Red Cross Society | రామగిరి, జూన్ 12: రత్నాపూర్ గ్రామపంచాయతీ పరిధిలోని సంజీవ నగర్ లో దళిత కుటుంబానికి చెందిన బెజ్జాల అనిల్-మమత కు పెద్దపెల్లి రేడ్ క్రాస్ సొసైటీ అండగా నిలిచింది. కూలీ పని చేసుకునే అనిల్ కుటుంబం పూరీ గుడిసెలో నివసిస్తుంది. ప్రతీ వర్షాకాలం ఈ గుడిసెలో ఉండడం వారికి, ఇద్దరు పిల్లలకి ఇబ్బందిగా మారింది. గతంలో పక్కనే గోడల వరకు ఆగిపోయిన గృహం ఉంది. ఈ విషయంపై స్థానిక తాజా మాజీ సర్పంచ్ పల్లె ప్రతిమ పీవీరావు రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులకు తెలియజేశారు. దీంతో వారు స్పందించారు.
ఆ ఇంటి నిర్మాణానికి ఆర్థిక సహకారం అందిస్తామని దాతలు ముందుకు వచ్చారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ కావేటి రాజగోపాల్, స్టేట్ మేనేజింగ్ కమిటీ మెంబర్ ఎరబాటి వెంకటేశ్వర్ రావు, రెడ్ క్రాస్ సొసైటీ డిస్ట్రిక్ట్ జనరల్ సెక్రటరీ సాదుల వెంకటేశ్వర్లు, సభ్యులు మీసాల సత్యనారాయణ, పోరండ్ల పరమేశ్వర్,రేకులపల్లి శాశంక, గర్రెపల్లి సంపత్ కుమార్, వేల్పూరి సంపత్ రావు, కంకటి శ్రీనివాస్, బత్తుల రమేష్, పంపాటి శ్రీకాంత్ లు కలిసి ఇప్పటి వరకు 40 సిమెంట్ బస్తాలు, 16 రేకులు, 8 ఇనుప పైపులు, రెండు ట్రిప్పుల బ్రిక్స్, రూ.20వేలునగదు సుతారి ఖర్చు కింద అందజేసీ వారు తమ ఉదారత చాటారు. ఈ సందర్భంగా రెడ్ క్రాస్ సొసైటీకి రత్నాపూర్ మాజీ సర్పంచ్ పల్లె ప్రతిమ పీవీరావు ధన్యవాదాలు తెలిపారు.