Labor Cards | ఓదెల, మార్చి 13 : లేబర్ పోర్టర్ లో ఉన్న లోపాలను సరిచేసి అర్హులైన కార్మికులందరికీ లేబర్ కార్డులు అందే విధంగా చూడాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామికి ఓదెల మండలానికి చెందిన అల్లం సతీష్ శుక్రవారం వినతి పత్రాన్ని అందజేశారు. మంత్రి వివేక్ వెంకటస్వామిని హైదరాబాద్లోని మినిస్టర్ క్వార్టర్స్ లో కలిసి వినతి పత్రాన్ని అందజేసినట్లు సతీష్ తెలిపారు. ఈ సందర్భంగా సతీష్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేద కార్మికుల సంక్షేమం కోసం ప్రవేశపెట్టిన లేబర్ కార్డు పథకం అమలులో వెబ్ పోర్టల్ లోపాల కారణంగా కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు తెలియజేశామన్నారు.
చాలా మంది కార్మికులు ఆన్లైన్ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకున్నప్పటికీ మొదట రిజిస్ట్రేషన్ చూపించినా, కొంతకాలం తర్వాత వారి వివరాలు డేటాబేస్లో కనిపించడం లేదని పేర్కొన్నారు. దీంతో కార్మికులు మళ్లీ మళ్లీ దరఖాస్తులు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రక్రియలో దళారులు డబ్బులు వసూలు చేస్తున్నారని, కొందరు అధికారులు కూడా కమిషన్లతో వ్యవహరిస్తున్నారని ఆరోపించారు.
ఫొటోగ్రఫీ వృత్తిలో ఉన్నవారు, ఎల్ఈడి స్క్రీన్ ఆపరేటర్లు, లైటింగ్ విభాగం కార్మికులు సహా అనేక మంది సినీ ఇతర రంగాల కార్మికులకు ఇప్పటికీ లేబర్ కార్డులు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తక్షణమే లేబర్ పోర్టల్లో సాంకేతిక లోపాలను సరిచేసి డేటా భద్రత కల్పించడంతో పాటు అర్హులైన వారందరికీ ఉచితంగా లేబర్ కార్డులు అందించాలని సతీష్ మంత్రికి వివరించారు.