కరీంనగర్ కలెక్టరేట్, ఆగస్టు 31 : రాబోయే 48 గంటల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు పడొచ్చని వాతావరణశాఖ హెచ్చరించింది. ఈ మేరకు ప్రభుత్వ ఆదేశాలతో జిల్లాల వారీగా కలెక్టర్లు రంగంలోకి దిగారు. శనివారం కలెక్టరేట్లలో కంట్రోల్ రూములు ఏర్పాటు చేయడంతోపాటు ప్రత్యేక నంబర్లను అందుబాటులోకి తెచ్చారు. ప్రజలు కూడా అలర్ట్‌గా ఉండాలని సూచించారు. ఎక్కడ సమస్య తలెత్తినా సమాచారం అందించాలని కోరారు. ఇటు అధికారులను అప్రమత్తం చేస్తూ ప్రకటనలు ఇచ్చారు. అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని, ఎక్కడ వర్షాల వల్ల ఇబ్బందులు ఏర్పడినా వెంటనే సమాచారం అందించేలా సిబ్బందిని సమాయత్తం చేయాలని నిర్దేశించారు.
లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించేందుకు వీలుగా పునరావాస కేంద్రాలను సిద్ధం చేయాలన్నారు. కరీంనగర్‌కు రెడ్ అలర్ట్ జారీ చేయగా, కలెక్టర్ పమేలా సత్పతి కలెక్టరేట్లో టోల్‌ఫ్రీ నంబర్లను ఏర్పాటు చేశారు. అధికారులు, సిబ్బంది క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలని, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. చెరువులు, వాగులు, కుంటల్లోకి వచ్చే వరదను నిరంతరం పర్యవేక్షించాలని, ఎకడ కూడా గండ్లు పడకుండా పర్యవేక్షించాలన్నారు. లో లెవల్ వంతెనలు, కాజ్‌వేల వద్ద బస్సులు జాగ్రత్తగా నడిపేలా ఆర్టీసీ డ్రైవర్లను అప్రమత్తం చేయాలని సూచించారు. అవసరమైతే వరద ప్రవాహం ఉండే ప్రాంతాల మీదుగా వాహనాల రాకపోకలను నిషేధించాలని, ఇతర ప్రాంతాల మీదుగా దారి మళ్లించాలన్నారు.
కరీంనగర్ కంట్రోల్ రూం నంబర్లు
91878 2997247
8125184683
జగిత్యాల : 1800 425 7620