Dumping yard | హుజురాబాద్ టౌన్, జూన్ 23: హుజురాబాద్ మండలం సిర్సపల్లి శివారులో డంపింగ్ యార్డ్, విద్యుత్ ఉత్పత్తి కర్మాగార ఏర్పాటును తక్షణమే విరమించుకోవాలని కరీంనగర్లో జరిగిన ప్రజావాణిలో బీఆర్ఎస్, బీజేపీ నాయకులు, గ్రామస్తులు కలిసి సోమవారం కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. ఈ ప్రాజెక్టు వల్ల సిర్సపల్లితో పాటు చుట్టుపక్కల పది గ్రామాల ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందని, శ్వాసకోశ సంబంధిత వ్యాధులతో పాటు అనేక రకాల అనారోగ్య సమస్యలకు లోనయ్యే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
అలాగే, ఈ ప్రాంత రైతులు వ్యవసాయ భూములు నష్టపోయే అవకాశం ఉందని, భూసారం తగ్గి పంటల దిగుబడి తగ్గిపోతుందని తెలిపారు. ప్రాజెక్టును తక్షణమే ఆపివేయాలని డిమాండ్ చేశారు. కలెక్టర్ ఈ అంశంపై సానుకూలంగా స్పందించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్, హుజురాబాద్ పీఏసీఎస్ చైర్మన్ ఎడవెల్లి కొండారెడ్డి, హుజురాబాద్ మండల వైస్ ఎంపీపీ బండి రమేష్, బీజేపీ రాష్ట్ర నాయకులు సింగిరాల రామరాజు, పోతిరెడ్డిపేట బీఆర్ఎస్ గ్రామ శాఖ అధ్యక్షుడు చెన్నోజు రమేష్, బీఆర్ఎస్ గ్రామ శాఖ ప్రధాన కార్యదర్శి ఎడ్ల బిక్షపతి, గ్రామస్తులు పాల్గొన్నారు.