Mla Sanjay | కోరుట్ల, ఏప్రిల్ 21: ఈ నెల 27న వరంగల్లో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు తరలిరావాలని కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కల్వకుంట్ల పిలుపునిచ్చారు. పట్టణంలోని మున్నూరు కాపు యువజన సంఘం, గంగపుత్ర, ముదిరాజ్ సంఘం నాయకులను కలిసి ఎమ్మెల్యే రజతోత్సవ సభ ఆహ్వాన పత్రికను సోమవారం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అంకుటిత దీక్ష ఫలితంగా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామని పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో నిలిపిన ఘనత కెసిఆర్ కు దక్కుతుందన్నారు. స్వరాష్ట్రంలో రైతులకు రైతుబంధు, రైతు బీమా, పంట పెట్టుబడి సాయం అందించిన కెసిఆర్ రైతులను కంటికి రెప్పలా కాపాడుకున్నారని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక పాలన గాడి తప్పిందని, రైతులకు రైతుబంధు సాయం ఊసే లేదన్నారు. మళ్లీ భవిష్యత్తు పాలన మనదేనని రైతులు, బడుగు బలహీన వర్గాల ప్రజలు ఆందోళన చెందవద్దని పేర్కొన్నారు.
తెలంగాణ సాధన కోసం ఉద్భవించిన బీఆర్ ఎస్ పార్టీ 25 సంవత్సరాల వేడుకలను ఘనంగా నిర్వహించుకుంటున్నామని ప్రజలు ఆశీర్వదించాలని పేర్కొన్నారు. ఈ రజతోత్సవంలో పార్టీ అధినేత కేసీఆర్ భవిష్యత్ ప్రణాళికపై దిశానిర్దేశం చేయనున్నారని, ఈ సభకు వేలాదిగా తరలి వచ్చేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు దారిశెట్టి రాజేష్, ఫహీం, మోసిన్, నగేష్ సురేందర్, నవీన్, శ్రీపతి, అమీర్, శ్రీనివాస్, శేఖర్, ఆయా కుల సంఘాల ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.