కరీంనగర్ కలెక్టరేట్, అక్టోబర్ 31 : ఉద్యోగ విరమణపొంది పందొమ్మిది నెలలు గడుస్తున్నా తమకు రావాల్సిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇంకెప్పుడిస్తారని రాష్ట్ర ప్రభుత్వాన్ని విశ్రాంత ఉద్యోగులు ప్రశ్నించారు. బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు రిటైర్డ్ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ కరీంనగర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం నగరంలోని తెలంగాణచౌక్లో మౌన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా సంఘం జిల్లా అధ్యక్షుడు కోహెడ చంద్రమౌళి మాట్లాడుతూ ఉద్యోగ విరమణ పొంది 19 నెలలు గడుస్తున్నా బకాయిలు చెల్లించడం లేదని వాపోయారు.
దీంతో అనేక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వానికి అనేక సార్లు విన్నవించినా పెడచెవిన పెడుతుండడంతో ఇందిరాగాంధీ వర్ధంతిని పురస్కరించుకుని మౌనదీక్ష చేపట్టినట్లు వెల్లడించారు. ఇప్పటికైనా స్పందించకపోతే దీర్ఘకాలిక ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ దీక్షలో ఉపాధ్యక్షులు గద్దె జగదీశ్వరాచారి, కత్తురోజు ప్రభాకర్, కోశాధికారి కనపర్తి దివాకర్, జిల్లా కమిటీ సభ్యులు బూరుగుపల్లి రవీందర్, పోలోజు రవీందర్, వంగ సుధాకర్, కేకే వెంకటరాములు, గోగుల రామన్న పాల్గొన్నారు.