రిటైర్మెంట్ తర్వాత ప్రశాంతంగా ఇంట్లో కూర్చోవాల్సిన విశ్రాంత ఉద్యోగులు రణానికి దిగుతున్నారు. మూడు దశాబ్దాలపాటు ప్రభుత్వ ఉద్యోగిగా ప్రజలకు సేవలందించి విరమణ పొందాక బెనిఫిట్స్ ఇవ్వకుండా కాళ్లరిగేలా తిప్పించుకుంటున్న కాంగ్రెస్ సర్కారుపై పోరుబాట పడుతున్నారు. నెలో.. రెండు నెలలో కాదు ఏడాదిన్నరగా జీపీఎఫ్, జీఐఎస్, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్, కమ్యూటేషన్, గ్రాట్యూటీ వంటి ప్రయోజనాలు అందించకపోవడంతో విసిగి వేసారి పోయారు. మంగళవారం ఉమ్మడి జిల్లా నుంచి సుమారు 80 మంది కరీంనగర్‌కు తరలివచ్చి, కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు దిగుతున్నారు. పెన్షన్ మినహా ఏ బెనిఫిట్ అందక అరిగోసపడుతున్నామని, బకాయిలు వచ్చేదాకా పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేస్తున్నారు.
కరీంనగర్, అక్టోబర్ 6(నమస్తే తెలంగాణ): మూడు దశాబ్దాలకుపైగా వివిధ ప్రభుత్వ శాఖల్లో సేవలందించిన ఉద్యోగులు ప్రభుత్వ వైఖరికి నిరసనగా పోరుబాట పడుతున్నారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏడాదిన్నరగా పెండింగ్‌లో ఉండడంతో ఆందోళనకు సిద్ధమయ్యారు. రిటైర్మెంట్ అయిన వెంటనే ఇవ్వాల్సిన బెనిఫిట్స్ 2024 మార్చి నుంచి ఇప్పటి వరకు రాలేదని, తమకు ఒక్క పెన్షన్ మినహా ఎలాంటి ప్రయోజనాలు ఇవ్వలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ముఖ్యంగా ఉద్యోగులు దాచుకున్న జీపీఎఫ్‌పై 8.25 శాతం వడ్డీ కలిపి చెల్లించాల్సి ఉంటుంది. రిటైర్మెంట్ పొందిన తర్వాత జీపీఎఫ్ ఖాతాలు క్లోజ్ చేసి ఈ కుభేర్ యాప్‌కు పంపించారు. ఏడాదిన్నర కాలంగా చాలా మంది విశ్రాంత ఉద్యోగుల పరిస్థితి ఇలాగే ఉంది. అప్పటి నుంచి వాటికి కనీసం వడ్డీ కూడా ఇవ్వడం లేదు. సర్వీసులో ఉండగా, జరగరానిది ఏదైనా జరిగితే ఉద్యోగుల ప్రయోజనం ఉంటుందనే ఉద్దేశంతో జీఐఎస్ ఇన్స్యూరెన్స్ చేయిస్తారు.
అందులో ప్రభుత్వ ఇన్సెంటివ్స్ పోను ఉద్యోగి పేరిట జమైన నిధులకు వడ్డీ కట్టి చెల్లించాల్సి ఉంటుంది. 58 ఏండ్లకు ముగిసే లైఫ్ ఇన్స్యూరెన్స్ (టీఎస్జీఎల్ఐ) బెనిఫిట్స్ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో మూడేళ్ల సర్వీసు పెంచినందున ఈ కాలానికి వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది. దీంతో పాటు ఏడాదిలో ఉద్యోగులు దాచుకునే ఈఎల్స్ (సెలవులు) ఏడాది 6 చొప్పున ప్రభుత్వానికి సరెండర్ చేస్తే వీటిపైనా బెనిఫిట్స్ రావాల్సి ఉంటుంది.
40 శాతం పెన్షన్‌పై కమ్యూటేషన్ ప్రయోజనాలు కూడా కల్పించడం లేదు. తీనికితోడు 5 డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి. గతంలో పెండింగ్‌లో ఉన్న పీఆర్సీని రిటైర్మెంట్ బెనిఫిట్‌గా ఇస్తామని చెప్పిన ప్రభుత్వం, ఈ ప్రయోజనం కూడా కల్పించడం లేదు. ఈ నేపథ్యంలోనే విశ్రాంత ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు.
