Ramagundam Baldia | కోల్ సిటీ, డిసెంబర్ 12 : రామగుండంలో ఎక్కడ కూడా యాచకులు కనిపించవద్దనీ, ఆ దిశగా సమష్టిగా కృషి చేద్దామని స్థానిక సంస్థల ఆదనపు కలెక్టర్, నగర పాలక సంస్థ కమిషనర్ జే. అరుణ శ్రీ పిలుపునిచ్చారు. స్మైల్ ప్రాజెక్టు నిర్వాహక సంస్థ శ్రీ వినాయక విమెన్ (అర్బన్) త్రిఫ్ట్ క్రెడిట్ కో ఆపరేటివ్ సొసైటీ రూపొందించిన పోస్టర్ శుక్రవారం నగర పాలక కార్యాలయంలో ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ యాచక వృత్తిలో ఉన్న వారిని గుర్తించి పునరావసం కల్పించడమే ఈ ప్రాజెక్టు ఉద్దేశమన్నారు.
రామగుండం నగర పాలక సంస్థ మెప్మా ఆధ్వర్యంలో గోదావరిఖని తిలక్ నగర్ లో స్మైల్ ప్రాజెక్టు పునరావస కేంద్రం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కేంద్రంలో ఉచిత వసతి, మూడు పూటలా భోజన వసతి, ఆసక్తి ఉన్నవారికి వివిధ అంశాలలో శిక్షణ ఇప్పించడంతో పాటు ఉపాధి కూడా కల్పించడానికి రూపకల్పన చేసినట్లు తెలిపారు. వికలాంగులు, అనాధలు. నిరాదరణకు గురైన వారు యాచక వృత్తిలో ఉన్నట్లు గమనిస్తే నేరుగా పునరావాస కేంద్రంలో చేర్పించాలనీ, అలా వీలు కాని పక్షంలో కేంద్ర నిర్వాహకుల ఫోన్ నం.7013584588, 8639717597కు సమాచారం అందించి సహకరించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో నగర పాలక సంస్థ అడిషనల్ కమిషనర్ మారుతి ప్రసాద్, సెక్రెటరీ ఉమా మహేశ్వర్రావు, మెప్మా టీఎంసీ మౌనిక, సీఓ ఊర్మిళ, రామగుండం పట్టణ సమాఖ్య అధ్యక్షురాలు, స్మైల్ పునరావస కేంద్ర నిర్వాహకులు నూనె లతా మోహన్, నిర్వాహకులు శరత్ మోహన్, మమత తదితరులు పాల్గొన్నారు.