్ ఉద్యోగులు కోరుతున్నారు. ఇప్పటి వరకు అధికారులకు కొన్ని వందల దరఖాస్తులు ఇచ్చారు. చివరకు సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేస్తే, అందుకు సంబంధించి ఫైలు తమ కార్యాలయంలో లేదని కరీంనగర్ రూరల్ రెవెన్యూ అధికారులు సమాధానం ఇచ్చారు.
ఇదిలా ఉంటే.. ప్రస్తుతం ఈ స్థలం మొత్తం కబ్జాలకు గురైంది. టీఎన్జీవోలకు కేటాయించిన 20 ఎకరాలే కాదు, దాదాపు జక్కనికుంటకు చెందిన 70 శాతం భూమి కబ్జాల పాలైంది. ఈ ప్రాంతంలోని వివిధ సర్వేనంబర్లకు బై నంబర్లు జోడిస్తూ, ఈ భూమిని కబ్జాలపాలు చేశారు. అందులో చిన్న స్థాయి నుంచి బడా స్థాయి నాయకుల వరకు హస్తం ఉన్నట్టు విమర్శలు వస్తున్నాయి. ఇంత జరుగుతున్నా అధికారయంత్రాగం ‘జీ హుజూర్’ అంటున్నది. నిజానికి భూభారతి సైట్లో చూస్తే, ఈ సర్వేనంబర్ ప్రొహిబిటెడ్ జాబితాలో ఉన్నది. కానీ, రిజిస్ట్రేషన్లు మాత్రం యథేచ్ఛగా సాగుతున్నాయి. ఇప్పుడు ఇండ్ల పట్టాల కింద బైనంబర్లు వేస్తూ, రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. ఈ సర్వేనంబర్‌లో ఇప్పటివరకు కబ్జాల పాలైన భూమి విలువ దాదాపు 20 కోట్లకుపైగా ఉన్నట్టు తెలుస్తున్నది.
మేల్కోవాల్సింది అధికారులే?
కరీంనగర్ జిల్లాకేంద్రానికి కూత వేటు దూరంలో ఉన్న సర్వేనంబర్ 96 స్థలం కబ్జాలకు గురైనా సంబంధిత అధికారయంత్రాగం కన్నెత్తి చూసిన పాపాన పోలేదన్న విమర్శలు వస్తున్నాయి. ఆక్రమణదారులు, రియలేస్టేట్దారులు తమ దందాను నడిపేందుకు పలువురు అధికారులకు పెద్ద మొత్తంలో డబ్బులు ఇస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఫలితంగానే అధికారులు ‘జీ హుజూర్’ అంటున్నారనే ఆరోపణలున్నాయి. నిజానికి ఈ వ్యవహారంలో కొంతమంది అమాయకులు బలవుతున్నారు.
సర్వేనంబర్లు మార్చి రిజిస్ట్రేషన్లు చేయడంతో అసలు వ్యవహారం తెలియక, లక్షలకు లక్షలు పెట్టి సదరు భూములను కొని మోసపోతున్నారు. దీనిని ఆక్రమణదారులు, అక్రమార్కులు, వ్యాపారులు సొమ్ము చేసుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో అధికారయంత్రాంగం తేరుకోవాల్సిన అవసరమున్నది. ముందుగా సదరు భూమిని ఆనాటి టీఎన్జీవోలకు కేటాయిస్తూ ఇచ్చిన ప్రొసీడింగ్స్, అలాగే అందుకు సంబంధించిన ఫైలు కార్యాలయంలో లేకపోవడానికి కారణాలు ఏమిటీ? మలివయసులో పోరాటం చేస్తున్న రిటైర్డు ఉద్యోగులకు స్పష్టత ఇవ్వకుండా తిప్పించుకోవడంలో ఆంతర్యం ఏమిటీ? అన్న అంశాలను ముందు తేల్చాల్సిన అవసరమున్నది.