అందని ప్రయోజనాలు
ప్రభుత్వ ఉద్యోగులు రిటైర్మెంట్ అయిన రోజే అన్ని ప్రయోజనాలు కల్పించి ప్రభుత్వ వాహనంలో ఇంటి వద్ద దింపి రావడం బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చూశాం. జీపీఎఫ్ నుంచి వచ్చే బెనిఫిట్ చెక్కులు కూడా రిటైర్మెంట్ రోజే ఉద్యోగుల చేతిలో పెట్టేది. కానీ, ఇపుడు అందుకు భిన్నంగా జరుగుతున్నదని విశ్రాంత ఉద్యోగులు వాపోతున్నారు. ఏడాదిన్నరగా రిటైర్మెంట్ తీసుకుంటున్న ఉద్యోగులకు పెన్షన్ మినహా ఎలాంటి ప్రయోజనాలు రావడం లేదు.
విరమణ తర్వాత వచ్చే డబ్బులతో అప్పులు చెల్లించుకోవడం, ఈఎంఐలు కట్టుకోవడం, పిల్లల పెండ్లిళ్లు చేసుకోవడం, ఇండ్లు కట్టుకోవడం వంటి ప్రణాళికలు ప్రతి ప్రభుత్వ ఉద్యోగి చేసుకుంటారు. కానీ, ప్రస్తుత పరిస్థితుల్లో ఎలాంటి ప్రయోజనాలు అందకపోవడంతో వారి జీవితాలు గాడి తప్పినట్టయింది. పిల్లలకు పెండ్లిళ్లు చేయలేక, అప్పులు చెల్లించుకోలేక, ఇండ్లు కట్టుకోలేక పోతున్నామని వాపోతున్నారు. ఇప్పటికే ఇండ్లు కట్టుకున్న ప్రభుత్వ ఉద్యోగులు బ్యాంకుల్లో తెచ్చుకున్న అప్పులకు వచ్చే పెన్షన్‌తో ఈఎంఐలు కట్టుకునే పరిస్థితి లేదు.
కోర్టుకు వెళ్లినా ప్రయోజనమేదీ?
తమకు రావాల్సిన రిటైర్మెంట్ బకాయిలు చెల్లించాలని 600 మందికిపైగా ఉద్యోగులు కోర్టును ఆశ్రయించారు. 8 వారాల తర్వాత బకాయిలు చెల్లించాలని కోర్టు ఆదేశించినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. దీంతో కొందరు ఉద్యోగులు తిరిగి కోర్టుకు వెళ్లి కంట్మెంట్ కూడా వేశారు. ప్రతి నెలా 700 కోట్లు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ఒక్కసారి మాత్రమే విడుదల చేసింది. జీపీఎఫ్ లోన్స్ పెట్టుకున్న, మెడికల్ రీయింబర్స్మెంట్ పెట్టుకున్న వర్కింగ్ ఉద్యోగులకే ఇవి సరిపోలేదని విశ్రాంత ఉద్యోగులు చెబుతున్నారు. తమలో కొంత మందికి వచ్చినా పూర్తి స్థాయిలో రాలేదని అంటున్నారు.
ఈ నేపథ్యంలో విశ్రాంత ఉద్యోగులు ప్రభుత్వానికి అనేక సార్లు విజ్ఞప్తులు చేసినా ఇస్తామని చెప్పడమేగానీ ఇంత వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు కూడా విశ్రాంత ఉద్యోగుల పక్షాన ప్రభుత్వంతో చర్చలు జరిపాయి. అయినా ప్రయోజనం లేకపోవడంతో రోడ్డెక్కే పరిస్థితి వచ్చింది.
నేడు కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట ధర్నా
ఏడాదిన్నరగా ప్రభుత్వంపై పెట్టుకున్న నమ్మకం క్రమంగా సన్నగిల్లడంతో విశ్రాంత ఉద్యోగులు సంఘటితమయ్యారు. అన్ని శాఖల్లో పనిచేసి విశ్రాంతి తీసుకున్న ఉద్యోగులు ఒకే గొడుగు కిందికి వచ్చారు. రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ (రేవా) పేరిట రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కటయ్యారు. ఇప్పటికే వరంగల్, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాల్లో ఆందోళనలు చేసిన విశ్రాంత ఉద్యోగులు, తాజాగా మంగళవారం కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు సిద్ధమయ్యారు. కాగా, రిటైర్ ఉద్యోగులను రోడ్డుకీడ్చిన రాష్ట్ర ప్రభుత్వ వైఖరిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వారి అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఎప్పటికప్పుడు వారికి చెందాల్సిన బెనిఫిట్స్‌ను అందించి గౌరవించాల్సిందిపోయి, ఈ విధంగా ఇబ్బందులు పెట్టడాన్ని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి.
