మంథని : తెలంగాణకు సిరులు కురిపించిన కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన కన్నెపల్లి పంపుహౌజ్ ( Kannepalli pump house ) ను ఆదివారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ( KTR ) సందర్శన కార్యక్రమానికి బీఆర్ఎస్ నాయకులు(BRS Leaders ) వెళ్లకుండా పోలీసులు అడుగడుగునా నిర్భందాలు, ముందస్తు అరెస్టులు ( Arrest ) చేశారు. ఆదివారం తెల్లవారుజాము నుంచే డివిజన్లోని మంథని, ముత్తారం, రామగిరి, కమాన్‌పూర్ మండలాల్లో ఉన్న బీఆర్ఎస్ నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేసి పోలీస్స్టేషన్లకు తరలించారు.

మంథని నియోజకవర్గంలోని కన్నెపల్లి పంపుహౌజ్‌లో ఉన్న నీటిని విడుదల చేస్తే తెలంగాణలోని లక్షలాది ఎకరాలకు సాగునీరు అందించే అవకాశమున్న కాని కాంగ్రెస్ ప్రభుత్వం నీటిని వృధా చేస్తుందని మండల నాయకులు ఆరోపించారు. పెద్దపల్లి-కాటారం ప్రధాన రహదారి వెంట పలు చోట్ల భారీగా పోలీస్ పికెటింగ్‌లు ఏర్పాటు చేసి ప్రతీ వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు.
ఎవరైనా బీఆర్ఎస్ నాయకులు తనిఖీల్లో కన్పిస్తే వారిని వెంటనే నిర్భందించి పోలీస్ స్టేషన్లకు తరలించారు. రైతులకు సాగునీరు అందించడానికి కన్నెపల్లి పంపుహౌజ్ సందర్శనకు వెళ్తుంటే పోలీసులు నిర్భందించడం, అరెస్టులు చేయడం సరికాదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.