తిమ్మాపూర్, డిసెంబర్31 : లోయర్ మానేర్ జలాశయం నుంచి కాకతీయ కాలువ ద్వారా దిగువ ఆయకట్టు సాగుకు కరీంనగర్ కలెక్టర్ పమేలా సత్పత్తి మంగళవారం ఉదయం నీటిని విడుదల చేశారు. అధికారులతో కలిసి పూజలు చేసి స్విచ్ ఆన్ చేశారు. ప్రణాళిక ప్రకారం నీటిని సరఫరా చేయాలని, రైతులకు ఇబ్బంది కాకుండా చూసుకోవాలని అధికారులకు సూచించారు. అనంతరం ఎల్ఎండీ రిజర్వాయర్ ఎస్ఈ రమేశ్ మాట్లాడుతూ, ఎల్ఎండీ నుంచి మార్చి 31 వరకు నిరంతరంగా నీటి విడుదల కొనసాగుతుందని..
మహబూబాబాద్ వరకు జోన్-1గా, అకడి నుంచి సూర్యపేట వరకు జోన్-2గా విభజించి వారబందీ పద్ధతిన నీటిని విడుదల చేస్తున్నామన్నారు. ప్రస్తుతం జోన్-2 పరివాహక ప్రాంతానికి నీటినందిస్తామని ఒకరోజులో సూర్యాపేట వరకు నీళ్లు వెళ్తాయని చెప్పారు. వారం తర్వాత జోన్-1కి విడుదల చేస్తామన్నారు. ప్రస్తుతం ఎల్ఎండీ, మిడ్ మానేరు రిజర్వాయర్లలో తాగు అవసరాలకు పోను, సాగుకు వాడుకునేందుకు 24 టీఎంసీల నీళ్లు అందుబాటులో ఉన్నాయని మరో 5 టీఎంసీలు ఎస్సారెస్పీ నుంచి తీసుకురావాలని చెప్పారు. ఈ యాసంగి సీజన్‌కు కాకతీయ కాలువ ద్వారా 7 లక్షల ఎకరాల సాగుకు ప్రణాళికలు రూపొందించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఈఈ నాగభూషణరావ్, డీఈ శ్రీనివాస్, ఏఏఈలు వంశీధర్, దీపిక సంజన, కిరణ్ పాల్గొన్నారు.