బకాయిలు చెల్లించేదాకా ఆందోళనలు
మాకు రావాల్సిన బకాయిలు చెల్లించేదాకా రాష్ట్ర ప్రభుత్వంతో పోరాడుతాం. జీపీఎఫ్, జీఐఎస్, లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్, కమ్యూటేషన్ బెనిఫిట్స్ ఏడాదిన్నర కాలంగా పెండింగ్‌లో ఉన్నాయి. గతంలో ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ లేదు. ఏ ప్రభుత్వం ఉన్నా నెలా రెన్నెళ్లలో విశ్రాంత ఉద్యోగుల బెనిఫిట్స్ సెటిల్ చేసేది. ఈ ప్రభుత్వం మాత్రం విశ్రాంత ఉద్యోగులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నది. ప్రభుత్వానికి ఎన్నిసార్లు విన్నవించినా, చివరికి కోర్టుకు వెళ్లినా పెడచెవిన పెడుతున్నది. ఈ నేపథ్యంలోనే ఆందోళన బాట పట్టడం అనివార్యమైంది. మంగళవారం కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట చేపట్టే ఆందోళనకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా విశ్రాంత ఉద్యోగులు తరలివస్తున్నారు. ఇప్పటికైనా మా బకాయిలు చెల్లించకుంటే ఆందోళనలు మరింత ఉధృతం చేస్తాం.
– కోహెడ చంద్రమౌళి, రేవా ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు
మాపై నిర్లక్ష్యవైఖరి వీడాలి
విశ్రాంత ఉద్యోగులపై ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని వీడాలి. రేవంత్ రెడ్డి మాకేదో చేస్తాడని గెలిపించుకుంటే ఆయన మాపైన చూపిస్తున్న వైఖరి మనోవేదనకు గురి చేస్తున్నది. ఇకనైనా ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో కేవలం విశ్రాంత ఉద్యోగులకు మాత్రమే నెలకు ఎన్ని కోట్లు విడుదల చేస్తారో స్పష్టంగా చెప్పాలి. ప్రతి నెలా 500 నుంచి వెయ్యి మందికి పూర్తి బకాయిలు చెల్లించాలి. అపుడే మిగతా వారికి ఒక స్పష్టమైన నమ్మకం భరోసా కలుగుతుంది. ఇందుకు టోకెన్ వారిగాకానీ, రిటైర్మెంట్ నెలను బట్టిగాని బకాయిలు చెల్లించేందుకు ప్రణాళిక చేసుకోవాలి. ఉద్యోగులందరికి బెనిఫిట్స్ వచ్చేలా చూడాలి. లేదంటే పోరుబాట పడతాం.
– గద్దె జగదీశ్వరా చారి, రిటైర్డ్ ఎంపీడీఓ, రేవా ఉమ్మడి జిల్లా ఉపాధ్యక్షుడు
మనోవేదనకు గురవుతున్నాం
ఉద్యోగ విరమణ చెందిన తమకు ఏడాదిన్నరగా ఎలాంటి బెనిఫిట్స్ అందక పోవడంతో తీవ్ర మనోవేదనకు గురవుతున్నాం. ఉద్యోగులు, ఉపాధ్యాయులకు బకాయిలు అందక పోవడంతో ఎలాంటి ప్రణాళికలు చేసుకోలేక పోతున్నాం. పైగా అనారోగ్యాల పాలవుతున్నాం. బెనిఫిట్స్ అందడం లేదని గుండె పోటుతో మరణించిన వారు కూడా ఉన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పెన్షనర్లు చనిపోకముందే వారి బకాయిలు చెల్లించాలి. లేదంటే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయకతప్పదు.
– సుంకిశాల ప్రభాకర్ రావు, రేవా ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి
ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి
విశ్రాంత ఉద్యోగుల కోసం ప్రతి నెలా రూ.700 కోట్లు చెల్లిస్తామని చెప్పిన ప్రభుత్వం తన మాటను నిలబెట్టుకోవాలి. ఆ విధంగా విడుదల చేస్తే ఇప్పటికే సగం మంది బకాయిలు చెల్లించే అవకాశం ఉండేది. రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందక విశ్రాంత ఉద్యోగులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. అప్పులు చెల్లించ లేక, పిల్లల పెండ్లిళ్లు చేయలేక పోతున్నారు. ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరిని వీడి బకాయిలు చెల్లించాలి. లేదంటే తమ ఊరుకోం. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలుపుతాం. హైదరాబాద్‌లో ఆందోళన చేయాల్సి వస్తుంది.
– కనపర్తి దివాకర్, రేవా ఉమ్మడి జిల్లా కోశాధికారి