Rechapalli | సారంగాపూర్, ఫిబ్రవరి 6 : సారంగాపూర్ మండలంలోని అతిపెద్ద గ్రామమైన ఉమ్మడి రేచపల్లి గ్రామంలో అగ్రికల్చర్ క్లస్టర్ ఏర్పాటు చేయాలని కోరుతూ శుక్రవారం గ్రామ సర్పంచ్ బాస మహేష్ జిల్లా వ్యవసాయ శాఖ కార్యలయంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ సారంగాపూర్ మండలంలోని రేచపల్లి ఉమ్మడి గ్రామంలో రేచపల్లి, లచ్చనాయక్ తండా, భీంరెడ్డి గూడెం, లచ్చనాయక్ తండాలుగా నాలుగు గ్రామాలు ఏర్పాటయ్యాయని వీటిలో 10వేల మందికి పైగా జనాభా ఉందని, 5వేల ఎకరాలకు మించి వ్యవసాయ సాగుభూములు ఉన్నాయని తెలిపారు.
గ్రామంలో కనీస వ్యవసాయ మౌళిక సదుపాయాలు లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని రైతులకు అవసరమైన యంత్రాలు, పనిముట్ల, ఎరువులు, శిక్షణ, వ్యవసాయ సంబంధిత పరికరాలు అందుబాటులో ఉండేలా గ్రామంలో అగ్రికల్చర్ క్లస్టర్ ఏర్పాటు చేయాలని కోరినట్లు పేర్కొన్నారు. రైతుల అవసరాలను పరిగణలోకి తీసుకుని గ్రామంలో క్లస్టర్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని జిల్లా అధికారిని కోరారు.