చిగురుమామిడి, ఫిబ్రవరి 18: కరీంనర్ జిల్లా చిగురుమామిడి మండలంలోని రైతుల పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్న మండల వ్యవసాయ అధికారి మల్లేశంపై చర్యలు తీసుకోవాలని బిజెపి మండల శాఖ అధ్యక్షుడు పోలోజు సంతోష్ ఆధ్వర్యంలో తాసిల్దార్ రమేష్ కు వినతిపత్రం అందజేశారు. నవాబుపేట గ్రామానికి చెందిన పిల్లి తిరుపతి రైతు ఆన్లైన్లో యూరియా బస్తాలు బుక్ చేసుకున్నా.. యూరియా బస్తాలు తనకు రాకుండా వేరే వాళ్లకు ఇచ్చారని ఏవోకు ఫోన్ చేశాడు.
దీంతో ఏవో మల్లేశం ఇష్టానుసారంగా మాట్లాడి రైతు తిరుపతిని బెదిరించాడని ఆరోపించారు. రైతులకు అవగాహన కల్పించి వారి సమస్యలను తెలుసుకొని పరిష్కరించాల్సిన వ్యవసాయ అధికారి రైతులను బెదిరించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. వెంటనే ఏవో పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు వినతిపత్రంలో పేర్కొన్నారు.
వినతి పత్రం అందజేసిన వారిలో రైతులు పిల్లి తిరుపతి, మహేందర్, శ్రీనివాస్ రెడ్డి, సంతోష్,శ్రీనివాస్,రాజేందర్, అనిల్ తదితరులున్నారు. కాగా, ఫిర్యాదు పై ఏవో మల్లేశంను వివరణ కోరగా రైతు పట్ల ఎలాంటి దుర్భాషలాడలేదని, రైతు సమస్యను పరిష్కరించే దిశగానే అతనితో సానుకూలంగా మాట్లాడాలని పేర్కొన్నారు. రైతుల సమస్యలను పరిష్కరించేందుకే వ్యవసాయ అధికారులు, సిబ్బంది ఉన్నారన్నారు.