Repair roads | సుల్తానాబాద్ రూరల్, ఆగస్టు 30: వర్షాలకు రోడ్డు దెబ్బతిని కుంగి పోయి, నీళ్ల కోసం వేసిన పైపుకు రంద్రం పడి రోడ్డుపై ఉన్న మట్టి కొట్టుకుపోవడంతో రాకపోకలు నిలిచిపోయాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ప్రజలు, ప్రయాణికులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుందని పలువురు మండిపడుతున్నారు.
సంబంధిత అధికారులు స్పందించి రోడ్డు మరుమతులు చేయించాలని కోరుతున్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని రేగడి మద్దికుంట గ్రామ పంచాయతీ పరిధిలోని దుబ్బ పల్లి శివారులోని ఆర్ఎంబీ రోడ్డు నిర్మాణంలో భాగంగా 15 ఏళ్ల క్రితం చెరువుల నీళ్లు పోవడానికి పైపులు వేశారు. గత పది రోజుల క్రితం రోడ్డు కుంగి పైపులు పగిలి మట్టి కొట్టుకుపోయి రాకపోకలు నిలిచిపోయాయి. రేగడి మద్దికుంట నుంచి దుబ్బ పల్లి మీదుగా ఓదెల మండలం లోని ఉప్పరపల్లి నుంచి పెద్దపల్లి వరకు ఈ రోడ్డు ఉంటుంది.
ఆర్టీసీ బస్సు తోపాటు విద్యార్థుల కోసం ప్రైవేటు స్కూల్ బస్సులు కూడా వస్తూ ఉంటాయని, రోడ్డు దెబ్బ తినడంతో రాకపోకలు బంద్ అయ్యాయి. దీంతో విద్యార్థులతో పాటు ప్రయాణికులు ఆయా గ్రామాల ప్రజల సైతం ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుందని వారు వాపోతున్నారు. సంబంధిత అధికారులు స్పందించి పూర్తి స్థాయిలో మరమ్మతులు చేయించి రాకపోకలు సజావుగా జరిగే విధంగా కృషి చేయాలని కోరుతున్నారు.