ఇదిలా ఉంటే భూభారతిలో ప్రొహిబిటెడ్ జాబితాలో ఉన్న సర్వేనంబర్ 96లో జరిగిన రిజిస్ట్రేషన్లు ఎన్ని? ఈ సర్వే నంబర్లో ఎంత స్థలం కబ్జాకు గురైంది? దానికి సూత్రధారులు, పాత్రదారులు ఎవరు? అన్న విషయంలో ముందుగా అధికారులు చర్యలు చేపట్టాలి. అంతేకాదు, ఈ సర్వేనంబర్‌కు సంబంధించి ముందుగా డిజిటల్ సర్వే చేయించి, అసలు ఎంత భూమి కబ్జాకు గురైందన్న వివరాలను అధికారులు ముందుగా బహిర్గతం చేయాల్సిన అవసరమున్నది. తద్వారా భవిష్యత్‌లోనైనా ఆ పరిధిలో భూములు కొనుగోలు చేసేవారు జాగ్రత్త పడుతారు. అంతేకాదు, డిజిటల్ సర్వే ఆధారంగా హద్దులను పెడితే ప్రభుత్వ స్థలాన్ని రక్షించడానికి చర్యలు చేపట్టినట్టు అవుతుంది.
ఇంత విలువైన భూమి కబ్జాల పాలవుతున్న నేపథ్యంలో అధికారయంత్రాగం ఇప్పటికైనా స్పందిస్తుందా..? లేక ఆక్రమణదారులకు, అక్రమవ్యాపారులకు సహకరిస్తుందా..? చూడాలన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉంటే రిటైర్డ్ టీఎన్జీవోలకు ఈ స్థలానికి బదులుగా తిమ్మాపూర్ మండలంలో మరో స్థలం కేటాయించినట్టు చెబుతున్నా, అందులోనూ మాయ చేస్తూ ముప్పు తిప్పలు పెడుతున్నారు. అంతేకాదు, ఈవిషయంలో స్వయంగా ఓ మంత్రికే రాత పూర్వకంగా తప్పుడు సమాచారం ఇచ్చిన వివరాలను రేపటి కథనంలో చూద్దాం.
..పై ఫొటోలో కనిపిస్తున్న వారంతా రిటైర్డ్ ఉద్యోగులు. 1981లో ఆనాటి కలెక్టర్ నివేశన స్థలాల కోసం కేటాయించిన 20 ఎకరాల స్థలం కోసం దాదాపు 44 ఏళ్లుగా పోరాటం చేస్తూనే ఉన్నారు. కాలం గడుస్తుందే తప్ప వారికి న్యాయం జరగడం లేదు. కనిపించిన ప్రతి అధికారికి, ప్రజాప్రతినిధులకు వినతి పత్రాలు ఇస్తూ కాళ్లా వేళ్లా పడుతూనే ఉన్నారు. అయినా వినతిపత్రాలు, విన్నపాలు బుట్టదాఖలు అవుతూనే ఉన్నాయి కానీ, కేటాయించిన భూమిని వారికి నేటికి చూపలేదు. మరోవైపు అక్రమార్కులు ఈ భూమిని కబ్జా చేస్తూనే ఉన్నారు. బైనంబర్లు వేసి, ఎంచక్కా రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు.
ఆక్రమణదారుల పాలైన ఈ భూమి విలువ దాదాపు 20కోట్ల పైనే ఉంటుంది. ఇంత జరుగుతున్నా అధికారులు నేటికీ స్పష్టత ఇవ్వడం లేదు. అసలు కలెక్టర్ కేటాయించినట్టు ఇచ్చిన ఉత్వర్వుల ఫైలు కనిపించడం లేదంటూ కాలం వెల్లదీస్తున్నారే తప్ప మోఖాపైకి వెళ్లి సర్కారు భూమిని రక్షించే ప్రయత్నం చేయడం లేదు. ఇంతకు ఆ భూమి కేటాయింపులేమిటీ? మలిసంధ్యలో రిటైర్డు ఉద్యోగులు ఎందుకు పోరాటం చేస్తున్నారు? అధికారులు ఎందుకు దాటవేస్తున్నారు? ఇంతకు ఆ స్థలం ఉన్నదా.. కబ్జాల పాలైందా..? అన్న వివరాలు తెలియాలంటే లోతుగా వెళ్లాల్సిందే.