Kolanur railway station | ఓదెల, జులై 17 : పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని కొలనూర్ రైల్వే స్టేషన్ ఫ్లాట్ ఫామ్ పై గడ్డి, పిచ్చి మొక్కలను, చెత్తను శుక్రవారం కూలీలు తొలగిస్తున్నారు. ఈ నెల 14న ‘నమస్తే తెలంగాణ’ వెబ్ ఎడిషన్లో అధ్వాన్నంగా కొలనూర్ రైల్వే స్టేషన్ ప్లాట్ ఫామ్, అలాగే ఈనెల 17న ‘నమస్తే తెలంగాణ’లో కొలనూరు రైల్వే స్టేషన్ ఫ్లాట్ ఫామ్ పై గడ్డి, పిచ్చి మొక్కలతో అధ్వానంగా ఉన్న స్థితిని ప్రచురితమైంది.
దీంతో స్పందించిన రైల్వే డివిజనల్ బోర్డు మెంబర్ అనుమాస శ్రీనివాస్ (జీన్స్) ఈ విషయమై రైల్వే ఉన్నతాధికారులకు వెబ్, దినపత్రికలో వచ్చిన కథనాన్ని పంపించారు. వెంటనే స్పందించిన రైల్వే ఉన్నతాధికారులు శుక్రవారం కొలనూరు రైల్వే స్టేషన్ కు రామగుండం నుంచి ప్రత్యేక కూలీలను పంపించి ప్లాట్ ఫామ్ పై ఉన్న గడ్డి, పిచ్చి మొక్కలు, చెత్తాచెదారాన్ని తీసివేయిస్తున్నారు. దీంతో ప్లాట్ ఫామ్ శుభ్రంగా కనిపిస్తుంది. ఇందుకు ప్రయాణికులు ‘నమస్తే తెలంగాణ’కు కృతజ్ఞతలు తెలియజేసి హర్షించారు.