మెట్పల్లి/మెట్పల్లి రూరల్, ఆగస్టు 13 : పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో ఇద్దరు విద్యార్థులను కోల్పోవడం తమ ప్రభుత్వాన్ని తీవ్రంగా కలచివేసిందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఆవేదన చెందారు. ఇలాంటి ఘటనలు జరగకుండా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గురుకుల పాఠశాలలను ప్రక్షాళన చేయబోతున్నామని ప్రకటించారు. గురుకుల విద్యాలయాల అభివృద్ధి కోసం ప్రభుత్వం బడ్జెట్లో 5 వేల కోట్లను కేటాయించిందని, రాబోయే రోజుల్లో అద్భుతంగా తీర్చిదిద్దుతామని చెప్పారు.
మంగళవారం మెట్పల్లి మండలం పెద్దాపూర్ గురుకులాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి ఆయన పరిశీలించారు. గణాధిత్య, అనిరుధ్ తల్లిదండ్రులను ఓదార్చి, విద్యార్థుల మృతికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. తల్లిదండ్రులకు మనోధైర్యం కల్పించాలని ఆకాంక్షించారు. అనంతరం విద్యార్థులు, తల్లిదండ్రులతో సమావేశమై విద్యార్థుల మృతికి కారణాలు, నెలకొన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. తర్వాత పిల్లలతో కలిసి భోజనం చేసి, పాఠశాల ఆవరణలో కలియతిరిగి, విలేకరులతో మాట్లాడారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని ఆలోచన చేస్తుందన్నారు. మృతుల కుటుంబ సభ్యుల్లో ఒకరికి విద్యార్హతను బట్టి ఔట్సోర్సింగ్ ద్వారా ఉద్యోగం ఇస్తామని ప్రకటించారు. ఇల్లు లేని వారికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని కలెక్టర్‌ను ఆదేశించినట్టు తెలిపారు.
భవనంలో అసంపూర్తిగా ఉన్న పనుల పూర్తికి అవసరమైన నిధులు విడుదల చేస్తామన్నారు. ప్రతి గురుకులంలో పారా మెడికల్ స్టాఫ్‌ను నియమిస్తామన్నారు. పాము కాటు విరుగుడు మందులను అందుబాటులో ఉంచాలని సంబంధిత విభాగం కార్యదర్శిని ఆదేశించానని తెలిపారు. విద్యార్థులకు రుచికరమైన, నాణ్యమైన భోజనం అందించేందుకు డైట్ చార్జీలను పెంచుతామని చెప్పారు. గురుకులాల్లో పనిచేసే వార్డెన్లు, బోధకులు, పారా మెడికల్ సిబ్బంది స్థానికంగా ఉండాలని ఆదేశించారు.
అన్ని గురుకులాల్లో మంత్రి, ఎమ్మెల్యే, కలెక్టర్, జిల్లా వైద్యారోగ్య అధికారి ప్రతి నెలలో ఒకరోజు విధిగా తమ పరిధిలోని ఏదో ఒక వసతి గృహాన్ని సందర్శించి విద్యార్థులతో కలిసి భోజనం చేయాలని, అక్కడే బస చేయాలని మంత్రి మండలిలో నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. సమావేశంలో ప్రభుత్వ విప్‌లు ఆది శ్రీనివాస్, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, కోరుట్ల, చొప్పదండి, మానకొండూర్ ఎమ్మెల్యేలు డాక్టర్ కల్వకుంట్ల సంజయ్, మేడిపల్లి సత్యం, కవ్వంపల్లి సత్యనారాయణ, కలెక్టర్ సత్యప్రసాద్, గురుకులాల రాష్ట్ర కమిషనర్ కృష్ణభాస్కర్, కార్యదర్శి రమణాకుమార్ తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రంలోని 35 గురుకులాల్లో పెద్దాపూర్ గురుకులానికి ప్రత్యేకత ఉందని, ఇక్కడ చదివి ఎంతో మంది వివిధ రంగాల్లో ఉన్నత స్థానాలకు చేరారని, అలాంటి చోట దురదృష్టకరమైన ఘటనలు జరగడం బాధాకరమని రాష్ట్ర బీసీ సంక్షేమ, రవాణా శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. గురుకులాల అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతుందన్నారు.