JAGITYAL | జగిత్యాల, ఏప్రిల్ 02 : తెలంగాణలో వచ్చే విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియట్ ఆర్ట్స్ విభాగంలో చరిత్ర, కామర్స్, అర్థశాస్త్రం, రాజనీతి శాస్త్రం అనే సబ్జెక్టులను కలిపి హెచ్ సిఈసి అనే నూతన కోర్సును ప్రవేశపెట్టాలని చరిత్ర పరిరక్షణ సమితి డిమాండ్ చేసింది.
ఈ మేరకు బుధవారం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో (బాలురు) స్పాట్ వాల్యుయేషన్ క్యాంపులో జిల్లా ఇంటర్మీడియట్ విద్యాధికారి బీ నారాయణకు ఆ సమితి నాయకులు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పనిచేస్తున్న చరిత్ర జూనియర్ లెక్చరర్లు మాట్లాడుతూ ఇంటర్మీడియట్ ఆర్ట్స్ కోర్సులలో మార్పులు చేయకపోవడం వల్ల జూనియర్ కళాశాలల్లో రోజు రోజుకు అడ్మిషన్లు తగ్గి, మానవీయ శాస్త్రలు కనుమరుగయ్యే స్థితిలో ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆధునిక అవకాశాలకు అనుగుణంగా ఇంటర్మీడియట్ ఆర్ట్స్ విభాగంలో హెచ్ఈసి, సిఈసి కోర్సులను కలిపి హెచ్ సిఈసి కోర్సు ప్రవేశపెట్టినట్లయితే విద్యార్థులు గ్రూప్-1,2,3,4, టీచర్స్, కానిస్టేబుల్స్, వంటి ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు ప్రైవేటు రంగాలలో అనేక ఉద్యోగాలు సాధించేందుకు దోహదపడుతుందన్నారు.
సాంకేతిక కోర్సులకు అధిక ప్రాధాన్యత ఇస్తే విద్యార్థులలో నైతిక విలువలు పతనమై సామాజిక అభివృద్ధి కొరబడుతుందని, ఆర్ట్స్ కోర్సులలో మార్పులు చేసి విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చరిత్ర పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు డా పి తిరుపతి, చరిత్ర జూనియర్ లెక్చరర్లు సుదర్శన్, దేవేందర్, నరేష్, రాంప్రసాద్, రజిత, నిర్మల, శ్రీనివాస్, అరవింద్ తదితరులు పాల్గొన్నారు.